Share News

సేద్యానికి సెలవే శ్రేయస్కరం!

ABN , Publish Date - Oct 24 , 2026 | 02:10 AM

నీటి లభ్యత, భూసారం, అనుకూల వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వ్యవసాయ రంగం ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, జలవనరులు అందుబాటులో ఉన్నప్పుడు పంటల సాగు సాఫీగా సాగి, రైతుకు ఆదాయాన్ని అందిస్తుంది.

సేద్యానికి సెలవే శ్రేయస్కరం!

నీటి లభ్యత, భూసారం, అనుకూల వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వ్యవసాయ రంగం ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, జలవనరులు అందుబాటులో ఉన్నప్పుడు పంటల సాగు సాఫీగా సాగి, రైతుకు ఆదాయాన్ని అందిస్తుంది. అయితే లోటు వర్షపాతంతో జలాశయాలు, చెరువులు, భూగర్భజలాలు క్షీణించినప్పుడు పంటల దిగుబడులు తగ్గడమే కాకుండా సాగు పెట్టుబడులు నష్టాలుగా మారి రైతులు అప్పుల పాలయ్యే ప్రమాదముంది. ఈ ప్రభావం తాగునీరు, పశుపోషణ, విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి, ఆహార భద్రతపైనా పడుతుంది. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు పరిస్థితుల నేపథ్యంలో రాబోయే యాసంగి సాగును నీటి లభ్యతకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చేపట్టడం అత్యవసరం. ముఖ్యంగా తాగునీటికి ప్రాధాన్యమిస్తూ, నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఒక పంట కాలం సాగుకు విరామం ఇవ్వడాన్ని ప్రత్యామ్నాయంగా పరిశీలించాలి.

వ్యవసాయంలో పంట సెలవు కొత్త పరిణామమేమీ కాదు. సుమారు పదిహేనేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి, ఖమ్మం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వరి రైతులు గిట్టుబాటు ధరలు లభించకపోవడాన్ని నిరసిస్తూ పంట విరామానికి పిలుపునిచ్చారు. ఆర్థిక కారణాలతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా సాగు విస్తీర్ణం తగ్గిన సందర్భాలున్నాయి. 1987లో దేశవ్యాప్తంగా సంభవించిన తీవ్రమైన కరవు... పంటల ఉత్పత్తి, పశుగ్రాసం, గ్రామీణ ఉపాధి, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. అదేవిధంగా తెలంగాణలో 2015–16లో నెలకొన్న కరవుతో సాగునీటి వనరులు క్షీణించి, అనేక ప్రాంతాల్లో వరి సాగు గణనీయంగా తగ్గింది. ఈ అనుభవాలు కరవు తీవ్రమైన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం కంటే ముందుగానే జలవనరుల లభ్యతను అంచనా వేసి సాగు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.


గతంలో గిట్టుబాటు ధరల కోసం నిరసనగా ప్రకటించిన పంట సెలవుకు, ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న పంట విరామానికి మౌలికమైన తేడా ఉంది. నాటి పంట సెలవు ఆర్థిక సమస్యలపై నిరసన కాగా, నేటి పంట విరామం కరవు ముప్పును ఎదుర్కొనే ముందస్తు జాగ్రత్త చర్య. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న నీటిని మొదట తాగునీటికి, తరువాత పశుపోషణకు కేటాయించి, మిగిలిన లభ్యత ఆధారంగా వ్యవసాయ సాగును నిర్ణయించాలి. పరిమిత నీటి వనరులున్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, శనగ వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను స్థానిక నేల, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయవచ్చు. అయితే కనీస నేల తేమ కూడా లేని ప్రాంతాల్లో భారీ పెట్టుబడులతో సాగు చేపట్టి నష్టపోవడం కంటే ఒక పంట కాలం విరామం తీసుకోవడం ఆర్థికంగా సముచితం.

సాగుకు ఇచ్చే తాత్కాలిక విరామాన్ని భూసార పునరుద్ధరణకు కూడా ఉపయోగించుకోవచ్చు. గత రెండు దశాబ్దాలుగా అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం, వానాకాలం, యాసంగి సీజన్లలో వరి వంటి ఒకే పంటను నిరంతరం సాగుచేయడం వల్ల అనేక ప్రాంతాల్లో నేల ఆరోగ్యంపై ఒత్తిడి పెరిగింది. పంట విరామ సమయంలో భూసార పరీక్షలు నిర్వహించడం, పంట అవశేషాలను నేలలో కలపడం, సేంద్రియ ఎరువులను వినియోగించడం వంటి చర్యలు చేపట్టాలి. పరిమితంగా నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పచ్చిరొట్ట పంటలను సాగు చేసి భూమిలో కలపవచ్చు. అదేవిధంగా ఒకే పంటను నిరంతరం సాగు చేసే ప్రాంతాల్లో విరామం ఇవ్వడం వల్ల కొన్ని చీడపీడలు, వ్యాధికారకాల జీవచక్రానికి అంతరాయం ఏర్పడి వాటి ఉధృతి తగ్గే అవకాశముంది. అయితే పంట విరామం ఒక్కటే భూసారాన్ని మెరుగుపరచదు. సమగ్ర నేల, పోషక యాజమాన్య చర్యలతో అనుసంధానించినప్పుడే దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి.


ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు కారణంగా ప్రపంచంలోని పలు దేశాలతో పాటు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా తెలంగాణలోనూ నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని సుమారు 360 మండలాల్లో సాధారణం కంటే 30–40శాతం వరకు వర్షపాత లోటు ఉన్నట్లు వస్తున్న అంచనాలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే డిసెంబరు నాటికి జలాశయాలు, చెరువులు, భూగర్భ జలాల్లో నీటి లభ్యత మరింత తగ్గుతుంది. ముఖ్యంగా వరి వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలకు కీలక దశల్లో తగినంత నీరు అందకపోతే దిగుబడులు తగ్గుతాయి. దీంతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, విద్యుత్, యంత్రాలపై పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక చిన్న, సన్నకారు రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందువల్ల మండలాలవారీగా వర్షపాతం, జలాశయాల నిల్వలు, భూగర్భ జలమట్టాలను సమీక్షించి యాసంగి సాగుపై ముందస్తు నిర్ణయం తీసుకోవాలి.

నీటి కొరతకు తోడు విద్యుత్ సరఫరాలోనూ సవాళ్లు తలెత్తవచ్చు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బొగ్గు, సహజవాయువు సరఫరాపై ప్రభావం చూపే అవకాశముండగా, వర్షాభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణపై ఒత్తిడి పెంచవచ్చు. భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో బోర్ల నుంచి నీటిని తోడేందుకు అధిక విద్యుత్ అవసరమవుతుంది. కొత్త బోర్ల తవ్వకం, శక్తిమంతమైన మోటార్ల ఏర్పాటు రైతుల పెట్టుబడి భారాన్ని పెంచినా నీరు లభిస్తుందనే హామీ ఉండదు.


ఈ పరిస్థితుల్లో రైతుల ముందున్న ప్రధాన ప్రత్యామ్నాయాలు రెండు. మొదటిది– నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో స్వచ్ఛందంగా యాసంగి సాగుకు విరామం ఇవ్వడం. రెండవది– పరిమిత నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవడం. అయితే ఏ నిర్ణయమైనా సాగు వ్యయం, ఆశించిన దిగుబడి, నేల స్వభావం, తేమ లభ్యత, పంటకాలం, మార్కెట్ అవకాశాలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ఆధారంగా తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించాలి.

కరవు సహజ వాతావరణ పరిణామమైనా, దాని ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వం, రైతులు, సంబంధిత శాఖల సమన్వయం కీలకం. ఈ సమస్యను రాజకీయాలకు కాకుండా శాస్త్రీయ అంచనాల ఆధారంగా ఎదుర్కోవాలి. రైతులు కూడా నిరాధార ఆరోపణలకు ప్రభావితం కాకుండా, వాస్తవ పరిస్థితులను బట్టి సాగు నిర్ణయాలు తీసుకోవాలి. అదే సమయంలో, తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామిక హక్కును వినియోగించుకోవాలి. పంట విరామంతో రైతుల ఆదాయం, వ్యవసాయ కూలీల ఉపాధి తగ్గే అవకాశం ఉన్నందున చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, రుణాల పునర్వ్యవస్థీకరణ, వడ్డీ ఉపశమనం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీ పనులను నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూసార అభివృద్ధితో అనుసంధానించడంతోపాటు పశుగ్రాస సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జల, విద్యుత్, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో మండలాలవారీగా జల బడ్జెట్ రూపొందించి, నీటి కేటాయింపులకు ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించాలి.


ఒక పంట కాలం సాగుకు విరామం ఇచ్చినా తదుపరి అనుకూల సీజన్‌లో తిరిగి సాగు ప్రారంభించవచ్చు. కానీ భూగర్భ జలాలు తీవ్రంగా క్షీణిస్తే వాటి పునరుద్ధరణకు సంవత్సరాలు పట్టవచ్చు. అందువల్ల రైతులకు తగిన ఆర్థిక రక్షణ కల్పిస్తూ, రాబోయే వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిమిత జలవనరులను సంరక్షించాలి. ఇది వ్యవసాయాన్ని వదులుకోవడం కాదు, భవిష్యత్తు సాగుకు అవసరమైన సహజ వనరులను కాపాడుకునే ముందుచూపు.

- ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

ఉపకులపతి, జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం

Updated Date - Oct 24 , 2026 | 02:12 AM