Share News

మళ్లీ అదే ఆట..!

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:45 AM

తాత్కాలికమే కావచ్చును గానీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎవరిదీ కాదని ఎన్నికల సంఘం అంటోంది.. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఎవరికి చెందుతాయన్నది తాను తేల్చేవరకూ మమతా బెనర్జీ, రితబ్రత బెనర్జీ వర్గాలు రెండూ వాటిని వాడుకోకుండా ఈసీ నిషేధించింది.

మళ్లీ అదే ఆట..!

తాత్కాలికమే కావచ్చును గానీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎవరిదీ కాదని ఎన్నికల సంఘం అంటోంది.. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఎవరికి చెందుతాయన్నది తాను తేల్చేవరకూ మమతా బెనర్జీ, రితబ్రత బెనర్జీ వర్గాలు రెండూ వాటిని వాడుకోకుండా ఈసీ నిషేధించింది. అక్టోబర్‌ 6న నందిగ్రామ్‌, రెజీనగర్‌ ఉపఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో, ఇంతకు మించిన సమన్యాయం మరేదీ లేదంటూ ఈసీ ఆ రెండు వర్గాలకు వేర్వేరు గుర్తులు ఇచ్చింది. ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అన్న పేరు, దాని గడ్డిపూల గుర్తునీ ఎవరికీ ఇవ్వకపోవడాన్ని రెండువర్గాలను సమానస్థాయిలో ఉంచడంగా, చూడటంగా ఈసీ సమర్థించుకుంది. అంతిమంగా ఈ వర్గాలకు నామకరణం చేసి, గుర్తులు కూడా కేటాయించింది.

అసలు వివాదం అలాగే ఉన్నా, ఈ కొత్త పేరు, గుర్తు విషయంలో మమత లోలోపల సంతోషించి ఉండాలి. పార్టీ పేరులో తన పేరు చేరినందున ఓటరుకు స్పష్టత లభిస్తుంది. ఇక, ఫుట్‌బాల్‌తో ఆమెకు ఉన్న అనుబంధాన్ని కొత్త గుర్తు గుర్తుచేస్తోంది కనుకనే దానిని ఎంచుకొని ఉంటారు. గత ఏడాది డిసెంబరులో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనాల్‌ మెస్సీ కోల్‌కతా పర్యటనలో తీవ్రగందరగోళం జరిగి, మెస్సీకి ఆమె క్షమాపణలు చెప్పుకొనేంతవరకూ పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ, మెస్సీ రాక ఆమెకు ఫుట్‌బాల్‌తో ఉన్న అనుబంధాన్ని మరోమారు గుర్తుచేసింది. అంతకుముందు మెస్సీనుంచి జర్సీ అందుకుంటూ తనకూ బెంగాల్‌కు ఉన్న అనుబంధాన్ని కూడా చెప్పుకున్నారామె. ఫుట్‌బాల్‌ గుర్తుతో ఘనంగా ‘ఆట మొదలైంది’ అన్న అర్థంలో ‘ఖేలా హోబే’ నిర్వహించి ఆ ఆటకూ తన రాజకీయానికి మధ్య ఐదేళ్ళక్రితమే ఆమె ముడివేశారు.


అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతిని, పార్టీ నిలువునా చీలిన నేపథ్యంలో జరుగుతున్న ఈ తొలి ఎన్నికల నుంచి మళ్ళీ ఆటమొదలెట్టానని చెప్పుకోవడానికి ఆమెకు ఈ ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ గుర్తు సందేశాత్మకంగా ఉపకరించవచ్చు. బెంగాల్‌ ప్రజల సంస్కృతిలో ఫుట్‌బాల్‌ ఒక భాగం కనుక, మోహన్‌బగాన్‌, ఈస్ట్‌బెంగాల్‌, మహమ్మదన్‌ స్పోర్టింగ్‌ వంటి ఘనమైన జట్లకు అక్కడ అభిమానగణం ఉన్నది కనుక, మమత ఎంపిక ఏ మేరకు ప్రభావం చూపుతోందో చూడాలి. ఇక, మమత నిరంకుశత్వం మీద తిరుగుబాటు చేశామని చెప్పుకుంటున్నందున కాబోలు, ఆ వర్గం తన కొత్తపేరులో డెమోక్రాటిక్‌ చేర్చుకోవడానికి ఉత్సాహపడింది. దానికి కేటాయించిన ‘ఎన్వెలప్‌’ గుర్తుతో ముడిపెడుతూ విపక్షాలు అప్పుడే జోకులూ, విమర్శలూ ఆరంభించాయి. తృణమూల్‌ చీలికవర్గాల మధ్య వివాదాన్ని ఇప్పటివరకూ ఈసీ తేల్చకుండా, ఆఖరునిముషంలో కొత్తగుర్తులు కేటాయించడానికి ఈ ‘ఎన్వెలప్‌’లో వచ్చిన ఆదేశాలే కారణమని సీజేపీ ఓ విసురు విసిరింది.


సెప్టెంబర్‌ 16న నామినేషన్ల గడువు ముగిసి, రెండువర్గాలు తృణమూల్‌ అధికారిక గుర్తుతో రంగంలోకి దిగాక, గురువారం ఈసీ హడావుడిగా ఈ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయడం విచిత్రం. గత ఐదురోజుల్లో ఈసీ రెండువర్గాలతో రెండుసార్లు సమావేశమైన మాట నిజమే అయినప్పటికీ, చివరకు తీసుకున్న ఈ నిర్ణయంమీద విమర్శలు రేగడం సహజం. తగువు తీర్చే విషయంలో ఈసీ చొరవగా వ్యవహరించలేదన్న విమర్శలకు అరూప్‌రాయ్‌ నేతృత్వంలోని ప్రత్యర్థివర్గానికి ఈసీ ఇచ్చిన వెసులుబాటు కూడా కారణం. మమత ప్రభుత్వం ఓడిన మరుసటి నెలలోనే అప్పటివరకూ పేరూ ఊరూ లేని రితబ్రత బెనర్జీ తెరమీదకు వచ్చి, పార్టీని చీల్చి, తనదే అసలైన తృణమూల్‌ అంటూ ఈసీకి లేఖ రాయడం, మమత మద్దతుదారులు ప్రతిగా స్పందించడం తెలిసిందే. జూలై ౬లోపు మీ వాదనలను నిరూపించుకోండని జూలై 2న ఈ వర్గాలకు ఎన్నికల సంఘం నోటీసులు ఇస్తే మమత గ్రూపు గడువులోగానే పని పూర్తిచేసింది. కానీ, తిరుగుబాటు వర్గం ఆ నియమాన్ని పాటించకుండా నాలుగుసార్లు గడువు పెంచమని అడగడం, మమత అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఈసీ సరేననడం జరిగిపోయాయి. తిరుగుబాటువర్గం అంతిమంగా సెప్టెంబర్‌ 11న పత్రాలు సమర్పించిందట. అప్పటికి ఈ ఉపఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదలైంది. ఇప్పుడు, సమయం చాల్లేదు అంటూ ఈసీ జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులు రేపటి తుదితీర్పుకు సంకేతమని విపక్షాలు భావిస్తున్నాయి. ఇక, నందిగ్రామ్‌లో మమత వర్గం నామినేట్‌ చేసిన సంచితా ప్రధాన్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారితో భేటీ తరువాత పోటీనుంచి తప్పుకోవడం, మమత ఆ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం, సదరు కాంగ్రెస్‌ అభ్యర్థిమీద ఉన్న పాతకేసులేవో తవ్వితీసి అతడిని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయించడం బెంగాల్‌ రాజకీయాలకు మరో మచ్చుతునక.

Updated Date - Sep 19 , 2026 | 12:48 AM