Share News

మూడు తరాల ప్రభంజనం!

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:49 AM

నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న స్థాపించిన రాజకీయ పార్టీ ‘తెలుగుదేశం’ 9 నెలల స్వల్ప వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. పార్టీ ఆవిర్భావానికి దారితీసిన నేపథ్యం ఎంతో ఆసక్తికరమైనది.

మూడు తరాల ప్రభంజనం!

నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న స్థాపించిన రాజకీయ పార్టీ ‘తెలుగుదేశం’ 9 నెలల స్వల్ప వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. పార్టీ ఆవిర్భావానికి దారితీసిన నేపథ్యం ఎంతో ఆసక్తికరమైనది. 1981 అక్టోబర్ నెలలో ఊటీలో ఒకరోజు ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. విరామంలో ఆయన కుర్చీలో కళ్లు మూసుకొని కూర్చొని తర్వాత సన్నివేశంలోని డైలాగులు గుర్తు తెచ్చుకుంటున్నారు. అక్కడకు వచ్చిన కొందరు పాత్రికేయులు ఆయన చుట్టూ చేరారు. హఠాత్తుగా ఓ పాత్రికేయుడు ‘సార్! మరో ఆరు నెలల్లో మీకు 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయి షష్టిపూర్తి చేసుకోబోతున్నారు కదా! ఆ శుభ సందర్భంలో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా?’ అని ప్రశ్నించాడు.

ఎన్టీఆర్ ఒక క్షణం ఆలోచించి ‘‘ఎక్కడో నిమ్మకూరులో పుట్టి పెరిగిన నన్ను తెలుగు ప్రజలు సినిమా నటుడిగా, తమ ‘అన్న’గా గత 30 సంవత్సరాలుగా నాపై అంతులేని అభిమానాన్ని, ప్రేమను చూపుతున్నారు. నా చిత్రాల్ని అభిమానంతో ఆదరిస్తూ నాకెంతో పేరు ప్రఖ్యాతులనిచ్చారు. ఇప్పుడా రుణాన్నంతటినీ ఏదో ఒక రూపంలో తీర్చవలసిన బాధ్యత నాపై ఉంది. వచ్చే నా పుట్టినరోజు నాటి నుంచి సంఘసేవకు అంకితమవుతాను’’ అని చెప్పారు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఏ విషయాన్నీ తేలిగ్గా చెప్పరు. చెప్పారంటే అది చేసి తీరుతారు. ఆ నిజం తెలిసిన పత్రికలు ఆయన ప్రకటనను ప్రముఖంగా ప్రచురించాయి. ఆ వార్త రాష్ట్రమంతటా కార్చిచ్చులా వ్యాపించింది.


ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ స్థాపించనున్నారన్న వార్త వెలువడే నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఎగిసిన గ్రూపు తగాదాలు భయంకరంగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి జాతీయ కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చే నెపంతో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సొంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలు చేశారు. ఆ సమయంలోనే హైదరాబాద్ పాతనగరంలో ఓ మహిళపై పోలీస్ స్టేషన్‌లో జరిగిన అత్యాచార ఘటన దరిమిలా శాంతిభద్రతలు అదుపుతప్పి మత ఘర్షణలు రేగాయి. అసమ్మతి కారణంగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గద్దె నుంచి దిగాల్సి వచ్చింది. ఆ పదవికి టంగుటూరి అంజయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. 61 మందితో అంజయ్య భారీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యేకు కార్పొరేషన్ పదవో, మరో పదవో ఇచ్చి తనకు అసమ్మతి లేకుండా చేసుకోవడానికి అంజయ్య తంటాలు పడ్డారు. ఇందిరాగాంధీ అండదండలున్నా అసమ్మతి కారణంగా అంజయ్య కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంజయ్య స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న భవనం వెంకట్రామ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలనలో అవినీతి కొత్త పోకడలు పోయింది. అసెంబ్లీ కాలపరిమితి మరో రెండు, మూడు నెలల్లో ముగుస్తుందనగా భవనంను తప్పించి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ విధంగా ఐదేళ్ల వ్యవధిలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు.


ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా, సీల్డు కవర్లో తాము నిర్ణయం చేసినవారే ముఖ్యమంత్రులయ్యే ఓ దుష్ట సంప్రదాయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం నెలకొల్పింది. ఆ పాలన ప్రజల్లో తీవ్రమైన ఏవగింపు కలిగించింది. నిజానికి రాష్ట్రంలోని ఆర్థిక, రాజకీయ, పరిపాలనా రంగాల్లో వైఫల్యం, నెలకొన్న సంక్షోభాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అటువంటి నేపథ్యంలోనే ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు.

రాజకీయాల్లోకి రావాలని గట్టి నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. ముందుగా తాను ఒప్పుకున్న చిత్రాల షూటింగ్ పూర్తి చేసుకొన్నారు. మార్చి 29న మధ్యాహ్నం 2.30 గంటలకు నూతన పార్టీని ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చిన్న హాలులో కొద్దిమంది సమక్షంలో పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించాలనుకున్నారు. కానీ, ఆ ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వారంతా దిక్కులు పిక్కటిల్లేటట్లు ‘ఎన్టీఆర్ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేస్తున్నారు. దాంతో, పార్టీ ప్రకటన వేదికను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలోని పచ్చిక మైదానంలోకి మార్చారు. అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ‘‘నా ప్రియమైన సోదర సోదరీమణులారా! కొన్ని నెలలుగా నేను రాజకీయాలలో ప్రవేశించడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుందోనని అనుకున్నాను. కానీ ఎటువంటి ఆహ్వానం లేకుండానే మీరందరూ ఇక్కడకు రావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ అభిమానానికి పులకించిపోతున్నాను. ఈ క్షణాన నేను రాజకీయాలలో అడుగుపెడుతున్నాను’’ అంటూ క్లుప్తంగా ఆయన తన ఉపన్యాసాన్ని ముగించగానే ఆ ప్రాంతమంతా చప్పట్లు, ఈలలు, నినాదాలతో మారుమోగిపోయింది.


‘మీ పార్టీ పేరేంటి సార్?’ ఎవరో విలేఖరి గుంపులోంచి ప్రశ్నించాడు. ఒక్క క్షణం అంతటా నిశ్శబ్దం. ఎన్టీఆర్ తన లాల్చీ జేబులోంచి ఓ కాగితం బయటకు తీశారు. దానిపై కొన్ని అక్షరాలు రాసి ఉన్నాయి. ‘తెలుగుదేశం’ అని ఎన్టీఆర్ అంటూ ‘‘నేను తెలుగువాణ్ణి. ఈ రోజు నుంచి నా జీవితాన్ని తెలుగు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అంకితం చేస్తున్నాను. మహోన్నతమైన తెలుగు సంస్కృతిని, తెలుగుభాష ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతాను. అందుకే మా పార్టీ పేరును ‘తెలుగుదేశం’గా నామకరణం చేస్తున్నాను’’ అని ప్రకటించారు. ఆ విధంగా 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.

పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్టీఆర్ చైతన్య రథంపై ప్రజల వద్దకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా 36వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం వెళ్లి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. వారిలో భరోసా నింపారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే తన పార్టీ మూల సిద్ధాంతం అని స్పష్టం చేశారు. ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం.. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా’ అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించింది. వయస్సుతో నిమిత్తం లేకుండా యువత, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ చైతన్యరథం వెంట పరుగులు తీశారు.


వినూత్న ప్రచారశైలి, ఉన్నతమైన సిద్ధాంతాలు, సామాన్యులు–బడుగుబలహీన వర్గాలకు ఇచ్చిన రాజకీయ భాగస్వామ్యం, ఉవ్వెత్తున లేచిన తెలుగువారి ఆత్మగౌరవ బావుటా, అన్నిటికి మించి ఎన్టీఆర్ నిబద్ధత... ఇలా అనేక అంశాలు కలిసి రావడంతో ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. తొలిరోజు నుంచి నేటి వరకు సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనా రంగాల్లో పార్టీ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ నేతృత్వంలో దాదాపు 8 సంవత్సరాలు, చంద్రబాబునాయుడు సారథ్యంలో 9 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఎక్కడా రాజీపడకుండా పరిపాలన సాగించింది. ప్రాంతీయ పార్టీ అయినా రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను సైతం శాసించే స్థానానికి చేరుకుంది.

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య ఐదేళ్లు; తిరిగి 2024 నుంచి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో వడివడిగా ముందుకు తీసుకువెళుతున్న తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఈ నాలుగున్నర దశాబ్దాల ప్రస్థానంలో తెలుగుదేశం తన మూల సిద్ధాంతంలో ఎటువంటి మార్పు లేకుండా ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు విధానాలను కొనసాగిస్తూ, నేడు 3.0 అధ్యాయంలోకి ప్రవేశించింది. యువ నేత నారా లోకేశ్‌ ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా మరింత వినూత్నంగా ముందుకు సాగుతోంది.

-టి.డి జనార్దన్

-విక్రమ్ పూల

Updated Date - Mar 28 , 2026 | 12:51 AM