వాణిజ్యం సరే.. విజ్ఞానం సంగతేమిటి?
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:38 AM
కొన్ని కీలక ఘటనలను గుర్తుంచుకోవటం అందరికీ అవసరమే! వ్యక్తుల జీవితాల్లోనూ, దేశాల చరిత్రల్లోనూ అలాంటి ఘటనలు తప్పనిసరిగా ఉంటాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌహార్దం అనే భావాలు రాజకీయాలకు...
కొన్ని కీలక ఘటనలను గుర్తుంచుకోవటం అందరికీ అవసరమే! వ్యక్తుల జీవితాల్లోనూ, దేశాల చరిత్రల్లోనూ అలాంటి ఘటనలు తప్పనిసరిగా ఉంటాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌహార్దం అనే భావాలు రాజకీయాలకు పునాదులు కావాలని చాటిచెప్పిన ఫ్రెంచ్ విప్లవం (1789) అలాంటిదే. బ్రిటీషు వలసపాలనను ఎదిరించి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న అమెరికన్ విప్లవమూ (1776) అలాంటిదే. రష్యన్ అక్టోబర్ (1917) విప్లవమూ అదే కోవలోదే. ఆ మూడు విప్లవాలు కలిగించిన భావాలు ఎన్నో ఎగుడుదిగుడులను చూసినా ప్రపంచాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆధునిక రాజ్యాంగాలన్నీ ఈ భావాల ఆధారంగానే రూపొందాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన అసాధారణ సంఘటనలు.
ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్న ఈ ఘటనలకు భిన్నమైనవీ ఉంటాయి. వాటికి ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం లభిస్తోంది. 1820వ సంవత్సరం అలాంటి ఘటనకు సూచికగా మిగిలిపోయింది. ఆ ఏడాదిలో ప్రజలు విస్తృతంగా పాల్గొని ఎలాంటి విప్లవాన్నీ విజయవంతం చేయలేదు. కానీ ఒక మహా ఆర్థిక పరిణామానికి కొండగుర్తుగా మాత్రం అది నిలిచిపోయింది. ఆ ఏడాది నాటికి చైనా, భారత్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అగ్రస్థానాన్ని కోల్పోయాయి. యూరప్ ఆధిపత్యం అన్నింటా మొదలైంది. అమెరికా ఆ దిశగా అడుగులు వేయటమూ ఆరంభమైంది. ఎంతో ప్రగతితో, ఎన్నో యుద్ధాలతో, ఎన్నో విధాల దోపిడీలతో కాలచక్రం గిర్రున తిరిగింది. రెండు వందల ఏళ్లు గడిచాయి. 2020 నాటికి చైనా తన ఆర్థిక అగ్రస్థానాన్ని తిరిగి సంపాదించుకుంది. భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందనే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వస్తుసేవల ఉత్పత్తిలో కాస్త అటూఇటుగా 60శాతం వాటాను ఆసియా ఖండం మళ్లీ సంపాదించుకుంది. కరెన్సీ కొనుగోలు శక్తిలో తేడాలను (పర్చేజింగ్ పవర్ పారిటీ) పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టిన ఈ అంచనాలు ఎక్కువగా కనపడొచ్చు. ఇతరత్రా ప్రమాణాల ప్రకారం చూసినా ఆ పరిణామమే స్పష్టమవుతుంది. అందుకే ఆర్థికరంగాన ఆసియా జైత్రయాత్రపై ఇప్పుడెవరికీ అనుమానాల్లేవు. అధిక జనాభా (450 కోట్లు) వల్ల ఆసియా తలసరి ఆదాయాలు అమెరికా, యూరప్‌లతో పోల్చితే తక్కువగా కనపడొచ్చు. అవి కూడా వేగంగా మారుతున్నాయి. రోజుకు మూడు డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆసియాలో ప్రస్తుతం 5శాతం లోపుగానే ఉన్నారు. చైనాలో 1980 నాటికి 75 నుంచి 80 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువున ఉండేవారు. 2010 వచ్చేసరికి వారి సంఖ్య 10 శాతానికి దిగువకు పడిపోయింది. 30 ఏళ్లలో ప్రజల జీవితాల్లో ఇంతటి మార్పు వచ్చిన సంఘటన ప్రపంచ చరిత్రలోనే లేదు. అమెరికా, యూరప్ చరిత్రల్లో ఏ దశలోనూ దీన్ని చూడలేం. ప్రజాస్వామ్య దేశాల్లో మాదిరి రాజకీయ, భావప్రకటనా హక్కులు లేకపోయినా, ప్రజల నుంచి వచ్చే నిరంతర ఒత్తిళ్లు నాయకులను ప్రభావితం చేసే పరిస్థితులు లేకపోయినా అనూహ్యమైన ఆర్థికప్రగతి అక్కడ సాధ్యమైంది.
ఒకవైపు ఆసియా ప్రజల నిజవేతనాలు గణనీయంగా పెరుగుతూ ఉంటే అమెరికాలో మాత్రం వాటిల్లో పెద్దగా ప్రగతిలేదు. ముఖ్యంగా 1973 నుంచి 2015 మధ్యకాలంలో నిజవేతనాల్లో (ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేసిన తర్వాత లెక్కకట్టే నికర వేతనాలు) పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది. 1973 వరకూ నిజవేతనాల్లో 91.3శాతం పెరుగుదల ఉంటే ఆ తర్వాత అది 11.1శాతానికే పరిమితమైంది. 1973 వరకూ ఉత్పాదకతలో (ప్రొడక్టివిటీ) పెరుగుదల 96.7 ఉంటే వేతనాల్లో ప్రగతి 91.3శాతంగా నమోదైంది. మనం ఘనంగా చెప్పుకునే ప్రపంచీకరణ యుగంలో (1973–2015) ఉత్పాదకతలో 73.4శాతం పెరుగుదల ఉంటే వేతనాలకు వచ్చేసరికి అది 11.1 శాతానికి పరిమితమవ్వటంతో.. ఎంతో అశాంతికీ అసంతృప్తికీ దారితీసింది. తయారీ రంగం కుంగిపోయింది. లక్షల ఉద్యోగాలు పోయాయి. విదేశీ ఉత్పత్తుల దిగుమతులు పెరిగాయి. ఉద్యోగాల కోసం వలసవచ్చిన ప్రజల నుంచి గట్టి పోటీ వచ్చింది. ఐటీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో వేతనాల్లో పెరుగుదల ఉన్నా ఆసియా ప్రజలు వాటిల్లో ముందుండటం స్థానిక యువతను ఒత్తిళ్లకు గురిచేసింది. 2015 నాటికి అమెరికా అంతటా అభద్రతా భావమూ అసంతృప్తీ అలముకున్నాయి. అసమానతలూ విపరీతంగా పెరిగాయి. 1965లో కార్మికుడితో పోల్చితే సీఈఓ వేతనం 20 రెట్లు అధికంగా ఉండేది. 2013కు వచ్చేసరికి అది 296 రెట్లు అయింది. ఆదాయ అసమానతలకు దీనికి మించిన ఉదాహరణ లేదు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిణామాలను ఆధారంచేసుకుని అమెరికాకు పూర్వవైభవాన్ని తెచ్చిపెడతాననీ, మళ్లీ పరిశ్రమలను తెరిపిస్తాననీ వాగ్దానం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చారు. రెండోసారి ఆ నినాదాలతోనే ఎన్నికల్లో నెగ్గారు.
ఆసియా ఆర్థిక జైత్రయాత్రను అడ్డుకోవటం ట్రంప్‌కు గానీ అమెరికా పాలకవర్గాలకు గానీ ప్రధాన లక్ష్యంగా మారినా అది సాధ్యమయ్యే పనిగా కనపడటంలేదు. ఇటీవల కాలంలో భారత్‌ను ఎన్నోరకాలుగా హేళనచేస్తూ మాట్లాడినా చివరికి వాణిజ్య ఒప్పందానికి అంగీకరించక తప్పలేదు. ఈ ఒప్పందం లోని విషయాలు ఇంకా పూర్తిగా వెల్లడికాకపోయినా అది అమెరికాకు అనుకూలంగా ఏకపక్షంగా ఉంటుందని ఏ విధంగానూ అనుకోలేం. ఆర్థికశక్తి.. రాజకీయాలను, ఇతర విధానాలను నిర్ణయిస్తుందని అనుకుంటే భారత్‌ను విస్మరించగలిగే స్థితిలో అమెరికా లేదు. యూరప్ పరిస్థితి కూడా అంతే. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందమే అందుకు నిదర్శనం. ఇక చైనాను నియంత్రించటానికి చేస్తున్న ఏ ప్రయత్నమూ ఇప్పటిదాకా ఫలించలేదు. అందుకే వాణిజ్యసుంకాల వ్యవహారంలో చైనాపై దూకుడును అమెరికా తగ్గించుకుంది. చైనా, భారత్‌లను కాదని వ్యవహారాలను నెగ్గుకురావటం అన్నివిధాలా కష్టంగా మారింది.
యూరప్‌తోనూ, అమెరికాతోనూ వాణిజ్య ఒప్పందాలు కుదిరినంత మాత్రాన భారత్ ముందున్న సవాళ్ల తీవ్రత తగ్గిపోదు. లభించిన ఉపశమనంతో ఉప్పొంగిపోయే పరిస్థితీ లేదు. వస్తు తయారీ, విద్య, ఆరోగ్యం, కృత్రిమమేధా రంగాల్లో, పర్యావరణ పరిరక్షణలో చైనాతో పోల్చితే భారత్ పురోగతి చక్కగా ఉందని చెప్పుకునే పరిస్థితి లేదు. తయారీరంగాన్నే తీసుకుంటే 2010 నుంచి ఇప్పటివరకూ జీడీపీలో దాని వాటా 15–16శాతం మధ్యే అటూఇటూ తిరుగుతోంది. చైనాలో అది ఇప్పటికీ దీనికి రెట్టింపు ఉంది. విద్య, ఆరోగ్య రంగాల ఖర్చులో ఎదుగుబొదుగు లేకుండానూ.. కొన్ని సందర్భాల్లో తగ్గుదల కూడా కనపడుతోంది. కేంద్ర బడ్జెట్‌లో పాఠశాల విద్యకు 2014–15లో 3.07శాతం కేటాయింపులు ఉంటే అవి 2024–25 నాటికి 1.53శాతానికి పడిపోయాయి. ఉన్నత విద్యారంగంలోనూ (1.06శాతం నుంచి 1శాతం) ఇదే కనపడుతుంది. ఆరోగ్యరంగం కూడా అంతే. 2014లో రెండుశాతం ఉన్న కేటాయింపులు 2026కు వచ్చేటప్పటికీ 1.99శాతం అయ్యాయి. పన్ను వసూళ్లలో కూడా పెద్దగా ప్రగతి కనపడటం లేదు. జీడీపీలో పన్నుల శాతం 10 నుంచి 12 శాతానికి మించటం లేదు. చైనాలో అది 17 నుంచి 19 శాతం దాకా ఉంది. పన్ను వసూళ్లలో ఎదుగుదల లేకపోవటంతో అప్పులూ తగ్గటం లేదు. 2014లో కేంద్రం చేసే ఖర్చులో 30శాతం డబ్బు అప్పుగా తీసుకున్నదే ఉంటే, 2026కు వచ్చేటప్పటికీ 31.7 శాతమైంది.
ఏ రంగం తీసుకున్నా 2014 నుంచి ఇప్పటివరకూ ఇదే పరిస్థితి కనపడుతోంది. మౌలిక మార్పులంటూ పెద్దగా కనపడవు. ఆస్తుల కల్పనకు పెట్టే ఖర్చు మాత్రం కేంద్ర బడ్జెట్‌లో పెరుగుతోంది. పన్నెండేళ్ల క్రితం అది 2 లక్షల కోట్లు ఉంటే ఈ ఏడాది బడ్జెట్‌లో దాన్ని 12 లక్షల కోట్లకు పెంచారు. ఈ పెరుగుదలతో కొన్ని మౌలిక సదుపాయాల విస్తరణ, ఆస్తుల కల్పన జరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో నూటికి నూరుపాళ్లూ భారత్ ఉత్పత్తులివీ అని చెప్పుకొనే పరిస్థితి ఇంకా రాలేదు. అప్పటికే విదేశాల్లో అభివృద్ధై అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఉత్పత్తి చేస్తున్న వస్తువులే ఎక్కువ. సొంతంగా శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు లేకుండా స్వదేశంలో ఎన్ని వస్తువులను తయారుచేసినా, విడిభాగాల అమరికలో ఎంత నైపుణ్యాన్ని సాధించినా విశ్వగురువు స్థానాన్ని సంపాదించలేం. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే మనం రెండో స్థానంలో ఉన్నాం. కానీ ఏ ఫోనునీ భారత్ ఆవిష్కరించిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైందని చెప్పుకోలేం.
ప్రపంచ ఆర్థికవ్యవస్థలో 1820 నాటికి ఉన్న అగ్రస్థానాన్ని చైనా తిరిగి సాధించటమే గాక, దాన్నింకా పెంచుకుని విస్తృతపరచుకుంటోంది. భారత్ ఆ దిశగా లక్ష్యాన్ని చేరాలంటే చేయాల్సింది చాలానే ఉంది. ఆ వైభవం అంత తేలికగా రాదు. రాజకీయ చతురతతో పాటు ఆర్థిక ప్రగతి ఫలాలను అందరికీ అందేలా చూడాలి. భిన్నమతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వ్యవహరించటం చాలా సంక్లిష్టతతో కూడినది. చైనాకు ఇన్ని సంక్లిష్టతలు లేవు. ఇంతగా సమన్వయతలను సాధించాల్సిన అవసరమూ లేదు. కేంద్రీకృతపాలన చుట్టూ చైనా చరిత్ర తిరిగింది. భారత చరిత్ర వికేంద్రీకరణ పాలన చుట్టూ తిరిగింది. ఆ వికేంద్రీకరణ వల్లే ఇన్ని భాషలూ, ఆ భాషలాధారిత సంస్కృతీ, సాహిత్యాలూ ఇక్కడ వెలుగొందాయి. దీన్ని గుర్తించకుండా కేంద్రీకృతంగా ఏది రుద్దినా సాధించేది తక్కువ.. నష్టపోయేది ఎక్కువ!
రాష్ట్రాలకు రావాల్సిన నిధులను రాకుండా చేయటం... కేంద్ర పథకాల్లో రాష్ట్రాల వాణిని తగ్గించటం మన చరిత్రగతికే విరుద్ధం! సెస్సులు, సర్‌చార్జీల పేరుతో నిధులను పెంచుకుంటూ రాష్ట్రాలకు పంచాల్సిన పన్ను ఆదాయాల నుంచి వాటిని మినహాయించటం ఈ ఏడాది నుంచైనా పోతుందని అనుకుంటే అవి మరో అయిదేళ్లు కొనసాగనున్నాయి. 16వ ఆర్థిక సంఘం కూడా కేంద్రం కోరుకున్న విధంగానే ఆ విషయంలో సిఫార్సులు చేసింది. ఆ విధంగా వద్దని రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదు. కేంద్రం వసూలుచేసే ప్రతిరూపాయిలో 11 పైసలు సెస్‌లూ, సర్‌చార్జీల రూపేణా మరో అయిదేళ్లూ కొనసాగుతాయి. కేంద్రం వసూలు చేసే పన్నులో రాష్ట్రాల వాటా 45 నుంచి 50శాతానికి పెంచాలన్న డిమాండునూ పరిగణనలోకి తీసుకోలేదు.
చరిత్రలో ఒకనాటి ఉన్నత స్థానాన్ని అందుకోటానికి అన్ని దేశాలకు అవకాశం రాదు. చైనా, భారత్‌లకు ఈ శతాబ్దంలో అది లభించింది. దురాక్రమణలతో, స్థానిక జాతుల హననంతో, వలస దోపిడీలతో అవి ఒకనాడు ఆ స్థానాన్ని పొందలేదు. పాశ్చాత్య దేశాలు మాత్రం ఆ స్థానాన్ని అలాగే దక్కించుకున్నాయి. పూర్వవైభవం సాధించాలంటే హిందూత్వ ఆధిక్యతను, ఆధిపత్యాన్ని పదేపదే వల్లెవేయటం వల్ల ప్రయోజనం ఉండదు. సుదీర్ఘ చరిత్రలో మనకు బలాలుగా నిలబడ్డ వాటిపైనే ఆధారపడాలి. ఆధునిక ప్రపంచం అందించిన వైజ్ఞానిక దృష్టిని అలవర్చుకోవాలి. సొంత ఆవిష్కరణల్లోనూ ముందుకు వెళ్లాలి.
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు