Share News

పులుల రక్షణలో మిగిలిన కర్తవ్యం

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:39 AM

పులుల సంరక్షణలో స్థానిక అటవీ సమాజాలను మినహాయించడం సబబేనా? ఇరవై సంవత్సరాల క్రితం (2005 ఆగస్టు 5న) టైగర్‌ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక (‘జాయినింగ్‌ ది డాట్స్‌’ అనేది దాని శీర్షిక) నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు సమర్పించాము.

పులుల రక్షణలో మిగిలిన కర్తవ్యం

పులుల సంరక్షణలో స్థానిక అటవీ సమాజాలను మినహాయించడం సబబేనా? ఇరవై సంవత్సరాల క్రితం (2005 ఆగస్టు 5న) టైగర్‌ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక (‘జాయినింగ్‌ ది డాట్స్‌’ అనేది దాని శీర్షిక) నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు సమర్పించాము. వన్య జంతువులలో అత్యంత ప్రధానమైనది, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పెద్ద పులుల సంరక్షణకు ఒక అజెండాను రూపొందించేందుకు మన్మోహన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నేతృత్వ బాధ్యతలను నాకు అప్పగించారు. రాజస్థాన్‌లోని సరిస్కా జాతీయ ఉద్యానవనం నుంచి చివరి పులి కూడా అదృశ్యమయిందని జర్నలిస్ట్‌ జాయ్‌దేవ్‌ మజుందార్‌ పరిశోధనాత్మక కథనం వెలువడిన వెన్వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. పర్యావరణ పరిరక్షణలోను, వన్య ప్రాణుల సంరక్షణలోను సువిఖ్యాతులైన మాధవ్‌ గాడ్గిల్‌, వాల్మీక్‌ ధాపర్‌, హెచ్‌ఎస్‌ పన్వార్‌, సమర్‌సింగ్‌ సభ్యులుగా ఉన్న ఆ కమిటీ సారథ్య బాధ్యతలను నాకే ఎందుకు అప్పగించారో ఇప్పటికీ నాకు తెలియని విషయమే. ఆ కమిటీ సారథ్యం చాలా క్లిష్టమైన బాధ్యత అని నాకు తెలుసు. ఎందుకంటే కఠిన నిర్ణయాలను నిక్కచ్చిగా తీసుకోవలసి ఉంటుంది. సరిస్కా జాతీయ ఉద్యానవనం నుంచి చివరి పులి అదృశ్యమవడంతో ప్రభుత్వ ప్రతిష్ఠకు కళంకమేర్పడింది. నిజంగా అదొక లజ్జాకరమైన విషయం. అయితే నేను కేవలం పులుల సంరక్షణకే ప్రాధాన్యమివ్వలేదు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, వాటి పరిధిలోని మానవ ఆవాసాల మధ్య ఒక సమతౌల్యత నెలకొల్పడంపై నేను దృష్టి పెట్టాను. దీనిపై మా కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ మా బాధ్యతల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించాము. పులుల సంరక్షణకు చేపట్టవలసిన చర్యలు ఏమిటో స్పష్టంగా నిర్దుష్టంగా మేము మూడు నెలల్లో సిఫారసు చేయవలసి ఉంటుంది. తొలుత మేము సరిస్కా జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించాము. పులి జనాభాను ఎలా లెక్కిస్తున్నారనేది మొదటి ప్రశ్న. అప్పటికి చాలా సంవత్సరాలుగా అధికారిక రికార్డుల్లో పులుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. దశాబ్దాల క్రితం పన్వర్ మొదలైన అభివృద్ధిపరిచిన పులి పాద ముద్రల గుర్తింపు పద్ధతి శాస్త్రీయమైనది, విశ్వసనీయమైనది. అధునాతన గణాంక పద్ధతులను ఉపయోగించే స్పేటియల్‌ సర్వే పద్ధతిని చాలా తర్జన భర్జనల అనంతరం అంగీకరించడం జరిగింది. పులుల గణన కచ్చితమైనదిగాను, విశ్వసనీయమైనదిగాను చేసేందుకు వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు వైవి ఝాలా, ఖమర్‌ ఖురేషి విశేష కృషి చేశారు.

సరిస్కాలో పులుల సంరక్షణ పరిస్థితి సమస్యలమయంగా ఉన్నది. పాలనాపరమైన వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి. ప్రాజెక్ట్‌ టైగర్‌ డైరెక్టరేట్‌ను పూర్తిస్థాయి అధికారాలతో స్వయం ప్రతిపత్తిగల జాతీయ పులుల సంరక్షణ అథారిటీగా మార్చాలని మేము సిఫారసు చేశాము. మా సిఫారసు అమలు కావడంలో అటవీశాఖాధికారి, పులుల నిపుణుడు రాజేష్‌ గోపాల్‌ విశేష కృషి చేశారు. అక్రమంగా అడవి జంతువుల వేటను అరికట్టేందుకు, వన్యప్రాణుల అక్రమ రవాణాను నిరోధించేందుకు, వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరోను నెలకొల్పారు. పులులు, ప్రజల సహజీవనం అసాధ్యమని, పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలోని గ్రామాలను వేరే ప్రదేశాలకు తరలించాల్సిందేనని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు నాకు స్పష్టంగా చెప్పారు.


ఎన్ని గ్రామాలు ఉన్నాయని ప్రశ్నించాను. ఎవరూ సమాధానమివ్వలేకపోయారు. గుచ్చిగుచ్చి అడుగగా గత ముప్పై సంవత్సరాలలో పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలోని 80 గ్రామాలను ప్రభుత్వం వేరే ప్రదేశాలకు తరలించిందని, ఇంకా 1500 గ్రామాలు ఉన్నాయనే సమాధానం లభించింది. కొత్త ప్రదేశాలకు తరలింపబడిన గ్రామాల పరిస్థితి ఎలా ఉన్నది? చాలా అధ్వానంగా ఉంది. రణతంబోర్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని ఒక గ్రామ ప్రజలతో మాట్లాడాం. పునరావాసం కల్పిస్తున్న ప్రదేశంలో కంటే ఆ అటవీగ్రామంలోనే ఉండేందుకు వారు ఎక్కువ మొగ్గు చూపారు. అటవీశాఖ సిబ్బంది వేధింపులు, పులుల దాడులను భరిస్తాం గానీ కొత్త ప్రదేశానికి వెళ్లబోమని వారు స్పష్టం చేశారు. అక్కడ తమకు జీవనోపాధి దొరకదని, ఆహారం, తాగునీరు కూడా లభించవని, అటువంటి పునరావాసం తమకు వద్దని వారు ఖరాఖండీగా చెప్పారు.


పులుల సంరక్షణా కేంద్రాల పరిధిలో బాగా లోతట్టున ఉన్న 300 గ్రామాలను కొత్త ప్రదేశాలకు తరలించాలని మేము సిఫారసు చేశాము. ఆ మూడువందల గ్రామాల మొత్తం జనాభా లక్ష మందికి పైగా ఉంటారు. ఆ గ్రామస్తులు తమ గ్రామాలను వీడి పోవాలంటే వారికి మంచి సదుపాయాలతో కూడిన పునరావాసాన్ని కల్పించి తీరాలని స్పష్టం చేశాం. ఆ 300 గ్రామాల వారు అందరూ కొత్త ప్రదేశాలకు వెళ్లినా పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలోను, వాటికి బాగా సమీపంలోను ఉన్న గ్రామాల సంఖ్య తక్కువేమీ కాదు. ఇది వారికి గానీ, పులుల సంరక్షణకు గానీ మేలు చేయదు. మన దేశంలో అడవులు, నీటివనరులు, పులులు ఉన్న ప్రాంతాలు దేశంలో అత్యంత పేద ప్రజల్లో కొంత మంది నివసిస్తున్న ప్రాంతాలే అన్నది మనం విస్మరించలేని వాస్తవం. పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలోను, చేరువలోను నివసిస్తున్న ప్రజలకు పర్యాటకం ద్వారా మంచి జీవనోపాధి అవకాశాలను కల్పించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు సమకూర్చాలని మేము సూచించాము. అయితే ఇది పూర్తిగా అమలుకాని అజెండాగానే ఉండిపోయింది.

మా కమిటీ సిఫారసులు, సూచనల మేరకు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలుపరచడంలో అధికారుల కృషి ఫలితంగా దేశంలో పులుల సంఖ్య పెరిగింది. అయితే పులులకు భద్రత, ప్రజలకు సంక్షేమం సమకూర్చే సంరక్షణ కార్యక్రమాలను మరింత సమగ్రంగా, మరింత పటిష్ఠంగా అమలుపరచవలసి ఉన్నది. స్థానిక ప్రజలకు జీవనోపాధి అవకాశాలు పెంపొందిస్తూ పెరుగుతున్న పులుల జనాభాకు సంపూర్ణ సంరక్షణ సమకూర్చే సహజీవన అజెండా నొకదాన్ని మనం సమగ్రంగా రూపొందించుకుని అమలుపరచుకోవల్సిన అవసరమున్నది.

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Aug 28 , 2026 | 03:42 AM