మార్కుల కోసం మాతృభాషపై నిర్లక్ష్యమా?!
ABN , Publish Date - Aug 28 , 2026 | 04:17 AM
నేడు రాష్ట్రంలో చాలామంది పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు కానీ, చదవలేరు, రాయలేరు. పుట్టినప్పటి నుంచి అమ్మ మాట వింటూ, అమ్మ భాష మాట్లాడుతూ పెరిగిన విద్యార్థులు చదువులో మాత్రం మాతృ భాష తెలుగును పక్కన పెడుతున్నారు.
నేడు రాష్ట్రంలో చాలామంది పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు కానీ, చదవలేరు, రాయలేరు. పుట్టినప్పటి నుంచి అమ్మ మాట వింటూ, అమ్మ భాష మాట్లాడుతూ పెరిగిన విద్యార్థులు చదువులో మాత్రం మాతృ భాష తెలుగును పక్కన పెడుతున్నారు. ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులు సాధించాలన్న ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు, విద్యాసంస్థలవారు కూడా విద్యార్థులను తెలుగుకు బదులుగా సంస్కృతం లేదా ఇతర భాషలను రెండో భాషగా ఎంచుకొమ్మని ప్రోత్సహిస్తున్నారు.
తెలుగును రెండో భాషగా తీసుకుంటే పరీక్షలో బాగా రాసినా కూడా తక్కువ మార్కులే వస్తాయనీ, అదే సంస్కృతాన్ని ఎంచుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయనీ విద్యార్థులు భావిస్తున్నారు. ఇది విద్యార్థుల తప్పు కాదు. తల్లిదండ్రుల తప్పు అని కూడా అనలేము. ఈ విషయంలో మనం మొత్తం విద్యా వ్యవస్థ తీరుపైనే పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్‌లో సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ తెలుగు లేకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పదో తరగతి ఫలితాలను చూస్తే తెలుగు భాషలో విద్యార్థులు ఎంతగా వెనుకబడిపోతున్నారన్నది తెలుస్తుంది. మొత్తం 6,17,827 మంది పరీక్ష రాస్తే.. ఫెయిల్ అయిన విద్యార్థులు 91,150 మంది. ఇందులో తెలుగులో ఫెయిల్ అయిన విద్యార్థులు 37,679. మరోపక్క ఇంగ్లీష్‌లో 8,771 మంది, హిందీలో 1,436 మంది మాత్రమే ఫెయిలయ్యారు. విద్యార్థులు మాతృభాషలోనే వెనుకబడుతున్నారంటే, అది కేవలం విద్యార్థుల సమస్య కాదు. తెలుగు ప్రశ్న పత్రాలు రూపుదిద్దే, మూల్యాంకనం చేసే సరళినే మార్చాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మూల్యాంకన మార్గదర్శకాల ప్రకారం సంస్కృత ప్రశ్నలకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో సమాధానాలు రాసే అవకాశం ఉండటంతో 100కి 99 మార్కులు సాధించడం సులభమవుతోందన్న అభిప్రాయం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉంది. 90శాతం ప్రైవేట్ కళాశాలలు తెలుగును ఒక ద్వితీయ భాషగా అందించడం లేదు. ఇది మారాలి. పదో తరగతి వరకు అన్ని బోర్డుల్లో తెలుగును తప్పనిసరిగా బోధించినప్పుడు, ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు? ఇంటర్‌లో రెండో భాషగా తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలను ఎంచుకునే విద్యార్థులకు ఒక విధమైన మార్కుల విధానం, సంస్కృతం ఎంచుకునే విద్యార్థులకు మరో విధమైన ప్రయోజనం ఉండటం ఎందుకు?
అలాగే తెలుగు భాషకు మూల్యాంకనం కూడా కఠినంగా ఉందన్న అభిప్రాయం ఉంది. పేపర్ దిద్దే సమయంలో అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు, వాక్య నిర్మాణం వంటి అంశాలపై కఠినంగా ఉండటం వల్ల విద్యార్థులు మార్కులు కోల్పోయే పరిస్థితి ఉంది. అందువల్ల తెలుగులో 80–85 మార్కుల కంటే ఎక్కువ సాధించడం విద్యార్థులకు కష్టంగా మారుతోంది. దీనిని కూడా మనం తక్షణమే సమీక్షించాలి. విద్యార్థులు, తల్లిదండ్రుల మనసుల్లో ‘‘తెలుగు చదివితే భవిష్యత్తుకు నష్టం ఉండదు’’ అన్న నమ్మకాన్ని మన విద్యా వ్యవస్థ కల్పించాలి. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో సాధించే మార్కులు AP EAPCET వంటి ప్రవేశ పరీక్షల అవకాశాలను ప్రభావితం చేస్తున్నాయి. JEE Main/ Advanced ప్రవేశానికి 75శాతం ఇంటర్మీడియట్ మార్కులు అర్హతగా ఉన్నాయి. ఇంటర్మీడియట్‌లో సాధించే మార్కులు, రాబోయే కాలంలో NEET వంటి ప్రవేశ పరీక్షల ర్యాంకులను కూడా ప్రభావితం చేయవచ్చు.
ఇలాంటి పరిస్థితిలో తెలుగును రెండో భాషగా తీసుకుని 20–30 మార్కులు కోల్పోవటానికి విద్యార్థులు సిద్ధంగా ఉండరు. అందుకే తెలుగుకు బదులుగా సంస్కృతం తీసుకుంటున్నారు. భాష ఏదైనా నేర్చుకోవచ్చు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్... అన్నీ అవసరమే. కానీ మార్కుల కోసం మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితి మాత్రం రాకూడదు. మాతృభాషను ఎంచుకున్నా విద్యార్థులు మార్కులు కోల్పోని విద్యా వ్యవస్థ మనకు కావాలి. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మన రాష్ట్రంలో తెలుగు మృత భాషగా మారకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
మెగా డీఎస్సీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్... ఇలా విద్యారంగ పరిధిలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చిన మంత్రి నారా లోకేశ్ తెలుగు భాష విషయంలో కూడా అభివృద్ధిని సాధించగలరు. ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. తెలుగు, సంస్కృతం, హిందీ వంటి అన్ని భాషలకు న్యాయమైన, సమానమైన మార్కుల విధానం ఉండేలా ప్రస్తుత విద్యా విధానాన్ని సమీక్షించాలి. తెలుగు ప్రశ్న పత్రాన్ని, తెలుగు సిలబస్‌ను కూడా పునఃపరిశీలించాలి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలుగు బోధన ఉండాలి. తెలుగును కాపాడేందుకు తెలుగులో కూడా 99 మార్కులు వచ్చే విధంగా ప్రశ్న పత్రాల అమరికను మార్చాలి. తెలుగు ఉపాధ్యాయులను కూడా ఈ సంస్కరణల్లో భాగస్వాములను చేయాలి. విద్యార్థి మాతృభాషను ఎంచుకున్నా అతని ప్రతిభకు న్యాయం జరిగేలా మన విద్యా వ్యవస్థ ఉండాలి.
- యార్లగడ్డ వెంకటరావు
ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే