Share News

Vadde Obanna: బ్రిటిష్ వారిని వణికించిన రేనాటి గెరిల్లా యోధుడు

ABN , Publish Date - Jan 10 , 2026 | 03:52 AM

భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను పరిశీలిస్తే, అడుగడుగునా మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలర్పించిన వీరుల గాథలు కనిపిస్తాయి. 1857 సిపాయిల తిరుగుబాటుకు....

Vadde Obanna: బ్రిటిష్ వారిని వణికించిన రేనాటి గెరిల్లా యోధుడు

భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను పరిశీలిస్తే, అడుగడుగునా మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలర్పించిన వీరుల గాథలు కనిపిస్తాయి. 1857 సిపాయిల తిరుగుబాటుకు దశాబ్దం ముందే బ్రిటిష్ సామ్రాజ్యవాద పునాదులను వణికించిన మహోజ్వల విప్లవం తెలుగుగడ్డపై ఉద్భవించింది. ఆ విప్లవానికి అసమానమైన ఊపిరి పోసి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నెముకలా నిలిచిన సర్వసైన్యాధ్యక్షుడే వడ్డే ఓబన్న. ఆయన సాగించిన అలుపెరగని పోరాటం, చారిత్రక నేపథ్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన శాశ్వత భూమిశిస్తు విధానం రాయలసీమ ప్రాంతంలో తీవ్ర అశాంతికి దారితీసింది. అంతకుముందు విజయనగర సామ్రాజ్య కాలం నుంచి స్థానిక పాలకులుగా ఉన్న పాలెగాళ్ల వ్యవస్థను బ్రిటిష్ వారు క్రమంగా రద్దు చేశారు. నిజాం నవాబు నుంచి దత్త మండలాలుగా (సీడెడ్ జిల్లాలు) ఈ ప్రాంతం ఆంగ్లేయుల పరమైన తర్వాత, వారు ఇక్కడి సామాజిక, ఆర్థిక నిర్మితిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. అప్పటి వరకు గౌరవప్రదమైన హోదాలో ఉన్న పాలెగాళ్లకు నామమాత్రపు భరణం ఇస్తూ, వారి భూములను, అధికారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కేవలం 11 రూపాయల భరణం నిర్ణయించడం బ్రిటిష్ వారి అహంకారానికి నిదర్శనం. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు పండకపోయినా, పన్నుల వసూళ్లలో ఆంగ్లేయులు ప్రదర్శించిన నిర్బంధం చివరకు తిరుగుబాటు అగ్నిని రాజేసింది. నిర్లక్ష్యానికి గురైన అడవి బిడ్డలను, కులవృత్తుల వారిని ఏకం చేసి, ఓబన్న ఒక అజేయమైన ప్రజా సైన్యాన్ని సిద్ధం చేశారు.

నంద్యాల జిల్లా సంజామల గడ్డపై 1807 జనవరి 11న జన్మించారు ఓబన్న. వడ్డే సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతుల సంతానంగా చిన్నతనం నుంచే సాహసోపేతమైన విద్యల్లో నిష్ణాతులయ్యారు. సుబ్బయ్య.. తలారి(విలేజ్ గార్డ్)గా పనిచేయడం వల్ల గ్రామీణ రక్షణ వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులపై ఓబన్నకు అపారమైన పట్టు ఉండేది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ఓబన్న, కేవలం అనుచరుడిగా కాకుండా ఒక శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మించిన దళపతిగా ఎదిగారు. వడ్డెరలు, బోయలు, చెంచులతో కూడిన ఈ సైన్యం నల్లమల అడవులను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ బలగాలను ముప్పుతిప్పలు పెట్టింది. అడవిని తన ఆయుధంగా మార్చుకున్న ఓబన్న, శత్రువుకు నీడ కూడా దొరకని రీతిలో మెరుపు దాడులను రూపొందిస్తూ ఆంగ్లేయుల వ్యూహాలను చిత్తు చేశారు.


ఓబన్న వ్యూహరచనలో అత్యంత ప్రధానమైనది గెరిల్లా యుద్ధం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా శత్రువుపై మెరుపుదాడులు చేయడం, వారి రవాణా మార్గాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీయడంలో ఆయన అసాధారణ ప్రతిభ ప్రదర్శించారు. 1846 జూలై 10న కోవెలకుంట్ల సబ్ ట్రెజరీపై జరిగిన దాడి బ్రిటిష్ పాలకులను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాక, వారిలో వణుకు పుట్టించింది. ఈ దాడి వల్ల ఆంగ్లేయుల ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. నల్లమల అడవుల అంచున ఉన్న కొండలు, వాగులను ఓబన్న తన సైన్యానికి అభేద్యమైన రక్షణ కవచాలుగా మార్చుకున్నారు. ఆధునిక తుపాకుల గర్జనల మధ్య, సంప్రదాయ ఆయుధాలతో ఆయన సైన్యం సాగించిన సమరం బ్రిటిష్ బలగాల్లో వణుకు పుట్టించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఓబన్న, నరసింహారెడ్డిలను బంధించడానికి కట్టుదిట్టమైన పన్నాగం పన్నింది. 1846 అక్టోబర్ 6న నంద్యాల జిల్లా సంజామల మండలం గిద్దలూరు సమీపంలోని జగన్నాథకొండ వద్ద భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఓబన్న అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. కానీ, 39 ఏళ్ల ప్రాయంలోనే వీరమరణం పొందారు. ఆయన మరణం నరసింహారెడ్డి సైన్యానికి కోలుకోలేని దెబ్బ అయింది. ఆ తర్వాత నరసింహారెడ్డిని బంధించిన బ్రిటిష్‌వారు, ప్రజల్లో భయాన్ని నింపడానికి 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల వద్ద రెండువేల మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు. కానీ, ఓబన్న రగిల్చిన విప్లవజ్వాల భావి స్వాతంత్ర్య సమరానికి బాటలు వేసింది.

దురదృష్టవశాత్తు, భారత స్వాతంత్ర్య చరిత్ర పుటల్లో వడ్డే ఓబన్న వంటి వీరులకు లభించాల్సిన ప్రాముఖ్యం చాలాకాలం పాటు లభించలేదు. జాతీయ స్థాయిలో చరిత్రకారులు అధికంగా ఉత్తర భారత తిరుగుబాట్లకే ప్రాధాన్యమివ్వడం వల్ల, దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగునేలపై జరిగిన ఈ తొలి విప్లవం మరుగున పడిపోయింది. ఇటీవలి కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ పరిణామం. అయితే, ఇది కేవలం ఉత్సవాలకే పరిమితం కాకూడదు. డిజిటల్ ఆర్కైవ్స్ స్థాపన, ప్రత్యేక మ్యూజియంల ఏర్పాటు, విశ్వవిద్యాలయాలలో పరిశోధక పీఠాలను నెలకొల్పడం ద్వారా ఓబన్న పాత్రను ప్రామాణికంగా గుర్తించి, భవిష్యత్ తరాలకు ఈ వీరగాథను అందించాలి. తద్వారా భావితరాల్లో దేశభక్తిని, చారిత్రక స్పృహను పెంపొందించాలి.

బొంతల తిరుపతి

Updated Date - Jan 10 , 2026 | 03:52 AM