Share News

ప్రతి గ్రామ పంచాయతీకి ‘లోకల్ హీరో’ పేరు!

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:13 AM

గ్రామం అంటే తాటాకు ఇళ్లు, పెంకుటిళ్లు, అక్కడక్కడా డాబా ఇళ్లు, మట్టి రోడ్లు, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, ఓ చిన్న రాములోరి గుడి, పంచాయతీ ఆఫీసు అరుగులపై కూర్చుని, చుట్టలు కాల్చుకుంటూ..

ప్రతి గ్రామ పంచాయతీకి ‘లోకల్ హీరో’ పేరు!

గ్రామం అంటే తాటాకు ఇళ్లు, పెంకుటిళ్లు, అక్కడక్కడా డాబా ఇళ్లు, మట్టి రోడ్లు, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, ఓ చిన్న రాములోరి గుడి, పంచాయతీ ఆఫీసు అరుగులపై కూర్చుని, చుట్టలు కాల్చుకుంటూ దేశ రాజకీయాలపై చర్చలతో కాలక్షేపం చేసే గ్రామ పెద్దలు. గతంలో గ్రామం అంటే ఇలానే ఉండేది. కానీ, ఇప్పుడు గ్రామీణుల ఆలోచనా తీరు మారింది. వారి పిల్లలు అత్యున్నత విద్యా లక్ష్యాలను అందుకుంటున్నారు. ఇలా చదువుకుని, అలా విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు అలవోకగా ఎంపికవుతున్నారు. మట్టి రోడ్ల స్థానంలో సిమెంట్ రోడ్లు సాక్షాత్కరిస్తున్నాయి. విద్యుద్దీప కాంతులతో గ్రామాలు మెరిసిపోతున్నాయి. ఆధునిక మరుగుదొడ్లు లేని గృహం దాదాపుగా కనపడడం లేదు. ఎడ్ల బండ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చేశాయి.

కాలానుగుణంగా గ్రామసీమలలో ఇంత ఆధునికత కనపడుతున్నా చాలా గ్రామాలలో జీవకళ కనిపించడం లేదు. పట్టణీకరణపై గ్రామాలలో పెరుగుతున్న మోజుతో పాటు, గ్రామస్థులకు ఒక లక్ష్యం, ప్రేరణ కొరవడడం ప్రధాన కారణం. గ్రామాలలో జరిగే రాజకీయ అవినీతి పట్ల గ్రామీణులలో వ్యక్తమయ్యే అసహనం కూడా గ్రామాలను వీడడానికి ఒక కారణం అనేవారు ఉన్నారు. గ్రామీణులలో వ్యక్తమయ్యే నిర్లిప్తతను దూరం చెయ్యాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇక్కడ గతంలో ఓ గ్రామం ఉండేదని తరువాతి తరం వారు చెప్పుకునే పరిస్థితి వస్తుంది.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 13,350 పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో పట్టణ లక్షణాలు ఉన్న గ్రామ పంచాయతీలు 360 ఉన్నాయి. గ్రేడ్–1 పంచాయతీలు మూడు వేలు, గ్రేడ్–2 పంచాయతీలు మూడున్నర వేలు, గ్రేడ్–3 పంచాయతీలు దాదాపు ఏడు వేలు ఉన్నాయి. విదేశాలలో తెలుగు కీర్తి పతాకాలను ఎగరేస్తున్న వైద్యులు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు మొదలైన లక్షలాది మంది తెలుగుబిడ్డల్లో 90శాతం మంది గ్రామాల నుంచి వచ్చినవారే.


సెలబ్రిటీలుగా నీరాజనాలు అందుకుంటున్న వివిధ రంగాల తెలుగు ప్రముఖులలో 90శాతం మంది రాష్ట్రంలోని ఏదో ఒక గ్రామానికి చెందినవారే. వారంతా ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి, ఆ స్థాయికి చేరుకున్నారో ఆయా గ్రామస్థులకు నిత్య స్మరణాంశంగా చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు– నారావారి పాలెం గ్రామ పంచాయతీ, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్– బుర్రిపాలెం గ్రామ పంచాయతీ, నందమూరి తారక రామారావు– నిమ్మకూరు గ్రామ పంచాయతీ, మండలి వేంకట కృష్ణారావు– భావదేవరపల్లి గ్రామ పంచాయతీ, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు– మంటాడ గ్రామ పంచాయతీ, కొణిదెల చిరంజీవి– మొగల్తూరు గ్రామ పంచాయతీ, కాకాని వేంకటరత్నం– ఆకునూరు గ్రామ పంచాయతీ, కోట్ల విజయభాస్కరరెడ్డి– లద్దగిరి గ్రామ పంచాయతీ, కోడి రామ్మూర్తి నాయుడు– వీరఘట్టం గ్రామ పంచాయతీ, టంగుటూరి ప్రకాశం పంతులు– వినోదరాయుని పాలెం గ్రామ పంచాయతీ, చండ్ర రాజేశ్వరరావు– మంగళాపురం గ్రామ పంచాయతీ... ఇలా చాలా మంది పెద్దలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, వైద్య, రాజకీయ, క్రీడా రంగాలను విశేష రీతిలో పరిపుష్టం చేశారు.

ఆయా గ్రామ పంచాయతీల పేర్లకు ముందు అధికారికంగా వారి పేరు పెడితే అది రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే ఆయా గ్రామాల్లో ఉప్పొంగే కొత్త ఉత్సాహం, ఉద్వేగాన్ని కళ్లారా చూడవచ్చు. ముందుగా– ప్రభుత్వం ఆయా గ్రామాలకు చెందిన ఓ 500 మంది సూపర్ సెలబ్రిటీలను గుర్తించి, వారు పుట్టి పెరిగిన గ్రామ పంచాయతీలను వారి పేర్లతో నోటిఫై చేస్తే... ‘వెలిగొండ ప్రాజెక్ట్’ అని పిలిచే దానికీ, ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్’ అని పిలిచే దానికీ ఉన్నంత తేడా ఉంటుంది.

- భోగాది వేంకటరాయుడు

Updated Date - Oct 17 , 2026 | 01:15 AM