Share News

సింథటిక్ పామాయిల్‌తో ఆధ్యాత్మిక దాడి!

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:06 AM

దేశవ్యాప్తంగా కోట్లాది హిందువుల విశ్వాసానికి చిహ్నమైన తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ భక్తుల నమ్మకాలపై, వైసీపీ పాలనలో వ్యవస్థీకృతంగా దాడి చేశారు. ఆ దోపిడీ విలువ రూ.250 కోట్లు అని సీబీఐ తేల్చింది.

సింథటిక్ పామాయిల్‌తో ఆధ్యాత్మిక దాడి!

దేశవ్యాప్తంగా కోట్లాది హిందువుల విశ్వాసానికి చిహ్నమైన తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ భక్తుల నమ్మకాలపై, వైసీపీ పాలనలో వ్యవస్థీకృతంగా దాడి చేశారు. ఆ దోపిడీ విలువ రూ.250 కోట్లు అని సీబీఐ తేల్చింది. ఇది కేవలం ఆర్థిక అవినీతి మాత్రమే కాదు, లడ్డూపై ఆధ్యాత్మిక దాడి. భక్తులు శ్రీవారి ఆశీర్వాదంగా భావించే లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి స్థానంలో పామాయిల్, పారిశ్రామిక రసాయన మిశ్రమాలతో భక్తులను వంచించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై ఈ దాడులు ఏమరుపాటున జరిగినవి కావు. నాలుగు సంవత్సరాల పాటు అప్పటి దేవస్థానం ఈవో, చైర్మన్లకు పూర్తిగా తెలిసే జరిగాయి.

జూన్ 2024లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లడ్డూ నాణ్యతపై గత నాలుగేళ్లుగా పేరుకుపోయిన ఫిర్యాదులను పరిష్కరించడానికి గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) ద్వారా పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. సేకరించిన నమూనాల ఆధారంగా ఎన్డీడీబీ– సీఏఎల్ఎఫ్ లేబొరేటరీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. స్వచ్ఛతకు కీలక ప్రమాణమైన ‘ఎస్‌–వాల్యూస్‌’లో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. స్వచ్ఛమైన పాల కొవ్వులో ఈ ‘ఎస్‌’ విలువ 98.05 నుంచి 104.32 పరిధిలో ఉండాలి, అయితే ఎన్డీడీబీకి టీటీడీ పంపించిన నమూనాలలో ఇది 19.72గా మాత్రమే ఉంది.

ఎన్డీడీబీ విశ్లేషణలో, పాలలో ఉండే కొవ్వు కాకుండా, ఇతర కొవ్వు పదార్థాలు కలిశాయని, నెయ్యిలో జంతువుల కొవ్వు అంటే బీఫ్ టాలో (ఎద్దు కొవ్వు), లార్డ్ (పంది కొవ్వు), చేప నూనెతో పాటు సోయాబీన్, సన్‌ఫ్లవర్, పత్తి గింజల నూనె వంటి కూరగాయల నూనెలు ఉండవచ్చని ప్రాథమికంగా సూచించింది. దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 2024లో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరుస్తూ, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటుగా, సీబీఐ అధికారులతో కూడిన స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ సిట్ విచారణ ప్రారంభంలోనే అసలు నాలుగేళ్ల పాటు లడ్డూ తయారీలో వాడింది నెయ్యే కాదు, ‘నెయ్యి’ అనే పామాయిల్ కాక్టెయిల్ కెమికల్ మిశ్రమం అనే దిగ్ర్భాంతికరమైన వాస్తవం బయటపడింది. సిట్ తన విచారణలో భాగంగా తిరిగి మరోసారి గుజరాత్‌ ఎన్డీడీబీతో పాటు హర్యానాకు చెందిన ఐసీఏఆర్–ఎన్డీఆర్ఐకి కూడా నెయ్యి శాంపిల్స్ పంపించి పరిశోధన చేయించింది. దీంతో ఆధ్యాత్మిక అరాచకాలన్నీ బయటపడ్డాయి.


వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన బోర్డు కనుసన్నలలోనే ఉత్తర భారతానికి చెందిన కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి దేవస్థానం కొనుగోలు చేసిన నెయ్యి, అసలు నెయ్యే కాదని, అది రసాయనికంగా రూపొందించిన ఒక సింథటిక్ ఉత్పత్తి అని సిట్ నిర్ధారించింది. ఆవు నెయ్యి లక్షణాలను అనుకరించడానికి సరఫరాదారులు నెయ్యికి సహజంగా ఉండే మెరిసే రంగును అద్దడానికి బీటా–కెరోటిన్ అనే కెమికల్‌ను, నెయ్యి స్వచ్ఛత పరీక్షలలో పట్టుబడకుండా తప్పించుకోవడానికి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ అనే రసాయనాన్ని, కొవ్వు లాగా చూపించడానికి కొరియా దేశం నుంచి దిగుమతి చేసుకున్న మోనోగ్లిజరైడ్లను వాడారు. ఇంకా లాక్టిక్ యాసిడ్, శానిటేషన్ కెమికల్స్‌లో వాడే లంగర్ అనే యాసిడ్ తదితరాలను వాడి, అది నెయ్యి అని భ్రమింపజేశారు.

సిట్ తన దర్యాప్తులో భాగంగా రెండు సంస్థల ప్రయోగశాలల నుంచి పొందిన నివేదికల ప్రకారం– అప్పటికే ఒకసారి పరీక్ష చేసి జంతు కొవ్వు ఉన్నదని చెప్పిన ఎన్డీడీబీ– కాఫ్ ల్యాబ్ తన రెండో నివేదికలో– ఆ నెయ్యి, పామాయిల్, పామ్ స్టియరిన్, పామ్ కెర్నల్ నూనెల మిశ్రమమని, అందులో పాల కొవ్వు దాదాపు లేదని సూచించింది. అయితే కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల జంతువుల కొవ్వు ఉండే అవకాశం ‘చాలా తక్కువ’ అని, మోనోగ్లిజరైడ్లలో పది శాతం కంటే తక్కువ ఉన్న జంతువుల కొవ్వును లెక్కించడం సాధ్యం కాదని పేర్కొంది. ఐసీఏఆర్–ఎన్డీఆర్ఐ మాత్రం జంతువుల కొవ్వును పరీక్షించడానికి పీసీఆర్– ఆధారిత పద్ధతిని ఉపయోగించామని, పరీక్షించిన నాలుగు నమూనాలలో లార్డ్ (పంది కొవ్వు) కనిపించలేదని నివేదించింది. అయితే, ఇటువంటి విశ్లేషణ చేయడం తమకు ఇదే మొదటిసారి అని ఎన్డీఆర్ఐ తన నివేదికలో ఒప్పుకుంది. అంతేకాకుండా, రెండు సంస్థలు కూడా కనుగొన్న మోనోగ్లిజరైడ్లు మొక్కల కొవ్వు నుంచి వచ్చాయా లేదా జంతువుల నుంచి వచ్చాయా అనే విషయాన్ని సిట్ పేర్కొనలేదు. పామాయిల్ కెమికల్ మిశ్రమాలను నెయ్యి బదులు వాడడం, ఏదో ప్రమాదవశాత్తు జరిగింది కాదని, సరఫరాదారులను మార్చి, ఉద్దేశపూర్వకంగా లడ్డూ నాణ్యతను నీరుగార్చారని సిట్ వెల్లడించింది.

లడ్డూల నాణ్యత మీద భక్తుల ఫిర్యాదులు ఎక్కువైపోగా 2022 మే నెలలో, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మైసూర్‌కు నెయ్యి నమూనాలను పంపింది. ఆ సంస్థ పరీక్షించి ఆ నెయ్యిలో పాలకు సంబంధించి కాకుండా ఇంకేవో కొవ్వు పదార్థాలు కనుగొన్నామని, కూరగాయల నూనె కల్తీకి కొండ గుర్తు అయిన ‘బీటా–సిటోస్టెరోల్’ ఉండటాన్ని గుర్తించామని, హానికరమైన పదార్థాలు మిశ్రమంగా ఉన్నాయని తొలి నివేదిక ఇచ్చింది. అయినా ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు పట్టించుకోకుండా ఆ కంపెనీలకే అదనపు సరఫరా ఆర్డర్లు కొనసాగించారు.

తిరుమల పవిత్రతను పునరుద్ధరించే పోరాటం ఇప్పుడు కేవలం పరిపాలనాపరమైన విషయం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక పునరుద్ధరణ మిషన్. ఈ ప్రక్రియను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది.

-నీలాయపాలెం విజయ్‌కుమార్

Updated Date - Feb 14 , 2026 | 01:06 AM