Share News

వనరులకు చేటుతెచ్చే విజన్‌లు వద్దు!

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:50 AM

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికకు సహజ వనరుల వినియోగం అత్యంత కీలకం. భూమి, నీరు, అడవులు, ఖనిజ సంపద ముఖ్యమైన సహజ వనరులు అనుకుంటే, వీటి వినియోగం ఎంత బాగా...

వనరులకు చేటుతెచ్చే విజన్‌లు వద్దు!

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికకు సహజ వనరుల వినియోగం అత్యంత కీలకం. భూమి, నీరు, అడవులు, ఖనిజ సంపద ముఖ్యమైన సహజ వనరులు అనుకుంటే, వీటి వినియోగం ఎంత బాగా చేసుకుంటామన్నది, స్థానిక ప్రజల దృష్టి కోణం నుంచి మాత్రమే ఆలోచించాలి. ఈ అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్ర ప్రజల జీవనోపాధుల రక్షణ, కల్పన అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలుగా ఉండాలి. ప్రాణాధారమైన గాలి, నీరు, ఆహారం, విషపూరితం కాకుండా కాపాడుకోవడం కూడా అత్యంత కీలక భాగంగా ఉండాలి.

ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం, 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా 5కోట్లకు పైబడుతుందని అంచనా. ఆవులు, గేదెలు, ఎడ్లు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు, పందుల లాంటి పశువుల సంఖ్య (కోళ్ళు కాకుండా) కూడా అయిదు కోట్లు దాటే అవకాశం ఉంటుంది. ఈ మనుషులకు, పశువులకు, కోళ్లకు అవసరమైన ఆహారం కోసం పంటల ఉత్పత్తికి తగినంత భూమి అవసరం. అందువల్ల సాగు భూములను కాపాడుకోవాలి.

రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు, మైనింగ్, చేపల పెంపకం లాంటి రంగాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం. కానీ వీటికి కావలసిన వనరులను కేటాయించడానికి సరైన సహజ వనరుల వినియోగ విధానం లేదు. ముఖ్యంగా భూమి, నీటి వినియోగ విధానం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ స్పష్టంగా రూపొందించలేదు. ఇదే ధోరణి కొనసాగితే, వనరుల వినియోగంలో రాష్ట్రం తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటుంది. ఒకసారి కోల్పోయిన ప్రకృతి వనరులను మళ్ళీ వెనక్కు తీసుకురావడం అసాధ్యం.

రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులకు, ఇక్కడి నేల స్వభావానికి అనువు కాని పంటల పొందిక కారణంగా వ్యవసాయంలో నీటి వినియోగం, విష రసాయనాల వినియోగం భారీగా పెరుగుతున్నది. ఇవి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉద్గార వాయువులను పెంచడంతోపాటు నీటి వనరులను విషపూరితం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఆహారం కూడా అత్యంత విషపూరితంగా తయారై ఆరోగ్యాలకు చేటు తెస్తున్నది. సహజంగా తెలంగాణ భౌగోళిక స్వభావం రీత్యా నీటి వనరుల వినియోగం కోసం అనివార్యంగా అత్యధిక విద్యుత్ వాడాలి. రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వాడకం పెరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటాయి. కానీ సుస్థిర, పర్యావరణహితమైన అభివృద్ధి నమూనాకు అది ఎంతమాత్రం సరైన సూచిక కాదు.


రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి దీర్ఘ దృష్టి లేదనడానికి నిదర్శనంగా అనేక విధానాలు కొనసాగుతున్నాయి. నగరాల విస్తరణ, అభివృద్ధి పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నది. రాష్ట్రంలో కృత్రిమ మేధ, కంప్యూటరీకరణ, రోబోట్స్ ఆధారిత అంతర్జాతీయ స్థాయి సేవా రంగ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి కానీ, స్థానిక యువతకు అందులో ఉపాధి లభించటం లేదు. అలాగే వివిధ రకాల కాలుష్య కారక పరిశ్రమలను ఎలాంటి విచక్షణ లేకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగపడని బడా కార్పొరేట్ సంస్థల కోసం పన్ను రాయితీలు ఇస్తున్నారు. ఆయా పారిశ్రామిక ప్రాంతాలకు ప్రభుత్వ నిధులతో మౌలిక వసతుల కల్పిస్తున్నారు. వాటికి కార్మిక చట్టాల మినహాయింపులు ఇస్తున్నారు. శ్రామికుల పని గంటలు పెంచుతున్నారు. మరోపక్క కార్మిక సంఘాల ఉనికిని గుర్తించటం లేదు. మొత్తంగా కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి లాంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇవన్నీ కొత్త అభివృద్ధి నమూనాలో భాగంగా ఉన్నాయి. నిజంగా 2047 విజన్ ఇదే అయితే, దీనిని రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర వనరులకు అన్యాయం చేసే విజన్‌గానే మనం దీన్ని గుర్తించాలి.

ఈ అభివృద్ధి నమూనా కోసం రాష్ట్రంలో ప్రభుత్వం సాగిస్తున్న భూ సేకరణ పద్ధతి మరింత అన్యాయం. భూ వినియోగ విధానం లేకుండా, అడ్డగోలుగా లక్షలాది ఎకరాల భూమిని సేకరించడం సరికాదు. పైగా కార్పొరేట్ సంస్థల సరుకుల వేగవంతమైన రవాణాకు తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని రీజనల్ రింగు రోడ్డు కోసం, లేదా ఏ మాత్రం ప్రజా ప్రయోజనం లేని కొన్ని బడా సంస్థల కోసం నిర్మించాలని తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం భూములను రైతుల నుంచి సేకరించడం అన్యాయమే.

రాష్ట్రంలో భూ సేకరణ విషయంలో చర్చకు వస్తున్న కొన్ని కీలక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. వాటిపై ప్రజలకు జవాబు చెప్పాలి. గత మూడు దశాబ్దాలలో రాష్ట్రంలో వివిధ పార్టీల ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో సేకరించిన భూమిని నిజంగా వినియోగించారా? ఆ భూమిలో ఏయే సంస్థలు పెట్టుబడులు పెట్టాయి? వాటిలో తెలంగాణ స్థానికులకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ భూ సేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఎంతమందికి గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి అనేది స్పష్టంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. గ్రామీణ ప్రజల హక్కులను హరిస్తూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనా కాలంలో 2017లో కేసీఆర్‌ తెచ్చిన భూ సేకరణ చట్టాన్ని రద్దు చేసి, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా 2013 భూసేకరణ చట్టాన్ని (సోనియాగాంధీ నేతృత్వంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని) పూర్తి స్థాయిలో అమలుచేయాలి.


ఈ చట్టం ప్రకారం భూ సేకరణకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ తప్పకుండా చేయాలి. భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చే ముందే మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల రిజిస్టర్డ్ ధరలను సవరించాలి (ఎక్కువ వ్యత్యాసం లేకుండా). రెండు పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితులలోనూ సేకరించకూడదు. అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాలి. కేవలం భూ యాజమానులనే కాకుండా ప్రాజెక్టు ప్రభావిత బాధిత ప్రజలకు కూడా నష్ట పరిహారం చెల్లించాలి.

అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో భూమి సేకరించే ముందు నిజంగా అది ఎంత ప్రజా ప్రయోజనకరమో ప్రజలకు క్షేత్ర స్థాయిలో వివరించాలి. ఒప్పించి మాత్రమే భూమిని తీసుకోవాలి. నిజంగా పరిశ్రమలు, రోడ్లు... లాంటి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూమిని రైతుల నుంచి పూర్తిగా లాక్కోకుండా, వారి భూములపై వారికి ఉండే పట్టా హక్కులు మార్చకుండా, ఆయా భూముల యాజమానుల నుంచి భూమిని దీర్ఘ కాలానికి లీజుకు (కౌలుకు) తీసుకుంటే మంచిది.

అలా కాకుండా, ఎలాంటి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు లేకుండా, ఆ ప్రత్యేక పారిశ్రామిక జోన్‌లోకి నిజంగా వస్తాయో లేదో తెలియని పరిశ్రమల కోసం ముందుగానే వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించడం, పైగా ఆ భూములకు అతి తక్కువ నష్టపరిహారం చెల్లించడం అన్యాయం. ఇప్పటికే అలా సేకరించిన భూముల్లో వచ్చిన పరిశ్రమలు చాలా తక్కువ, వచ్చిన కొద్దిపాటి పరిశ్రమలు కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సేకరణ పూర్తిగా ఆపేయాలి. ఇప్పటికే భూ సేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా రద్దు చేయాలి. రాష్ట్ర భూ వినియోగ విధానం రూపొందించి, నిజంగా అవసరమైన సందర్భంలో మాత్రమే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అన్ని నిబంధనలు అనుససరించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు వెళ్లాలి.

కన్నెగంటి రవి

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ

ఇవి కూడా చదవండి..

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 17 , 2026 | 01:50 AM