ప్రవాసులకు ప్రమాద ఘంటికలు!
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:00 AM
అమెరికాలో హెచ్1బీ వీసాలపై ఉన్నవారికి, గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికీ రానున్నకాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. హెచ్1బీ ప్రాసెసింగ్‌లో అనుసరించాల్సిన...
అమెరికాలో హెచ్1బీ వీసాలపై ఉన్నవారికి, గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికీ రానున్నకాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. హెచ్1బీ ప్రాసెసింగ్‌లో అనుసరించాల్సిన నిబంధనల విషయంలో నియామక సంస్థలు చూసీచూడనట్లు పోతుండడం, గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసేటప్పుడు అడ్డదారులు తొక్కడం.. వంటి వాటిని ట్రంప్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి పనుల ద్వారా స్థానిక అమెరికన్లకు దక్కవలసిన ఉద్యోగాలను విదేశాల నుంచి వచ్చిన వారికి కట్టబెడుతున్నారంటూ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. నిబంధనలను ఉల్లంఘించాయంటూ పలు సంస్థలకు ఇటీవల తాఖీదులు కూడా జారీ చేశారు.
‘కష్టించి పనిచేసే అమెరికన్లు పొందగల ఉద్యోగావకాశాలను, సంస్థల మాయాజాలం వల్ల కోల్పోకుండా చూడడమే తమ లక్ష్యం’గా ట్రంప్ సర్కారు ప్రకటించుకుంది. హెచ్1బీ వీసాలు, గ్రీన్‌కార్డ్ పొందడానికి పాటించాల్సిన (PERM– Program Electronic Review Management) నిబంధనల విషయంలో అధికారులు ఇప్పుడు గట్టిగా దృష్టి సారించారు. అమెరికాలోని కంపెనీలు అత్యున్నత వృత్తి నైపుణ్యాలు కలిగిన విదేశీయులను మూడేళ్ల వ్యవధి కోసం కొన్ని ప్రత్యేక ఉద్యోగాలలోకి నియమించుకోవడానికి హెచ్1బీ వీసా వీలుకల్పిస్తుంది. మూడేళ్ల తర్వాత ఈ ఉద్యోగుల నియామకాలను ఆరేళ్లకు పొడిగించవచ్చు. అయితే, హెచ్1బీ విషయంలో ఆయా సంస్థలు లేబర్ కండిషన్ అప్లికేషన్ (LCA)ను బహిరంగంగా ప్రకటించాల్సి ఉంటుంది. దీనిద్వారా హెచ్1బీ ఉద్యోగులకు ఎంత వేతనం చెల్లించాలనుకుంటున్నదీ తమ సంస్థల ప్రాంగణాలలో ఇతర కార్మికులందరికీ తెలిసేలాగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగుల నియామకం కోసం ఏజెన్సీలను ఆశ్రయించడంలో హెచ్1బీ ప్రోగ్రాం దుర్వినియోగమవుతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ వేతనాలు ఇస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం పేర్కొంది.
ఇక, హెచ్1బీ మీద పనిచేస్తున్న ఉద్యోగులు అమెరికాలో శాశ్వత నివాసార్హత పొందే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సందర్భాలలో, వారిని స్పాన్సర్ చేసే నియామక సంస్థ మరిన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఏ ఉద్యోగాల కోసం అయితే విదేశీయులను తీసుకోబోతున్నారో, వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేసి, తద్వారా అర్హత గల అమెరికన్లు ఆ ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడడం లేదని, దరఖాస్తు చేయలేదని నిరూపించుకోవాలి. అందుకోసం ప్రధాన పత్రికలలో వరుసగా రెండు ఆదివారాలపాటు ప్రకటన ఇవ్వాలి, పనిస్థలంలో కనీసం 10 రోజులపాటు ఆ ఉద్యోగాల గురించి నోటీస్ బోర్డులో ఉంచాలి. ప్రభుత్వం అనుమతించిన విధానాలలో అనగా జాబ్ మేళాలు, కంపెనీ వెబ్‌సైట్, ట్రేడ్ జర్నల్స్ ద్వారా కూడా ప్రకటించాలి. ఆ తర్వాత కనీసం 30 రోజులపాటు నిరీక్షించి, ‘ఆ ఉద్యోగాల కోసం స్థానిక అమెరికన్లు రావడం లేదు’ అని స్పష్టంగా రుజువుచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మాత్రమే లేబర్ సర్టిఫికేషన్ అప్లికేషన్ (LCA) ద్వారా గ్రీన్‌కార్డు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలి.
అయితే, అనేక కంపెనీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, అంతగా ఆదరణలేని పత్రికలలో నామమాత్రంగా ప్రకటనలు వేసి వాటితో ఎల్‌సీఏలకు దరఖాస్తు చేయడం, నిబంధనల అమలులో అడ్డదారులు వెతుక్కోవడం వంటివి చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపణ. ఈ వ్యవహారాలన్నింటిపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు చేయబోతున్నారు.
హెచ్1బీ లేదా గ్రీన్‌కార్డులు పొందడంలో ఇలాంటి వ్యవహారాలను తీవ్రంగా పరిగణిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, వాటిని దేశభద్రతతో ముడిపెట్టడానికి సైతం ప్రయత్నిస్తోంది. ఈ అవకతవకలు దేశంలో హింస పెచ్చరిల్లడానికి కారణం అవుతున్నాయని, ఈ వీసా ప్రక్రియల ఉల్లంఘనలు మానవ అక్రమ రవాణాకు దారితీస్తున్నాయని, విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో వస్తున్నవాళ్లు కార్టెల్స్, మాఫియా ముఠాలలో భాగస్వాములు అవుతున్నారని దాని ఆరోపణ. ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు అనేది అమెరికాను తిరిగి సురక్షిత దేశంగా తయారు చేయడానికి ఉద్దేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డజన్లకొద్దీ సంస్థలకు తాఖీదులు పంపినట్లుగా లేబర్ డిపార్ట్మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రకటించారు. నోటీసులు అందుకున్న వాటిలో కాగ్నిజెంట్, విరాట్ సొల్యూషన్స్, ఓక్ టెక్నాలజీస్, గౌరా టెక్ వంటి అనేక సంస్థలున్నాయి. ‘ఇలా అక్రమంగా ఉద్యోగాలు పొందుతున్నవారు వైద్య సంస్థలు, వైద్యుల ఆఫీసులలో కీలక స్థానాలలో ఉంటూ అమెరికన్ సమాజానికి ప్రమాదకరంగా తయారవుతున్నార’ని ఆయన ఆరోపణ.
సంస్థలు నిబంధనలను ఉల్లంఘించకపోయినా, ఉన్న లొసుగులను కొంత వాడుకుంటున్నాయనేది వాస్తవం. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే.. మొత్తంగా అమెరికన్ జాబ్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. వీసా కావాలంటే భారీ రుసుము చెల్లించి తీరాలన్న ట్రంప్ ప్రభుత్వం నిబంధన కోర్టులో చెల్లకుండాపోయింది. ఆ అసహనంతోనే ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులపై ట్రంప్ సర్కారు కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోందనుకోవాలి. ‘అమెరికా ఫస్ట్’ నినాదమూ, ఇక్కడి ఉద్యోగాలన్నీ స్థానిక అమెరికన్లకే దక్కాలన్న వాదనా కలగలసి ఈ దర్యాప్తుల రూపం దాల్చాయి. సర్కారు చెబుతున్న కారణాల్లో కొన్ని భిన్నమైనవీ ఉన్నాయి. ఈ ముసుగులో వేతన చోరీ జరుగుతోందనేది ప్రధాన ఆరోపణ. ప్రాజెక్టుల మధ్యలో ఉండే విరామ కాలానికి హెచ్1బీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా కూర్చోబెడుతూ ‘అన్‌పెయిడ్ బెంచింగ్’ చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. హెచ్1బీ ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించడం కోసం, ఉద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల వంటివి డిమాండ్ చేసే అక్రమాలు కూడా జరుగుతున్నాయట. థర్డ్ పార్టీ ప్లేస్‌మెంట్ ఏజన్సీల ద్వారా కంపెనీలు హెచ్1బీ ఉద్యోగులను తీసుకుంటున్నందువల్ల ఉద్యోగి–సంస్థ మధ్య ఉండాల్సిన బంధాన్ని కూడా స్పష్టంగా పాటించడం లేదని సర్కారు అంటోంది. ఈ వ్యవహారాలన్నింటిపై నిశిత పరిశీలన జరిగి, లోపాలు బయటపడితే ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ప్లేస్‌మెంట్ కంపెనీల మనుగడపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న దర్యాప్తు విధానాలను బట్టి, హెచ్1బీ వీసాలు, ఆ కాలపరిమితి మేర ఉద్యోగ నియమకాలు పొందేవారికి పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ, గ్రీన్‌కార్డు కూడా పొందాలని అనుకునేవారికి మాత్రం చిక్కులు తప్పకపోవచ్చు.
కృష్ణమోహన్ దాసరి
డల్లాస్
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్