విద్యతోనే అభివృద్ధి!
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:32 AM
మానవుల జీవితాన్ని మార్చడానికి విద్య ఒక ముఖ్య సాధనం. ఒక వ్యక్తి జీవన ప్రమాణాన్ని, నాణ్యతను, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, మంచి దృక్పథాన్ని విద్య మెరుగుపరుస్తుంది.
మానవుల జీవితాన్ని మార్చడానికి విద్య ఒక ముఖ్య సాధనం. ఒక వ్యక్తి జీవన ప్రమాణాన్ని, నాణ్యతను, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, మంచి దృక్పథాన్ని విద్య మెరుగుపరుస్తుంది. మనుగడ కోసం, ఉపాధి కోసం, మంచి జీవనం సాగించేందుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు విద్య అవసరం. అలాగే మంచి మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకొనేందుకు, గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు, ఆమోదయోగ్యమైన నడవడికలు నేర్చుకునేందుకు, వ్యక్తిత్వ వికాసానికి విద్య ఉత్తమ సాధనం. విద్య లేకుండా ఏ దేశం అభివృద్ధి సాధించలేదు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఉత్తమమైన విద్యా సంస్కరణల అమలు కోసం ప్రచారం కల్పించడానికి, సామాన్యుడికి సైతం విద్య అందుబాటులో ఉండడానికి ప్రతి దేశంలో విద్యా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది పిల్లలు, యువకులు పాఠశాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారు. సుమారు 76.5 కోట్ల మంది పెద్దలు నిరక్షరాసులుగా ఉన్నారు. భారతదేశంలో తల్లిదండ్రులు సగటున ఒక విద్యార్థిపై 18,479 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మన కేంద్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌లో విద్యకు నిధులు పెంచినా, ప్రపంచ సగటుతో పోలిస్తే తక్కువే. విద్యపై ప్రపంచ సగటు 4.48శాతమైతే, భారత సగటు మాత్రం నాలుగు శాతమే. మన దేశంలో విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యాహక్కు చట్టం చేశారు. 6–14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. మన దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఉన్నత విద్యకు కూడా నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా దేశాలలో విద్యార్థులు ఉన్నత విద్యలో చేరలేకపోతున్నారు, కారణం అది ఖరీదైనది కావటమే. ఉపాధ్యాయులపై ఇతర పనుల ప్రభావాన్ని తగ్గించి వారిని బోధనలో మాత్రమే నిమగ్నం చేయాలి. విలువలతో కూడిన విద్యను అందించడంలో, చదువుకున్న ప్రతి వాడికి ఉపాధి దొరికేటట్లు చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉన్నది.
– కావలి చెన్నయ్య ముదిరాజ్