స్థానిక స్వపరిపాలనకు కొత్త శకం
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:16 AM
పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. రాష్ట్రంలోని నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలోని చైర్‌పర్సన్‌లు..
పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. రాష్ట్రంలోని నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలోని చైర్‌పర్సన్‌లు, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని ఆగస్టు 18న శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 వరకు ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా ప్రజలే నేరుగా చైర్‌పర్సన్, మేయర్‌లను ఎన్నుకొనేవారు. తరువాత పరోక్ష పద్ధతి ద్వారా వారిని ఎన్నుకుంటున్నారు. మారుతున్న ఓటర్ల, రాజకీయ నాయకుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రస్తుత చట్టానికి సవరణలు తెచ్చి, ప్రత్యక్ష పద్ధతి ద్వారానే ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది.
చైర్‌పర్సన్, మేయర్‌లను ఓటర్లే నేరుగా ఎన్నుకొనే విధానం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నాయకుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి కుక్కల సమస్యలపై సాకులు చెప్పటానికి అవకాశం ఉండదు. ఐదు సంవత్సరాల స్థిరమైన; బలమైన పదవీకాలం ఉంటుంది. పార్టీలు మారినా, కౌన్సిల్, కార్పొరేషన్‌లో గ్రూపులు మారినా చైర్‌పర్సన్/మేయర్ పదవికి ఎటువంటి ప్రమాదం ఉండదు. దీంతో దీర్ఘకాలిక ప్రణాళికలు, స్మార్ట్ సిటీ లాంటి పథకాలు పక్కాగా, వేగంగా అమలు జరుగుతాయి. ప్రస్తుతం చైర్‌పర్సన్/మేయర్ సీటు కోసం కోట్లు ఖర్చు చేసి వార్డ్ మెంబర్లను, కార్పొరేటర్లను కొనాల్సి వస్తోంది. ప్రత్యక్ష ఎన్నిక విధానం వస్తే ఆ ఆరోపణలు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా, ఎన్నికలు అయ్యాక అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్‌పర్సన్/మేయర్‌ను పదవిలోంచి దించేస్తారనే భయం ఉండదు. దాంతో పూర్తి పదవీకాలం ఆందోళనరహితంగా పనిచేసుకునే అవకాశం ఉంటుంది.
లాభాలతో పాటు నష్టాలు లేదా సవాళ్లు కూడా ఉంటాయన్నట్టుగా ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. చైర్‌పర్సన్/మేయర్ పదవికి పోటీ చేసే వ్యక్తికి చాలా శ్రమ, ఆర్థిక భారం ఎదురవుతుంది. ఇంతకుముందు– ఒక వార్డు/డివిజన్‌లో మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తే, ఇప్పుడు మున్సిపాలిటీ, కార్పొరేషన్ మొత్తం మీద దృష్టి పెట్టి ప్రచారం చేయాలి. ఇక్కడ కూడా ధన బలం, కుల బలం ఉన్నవారికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ రాష్ట్రంలో అధికారం మారితే, పట్టణ స్థానిక సంస్థలలో పాలన స్తంభిస్తుంది. చైర్‌పర్సన్/మేయర్లకు, శాసనసభ్యులకు మధ్య ఘర్షణ వాతావరణం పెరిగి ప్రజా సంక్షేమం కుంటుపడే ప్రమాదం ఉంది.
ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల అనుభవాలు చూస్తే– నాయకుల్లో జవాబుదారీతనంతో పాటు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నట్లు, ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగినట్టు, ప్రజలతో సంబంధాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పరోక్ష ఎన్నికల కంటే ప్రత్యక్ష ఎన్నికలే ప్రయోజనకరం.
- వి. రాజేంద్రప్రసాద్
విశ్రాంత ప్రాంతీయ సంచాలకులు