Share News

తిరుమల తిరుపతికి శాశ్వత తాగునీటి పథకమేదీ?

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:08 AM

ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు తిరుమల–తిరుపతికి వస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం తిరుపతిలోనే నిర్వహిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు తిరుపతిలో జరుగుతాయి.

తిరుమల తిరుపతికి శాశ్వత తాగునీటి పథకమేదీ?

ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు తిరుమల–తిరుపతికి వస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం తిరుపతిలోనే నిర్వహిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు తిరుపతిలో జరుగుతాయి. ఇంతటి ప్రాచుర్యం గల పట్టణానికి శాశ్వత తాగునీటి వసతి లేదు. తిరుపతిలో దాదాపు లక్ష ఇళ్లకు తాగునీరు సరఫరా చేయాలి. తిరుమలకు ప్రతిరోజూ లక్ష మంది వరకూ యాత్రికులు వస్తుంటారు. తిరుమల, తిరుపతిలలో ప్రతి యాత్రికుడు కనీసం మూడు రోజులు గడుపుతాడు.

ఇక తిరుపతి కార్పొరేషన్‌ను విస్తరిస్తే పలు గ్రామాల తాగునీటి బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్‌పై పడుతుంది. నిన్న మొన్నటి వరకు ఇది స్మార్ట్ సిటీ జాబితాలో ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పట్టణాన్ని ‘ప్రగతి’ పథకం కింద ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతికి శాశ్వత ప్రాతిపదికన తాగునీటి వసతి ఉండి తీరాలి. గమనార్హమైన అంశమేమంటే తిరుమలలో ఉండే మినీ జలాశయాలను మినహాయిస్తే తిరుమల తిరుపతి దాహార్తిని తీర్చే ప్రధానమైన వనరు కల్యాణి డ్యామ్‌. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.910 టీఎంసీలైతే, వర్షాభావంతో ఈ ఏడాది అక్టోబరు 5 నాటికి అందులో కేవలం 0.204 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

దురదృష్టం కొద్దీ వర్షాభావంతో పాటు ఎల్‌నినో కూడా వచ్చే సంవత్సరం వరకూ కొనసాగితే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం పరిస్థితి ఏమిటి? కేవలం కండలేరు జలాశయంపై ఆధారపడాలి. అందులోనూ 68 టీఎంసీలకు ప్రస్తుతం 17 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. క్రమంగా డెడ్ స్టోరేజ్‌కి చేరుతోంది. తిరుమల తిరుపతి శాశ్వత తాగునీటి పథకంపై ఇంజినీరింగ్ అధికారులు గానీ, స్థానిక ప్రజాప్రతినిధులు గానీ, టీటీడీ బోర్డు గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమగ్రంగా వివరించినట్లు లేదు. ప్రజాప్రతినిధులు తమ అవసరాల రీత్యా అనేక ప్రతిపాదనలు చేస్తుంటారు. కానీ వాటి సాధ్యాసాధ్యాలు, సాంకేతిక ఇబ్బందులను ఇంజినీరింగ్ అధికారులు ముఖ్యమంత్రికి సవివరంగా నివేదించాలి. ప్రధానంగా ఇంజినీర్‌ ఇన్ చీఫ్ జాగరూకత వహించాలి.


2025 జూన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా గాలేరు–నగరి రెండో దశలో భాగంగా బాలాజీ రిజర్వాయర్ ద్వారా తిరుమల తిరుపతి ప్రజల దాహార్తిని తీరుస్తామని ప్రకటించారు. అంతేకాదు, ఏర్పేడు సమీపంలో గల మేర్లపాక చెరువు నుంచి కండలేరు జలాలను ఎత్తిపోతల ద్వారా బాలాజీ రిజర్వాయర్‌లో నింపుతామని ప్రకటించారు.

సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో చంద్రబాబు మకాం చేసినప్పుడు కూడా హంద్రీ–నీవా ఫేజ్‌–2లో భాగమైన నీవా కాలువ నుంచి రూపొందించిన పథకం ద్వారా కృష్ణా జలాలను కల్యాణి జలాశయంలో నింపుతామని ప్రకటించి, పునాది రాయి వేశారు. ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. ఇదిలా ఉండగా ఈ మధ్య మదనపల్లిలో జరిగిన రాయలసీమ రైజింగ్ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందని ప్రకటించారు. అసలు తిరుమల తిరుపతి తాగునీటికి ఏ పథకం ఉద్దేశించారు? వాస్తవంలో, జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించే సమయంలో ఆయా శాఖాధికారులు స్థానిక అంశాలపై ఫీడింగ్ ఇస్తారు. అలా అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.


రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి తాగునీటి అవసరాలకు రెండు రిజర్వాయర్లను అమలులోకి తెచ్చే విధానపరమైన నిర్ణయం తీసుకున్నదా? అదే నిజమైతే ముఖ్యమంత్రి విధిగా ప్రకటించేవారు. అంతేకాదు, హంద్రీ–నీవా నీళ్లు కల్యాణి డ్యామ్‌కు రావాలంటే ఏడెనిమిది ఎత్తిపోతల ద్వారా, రమారమి 700 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. బహుశా ఆంధ్రప్రదేశ్‌లోనే ఏ పట్టణానికీ ఇలాంటి తరహాలో తాగునీటి పథకం అమలు జరగలేదేమో. ఇంజినీరింగ్ అధికారులు ముఖ్యమంత్రికి సాంకేతిక సంబంధమైన చిక్కులను వివరించి ఉంటే ఆయన అంగీకరించేవారు కాదేమో. ఒకవేళ ఇంతకు మించి వేరే అవకాశం లేదా పథకం లేకపోతే తప్పనిసరిగా దీన్నే అంగీకరించాలి. మరోవైపు 300 కిలోమీటర్ల దూరంలో, పూర్తి గ్రావిటీతో బాలాజీ రిజర్వాయర్ గురించి ముఖ్యమంత్రి పలుమార్లు ప్రకటించి ఉన్నారు. ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే తిరుపతి ఎమ్మెల్యేతో పాటు మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్న నేతలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమే విషాదం. గాలేరు–నగరి సుజల స్రవంతి పట్టాలెక్కిన 2006లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన రెండో దశకు 10 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. ప్రతిపాదించిన ఏడు రిజర్వాయర్లలో మూడు టీఎంసీల సామర్థ్యంతో బాలాజీ రిజర్వాయర్ కూడా ఉంది. ఇందులో ఒక టీఎంసీ నీళ్లు తిరుమల తిరుపతి శాశ్వత తాగునీటికి ఉద్దేశించారు. అప్పట్లో టెండర్లు పూర్తయినా తట్టెడు మట్టి కూడా పడలేదు.

రాష్ట్ర విభజనానంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత కదలిక వచ్చింది. పాత కాంట్రాక్టర్ల స్థానంలో కొత్తవారు వచ్చారు. 250 కోట్ల వ్యయంతో ఉన్న బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం ప్రస్తుతం ఎటూకాకుండా ఉంది. దాదాపు 50 కోట్ల రూపాయల పనులు జరిగాయి. ఫస్ట్ ఫేజ్‌కు అటవీశాఖ అనుమతి కూడా లభించింది. అయితే 2019లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క జీవోతో రాష్ట్రంలోని 350 టెండర్లు రద్దు చేశారు. ఇందులో ఆయన తండ్రి వై.యస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన టెండర్లు కూడా ఉన్నాయి.


ఇలా రద్దయిన టెండర్లలో నిర్మాణంలో ఉన్న బాలాజీ రిజర్వాయర్‌తో పాటు గాలేరు–నగరి రెండో దశకు చెందిన అన్ని టెండర్లూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు గడచినా యథాస్థితే కొనసాగుతోంది. ఇటీవల ప్రతిపాదనకు వచ్చిన హంద్రీ–నీవా పథకానికి టెండర్లు పిలిచారు. ఏళ్ల తరబడి నానుతూ ఉన్న బాలాజీ రిజర్వాయర్ మాత్రం ముఖ్యమంత్రి ప్రకటనలకు, కాగితాలకే పరిమితమైంది. గాలేరు–నగరి పథకంలో... కడప జిల్లాలోని గండికోట జలాశయం 26 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైంది. ఇక్కడ ఎప్పుడూ నీళ్లు ఉంటున్నాయి. నీటి ఎద్దడి రోజుల్లో కూడా 300 కి.మీ. లోపు దూరం నుంచి బేషుగ్గా గ్రావిటీతో బాలాజీ రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అనేకసార్లు బాలాజీ రిజర్వాయర్ గురించి చెబుతున్నారు. వచ్చిన చిక్కేమిటంటే స్థానికంగా పట్టించుకునేవారు లేరు. కూటమికి చెందిన మూడు పార్టీల నేతలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చి ఈ గందరగోళానికి తెర దింపేందుకు సిద్ధంగా లేరు!

- వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయుడు

Updated Date - Oct 13 , 2026 | 01:09 AM