Share News

Women voters: మహిళా ఓటర్లకు సర్‌ ఘాతం!

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:00 AM

మహిళలకు ఓటుహక్కు అనేది ఒకనాడు విప్లవాత్మక భావన. ఇప్పుడు అది మహిళల ప్రాథమిక మానవ హక్కుగా పరిగణిస్తున్నారు. భారతీయ సమాజంలో సమస్త రాజకీయ కార్యకలాపాలలో....

Women voters: మహిళా ఓటర్లకు సర్‌ ఘాతం!

మహిళలకు ఓటుహక్కు అనేది ఒకనాడు విప్లవాత్మక భావన. ఇప్పుడు అది మహిళల ప్రాథమిక మానవ హక్కుగా పరిగణిస్తున్నారు. భారతీయ సమాజంలో సమస్త రాజకీయ కార్యకలాపాలలో మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. స్వతంత్ర భారత సార్వత్రక ఎన్నికల చరిత్రలో 2019 ఎన్నికలు ఒక ‘నిశ్శబ్ద విప్లవం’గా పేరుపొందాయి. ఆ సార్వత్రక ఎన్నికలలో ఓటువేసిన వయోజనులలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. రాజకీయ క్రియాశీలురుగా భారతీయ మహిళలు ముందంజ వేస్తోన్న ప్రస్తుత తరుణంలో ఓటర్‌ జాబితాల నుంచి మహిళా ఓటర్ల పేర్లను పెద్ద ఎత్తున తొలగించారు, ఇంకా తొలగిస్తున్నారు. ఏమిటీ వైరుధ్యం? వట్టి వైరుధ్యం మాత్రమే కాదు, అది చాలా క్రూర వైరుధ్యం, సందేహం లేదు. 21వ శతాబ్ది మూడో దశకంలో ఇదెలా సంభవించింది? అని భావి చరిత్రకారులు తప్పక నివ్వెరపోతారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇప్పటికే బిహార్‌లో ముగించిన, ప్రస్తుతం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలుపరుస్తున్న ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో ఈ కఠోర వాస్తవం, క్రూర వైరుధ్యం చోటుచేసుకుంటోంది.

రెండో దశ ‘సర్‌’కు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ మినహా, మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గురించిన సమాచారం అందుబాటులో ఉన్నది. మహిళల భాగస్వామ్యంతో దశాబ్దాలుగా ఎన్నికలలో సాధించిన ప్రగతిశీల విజయాలు ఒక్కసారిగా తిరోగమనంలోకి మళ్లాయని ఆ సమాచారం విశదం చేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా మహిళా ఓటర్ల నమోదులో గణనీయమైన మెరుగుదల, ఓటుహక్కు వినియోగించుకుంటున్న మహిళల సంఖ్యలో భారీ పెరుగుదల, మహిళా సమస్యలపై రాజకీయ పార్టీలు విశేష శ్రద్ధ చూపడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత పురోగతిని పూర్తిగా వెనక్కినెట్టి, మహిళల ఓటింగ్‌ హక్కుల కోసం మళ్లీ ప్రాథమిక పోరాటం చేయవలసిన అగత్యం ‘సర్‌’తో వాటిల్లనున్నది. భారతీయ మహిళా ఓటింగ్‌ ప్రభావశీలతకు చారిత్రకంగా రెండు అపకారాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. వాటిలో ఒకటి ఆర్థికవేత్త, సామాజిక తాత్త్వికుడు అమర్త్యసేన్‌ గుర్తించిన ‘తప్పిపోయిన ఆడపిల్ల’ దృగ్విషయం. సహజ జనన రేటు ప్రకారం పుట్టవలసిన బాలికల సంఖ్య కంటే పుట్టిన బాలికల వాస్తవ సంఖ్య మధ్య పెద్ద వ్యత్యాసం ఉండడం. రెండోది ఓటుహక్కు ఉన్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండడం. ఓటుహక్కుకు అర్హమైన వయస్సు వచ్చిన మహిళలు ఓటర్‌ జాబితాల్లో ఉండే అవకాశాలు పరిమితంగా ఉండడం. ఇప్పుడు ‘సర్‌’ కారణంగా భారతీయ మహిళలకు మూడో అపకారం వాటిల్లుతోంది. ఇప్పటికే ఓటర్‌ జాబితాలలో ఉన్న మహిళల పేర్లను పెద్ద ఎత్తున తొలగించడం, తొలగించనుండడమే ఈ మూడో అపకారం. పెద్ద ఎత్తున మహిళలు తమ ఓటుహక్కును కోల్పోవడమనేది స్వతంత్ర భారతదేశం ఇంతకు ముందెన్నడూ చూడలేదనడం ఎంతమాత్రం సత్యదూరం కాదు.


సంభవించనున్న ఈ క్రూర పరిణామానికి సూచనలు బిహార్‌ ‘సర్‌’లోనే స్పష్టంగా కనిపించాయి. ‘సర్‌’కు ముందు బిహార్‌లో జెండర్‌ నిష్పత్తి (జనాభాలో పురుషుల సంఖ్యను స్త్రీల సంఖ్యతో పోల్చడం) ఇలా ఉంది: ప్రతి 1000 మంది పురుషులకు 932 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఓటర్ల జాబితాలో ఈ నిష్పత్తి మరింత తక్కువగా ఉన్నది. ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు 914 మంది మాత్రమే ఉన్నారు. అంటే జనాభాలో తమ వాటా కంటే తక్కువగా ఉన్నారు. జనాభాలో ఉన్న వాటా ఓటర్ల జాబితాలో ప్రతిబింబించి ఉన్నట్టయితే మహిళా ఓటర్ల సంఖ్య 7 లక్షల మేరకు అధికంగా ఉండేది. ‘సర్‌’ అనంతరం బిహార్‌ ఓటర్ల తుది జాబితాలో జెండర్ నిష్పత్తి మరింతగా తగ్గిపోయింది. ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు 890 మంది మాత్రమే ఉన్నారు! మరింత స్పష్టంగా చెప్పాలంటే ‘తప్పిపోయిన మహిళా ఓటర్ల’ సంఖ్య 7 లక్షల నుంచి 16 లక్షలకు పెరిగింది. బిహార్‌లో ఒక దశాబ్ద కాలంలో జెండర్‌ నిష్పత్తిలో నమోదైన పెరుగుదల ‘సర్‌’తో తుడిచిపెట్టుకుపోయింది. ఈ తిరోగతి, రాజకీయ భాగస్వామ్యంలో మహిళలు సాధించిన పురోగతి పూర్తిగా నిరర్థకమైపోవడమే కాదూ?

బిహార్‌లో మహిళా ఓటర్ల నమోదులో అవకతవకలు జరిగాయని రెండో దశ ‘సర్‌’ సమాచారం ధ్రువీకరిస్తోంది. ఓటర్ల జాబితాలో జెండర్‌ నిష్పత్తి పడిపోయేందుకు ‘సర్‌’ దారితీసిందనేది స్పష్టం. ‘సర్‌’ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు– రెండో దశ ఆరు రాష్ట్రాల ఓటర్ల జాబితాలలో ప్రతి 1000 మంది పురుషులకు సగటున 979 మంది స్త్రీలు ఉన్నారు. వయోజన జనాభాలో మహిళాల వాటా 985. అంటే ఓటర్ల జాబితాలో స్త్రీల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నది. ‘సర్‌’ చూపిన ప్రభావం ఏమిటో చూద్దాం. ముసాయిదా ఓటర్ల జాబితాలో జెండర్ నిష్పత్తి 963కు తగ్గిపోయింది. అంటే ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 963 మంది స్త్రీ ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ నిష్పత్తిని సంఖ్యల్లోకి మార్చితే ‘తప్పిపోయిన మహిళా ఓటర్లు’ అదనంగా 23 లక్షల మంది ఉన్నారని విశదమవుతుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ‘సర్‌’ తొలగింపులు పురుష, మహిళా ఓటర్ల విషయంలో సమరీతిలో ఉన్నట్టయితే ముసాయిదా ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య 23 లక్షల మేరకు అధికంగా ఉండేది.


ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లకు సంబంధించి జెండర్‌ వారీగా సమాచారం ఇంకా అందుబాటులో లేదు. ఆ రాష్ట్రాల సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ‘తప్పిపోయిన మహిళా ఓటర్ల’ సంఖ్య, బహుశా మరింత అధికంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇవేగాక, రెండో దశ ‘సర్‌’ అమలయిన మిగతా రాష్ట్రాలలో తమిళనాడు, కేరళ కూడా ఉన్నాయి. జెండర్‌ నిష్పత్తి మెరుగ్గా ఉండే రాష్ట్రాలవి. అంతేకాదు, ఈ రెండు రాష్ట్రాలలోనూ ఓటర్ల జాబితాలో మహిళల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉండడం కూడా పరిపాటి. అయినా ‘సర్‌’ లెక్కల్లో ఈ రెండు రాష్ట్రాలలోనూ జెండర్‌ నిష్పత్తి తగ్గుదలకు దారితీసింది! ఆ తగ్గుదల తమిళనాడులో 2 పాయింట్లు (రెండు శాతాల మధ్య వ్యత్యాసం) గాను, కేరళలో 14 పాయింట్లుగాను ఉన్నది. ఇతర రాష్ట్రాలలో పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. ఆ రాష్ట్రాలు ప్రతి ఒక్కదానిలోను సగటున జెండర్ నిష్పత్తి తగ్గుదల 15 పాయింట్ల కంటే ఎక్కువగా ఉన్నది! మరింత స్పష్టంగా చెప్పాలంటే ‘సర్‌’ ప్రక్రియ ఇప్పటికే గుజరాత్‌లో 6 లక్షల మంది మహిళలకు ఓటు హక్కు నిరాకరించింది. రాజస్థాన్‌, బెంగాల్లో ఓటుహక్కు తొలగింపునకు బాధితులైన మహిళల సంఖ్య అయిదు లక్షల పైచిలుకు చొప్పున ఉన్నది. మధ్యప్రదేశ్‌లో ఇంచుమించు అయిదు లక్షలమంది మహిళలకు ఓటుహక్కును నిరాకరించారు.

బిహార్‌లో వలే ఈ రాష్ట్రాలలో కూడా ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం విషయంలో దశాబ్దాలుగా సాధించిన పురోగతిని ‘సర్‌’ నిరర్థకం చేసిందని చెప్పక తప్పదు. మధ్యప్రదేశ్‌నే తీసుకోండి. 2009లో ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాలో జెండర్‌ నిష్పత్తి చాలా తక్కువగా ఉండేది. ప్రతి 1000 మంది పురుషులకు 887మంది మహిళలు మాత్రమే ఉండేవారు. ఈసీఐ కృషి కారణంగా ఆ తరువాత జరిగిన ప్రతి (ఓటరల్ జాబితా) సవరణలోనూ జెండర్ నిష్పత్తి పెరుగుతూ వస్తోంది. గత ఏడాది ఆ నిష్పత్తి 950గా ఉన్నది. రాష్ట్ర వయోజన జనాభాలో స్త్రీ–పురుష నిష్పత్తికి అది దాదాపు సరిసమానంగా ఉన్నది. ఇప్పుడు ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితాలో జెండర్‌ నిష్పత్తి 933కు తగ్గిపోయింది!


ఇందులో ఆశ్చర్యపోవల్సిందేమీ అంతగా లేదు. లోపభూయిష్ఠమైన రూపకల్పన కారణంగా ‘సర్‌’ మహిళా ఓటర్లకు అననుకూలంగా అమలయింది. ప్రతి ఓటరు కచ్చితమైన గడువులోగా ఫొటోగ్రాఫ్‌తో సహా కొత్త ఎన్యుమరేషన్‌ ఫామ్‌ను సమర్పించవలసి ఉన్నది. పరిపాలనా ఓటు హక్కు రద్దు (Admini-strative Disenfranchisement– అర్హత కలిగిన పౌరులు ఓటు వేయడం కష్టతరం లేదా అసాధ్యం చేసే పద్ధతులను పరిపాలనా ఓటుహక్కు రద్దు అంటారు)కు ఇదొక ప్రామాణిక తార్కాణం. ఈ పద్ధతి మహిళా ఓటర్లకు ప్రతికూలంగా పరిణమించింది. ‘ఆబ్సెంట్‌/షిఫ్టెడ్‌’ (గైర్హాజరు/ వేరే ప్రదేశాలకు వెళ్లినవారు) కారణాల ప్రాతిపదికన మహిళలను గణనీయమైన సంఖ్యలో ఓటర్‌ జాబితాల నుంచి తొలగించారు. గమనార్హమైన వాస్తవమేమిటంటే ఇలా తొలగింపునకు గురైన మహిళలలో అత్యధికులు వివాహితలు. సహజంగానే వీరు పుట్టింట ఉండరు. ఈ కారణంగా పుట్టింటి ప్రదేశాల ఓటర్‌ జాబితాల నుంచి వారి పేర్లను తొలగించారు. అయితే మెట్టినిల్లు ప్రదేశాలకు చెందిన ఓటర్‌ జాబితాల్లో వారి పేర్లు చేర్చలేదు! ఇంతేనా? ముసాయిదా జాబితాలోని మహిళలు రెండు దశాబ్దాల క్రితం నాటి పాత ఓటర్ల జాబితాలోని తమ తల్లిదండ్రుల పేర్లతో తమను అనుసంధానించుకుని, తమ అర్హతను నిర్ధారించాలి (ఇందుకు అత్తమామల పేర్లను అంగీకరించరు). ఇది వివాహిత మహిళల పట్ల వివక్ష చూపడంకాక మరేమిటి?

మన భావి చరిత్రకారులు ఈ ‘సర్‌’ సమాచారాన్ని నిశితంగా పరిశీలించే క్రమంలో ఓటర్‌ జాబితాల విషయమై ఈసీఐ మాన్యువల్‌ను తప్పక చూస్తారు. మహిళా ఓటర్ల నమోదు విషయంలో ఈసీఐ నిర్దేశించిన నియమాలు, ప్రక్రియా వ్యవహార పద్ధతులు ఎంత సున్నితమైనవిగా ఉన్నాయో గమనించి తప్పక ఆశ్చర్యపోతారు. నమోదు ప్రక్రియ ప్రతి దశలోనూ జెండర్‌ నిష్పత్తిని నిశితంగా గమనంలోకి తీసుకోవాలని ఈసీఐ మాన్యువల్ నిర్దేశించింది. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేయాలని, జెండర్‌ నిష్పత్తిలో ఏమైనా అసమతౌల్యత ఉంటే దాన్ని తొలగించేందుకు మహిళా బీఎల్‌ఓ (పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారి)లను నియమించాలని కూడా స్పష్టం చేసింది. నియమాలు, పద్ధతులు ఇంత స్పష్టంగా ఉన్నా ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)... అమలులో మాత్రం, మహిళా ఓటర్ల ప్రత్యేక సమగ్ర తొలగింపు ప్రక్రియగా ఎలా మారిపోయిందని భావి చరిత్రకారులు తప్పక ఆశ్చర్యపోతారు.

యోగేంద్ర యాదవ్

Updated Date - Jan 10 , 2026 | 04:00 AM