ఒక దళిత పెన్షనర్ డైరీ
ABN , Publish Date - Aug 10 , 2026 | 07:41 AM
ఒకప్పుడు చెప్పులు కుట్టిన చేతులూ మలమూత్రాల బకెట్లు తలకెత్తుకున్న రెక్కలు మల్లయుద్ధాల్లో మట్టి వాసన పూసుకున్న శరీరం కాలం వెన్నెముకపై నా జాతి చరిత్రనే రాసాయి.
ఒకప్పుడు
చెప్పులు కుట్టిన చేతులూ
మలమూత్రాల బకెట్లు తలకెత్తుకున్న రెక్కలు
మల్లయుద్ధాల్లో మట్టి వాసన పూసుకున్న శరీరం
కాలం వెన్నెముకపై నా జాతి చరిత్రనే రాసాయి.
డాక్టర్‌కు నేనొక పేషెంట్ ఫైల్
మనవడికి రోజూ చెప్పే ఒక పెన్షనర్ కథ
నాకు మాత్రం నేనే ఇంకా పూర్తికాని దళిత వాక్యం.
నా వృద్ధాప్యం కాలెండర్‌లో కాదని
అద్దం యథేచ్ఛగా జుట్టుకు వెండి రంగేస్తుంది.
జ్ఞాపకాలు మాత్రం ధర్నాచౌక్ దగ్గర చేసిన నినాదాల్లా
చార్మినార్ చుట్టూ తిరిగిన యవ్వన సాయంత్రాల్లా
నల్లజుట్టుతోనే ఉన్నాయి
వాట్సాప్‌లో వంద ‘గుడ్ మార్నింగ్’ పూలు
జ్ఞాపకాల పార్కులో ప్రతి బెంచ్‌పై రిటైర్మెంట్ గాయాలు
మొగ్గల్లా నెరవేరని చేసిన రాజ్యాంగ వాగ్దానాలు
నవ్వుల వెనుక మరణాన్ని మోసం చేసిన కథలూ
నీలిజెండాతో భుజం కలిపి వెళ్ళిపోయిన మిత్రుడొకడు
మూసీ సుందరీకరణ పాతవార్తగా వినబడతాడు
ఉదయం టైంకు పేపరూ, పాలపాకెట్టూ, చెత్తబండీ
రానిది ఒక్కటే– ‘‘ఎలా ఉన్నారన్నా?’’ అనే పలకరింపు
‘‘డాడీ... టేక్ కేర్...’’
ముగియకుండానే ముగిసే ప్రేమ రింగ్‌టోన్ పొడవంతే.
మందుల పెట్టె మాత్రం గడియారంతో ఒప్పందమై
రోజూ సమయానికి తలుపు తడుతుంది.
శరీరం ఒక్కో అవయవం రాజీనామా
గుండె మాత్రం ఆఖరి ట్రిప్‌లో హైదరాబాద్ బస్సు
జీవితం ఉస్మానియా అవుట్ పేషంట్ టోకెన్–
పిలుపుకోసం శతాబ్దాల దళిత నిరీక్షణ
వెళ్లిపోయాక అల్మారాలు ఖాళీ అవుతాయి
దళిత వ్యాకరణం, పోరాట పద్యం, కవిత్వ పుస్తకాలు
కొత్త నివాసాలకు అడ్రస్ మార్చుకుంటాయి.
ఇంటి గోడపై అంబేడ్కర్ చిత్రం–
దుమ్ము తుడిచే చేతులెవరో.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
95380 53020