Share News

రైస్ మిల్లింగ్ వ్యవస్థను గాడిలో పెట్టాలి

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:27 AM

తెలంగాణలో దశాబ్ద కాలంగా రైస్ మిల్లింగ్ వ్యవస్థ అనేక సమస్యలతో సతమతమవుతున్నది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, ఏకపక్ష కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్‌) ఒప్పందాలు, అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది మిల్లర్ల అక్రమాలు..

రైస్ మిల్లింగ్ వ్యవస్థను గాడిలో పెట్టాలి

తెలంగాణలో దశాబ్ద కాలంగా రైస్ మిల్లింగ్ వ్యవస్థ అనేక సమస్యలతో సతమతమవుతున్నది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, ఏకపక్ష కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్‌) ఒప్పందాలు, అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది మిల్లర్ల అక్రమాలు ఈ పరిస్థితికి కారణం. ఈ వ్యవస్థను గాడిలో పెట్టి, రైతులు, మిల్లర్లు, కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇవ్వాలి. అయితే ధాన్యం నాణ్యత, తేమ శాతం, నిల్వ పరిస్థితులు తదితర అంశాలు బియ్యం దిగుబడిపై ప్రభావం చూపుతాయి. వాస్తవ దిగుబడిని శాస్త్రీయంగా నిర్ధారించకుండా, నిర్దేశిత పరిమాణంలో బియ్యం ఇవ్వలేకపోయిన ప్రతి మిల్లర్‌ను ఒకే విధంగా ఎగవేతదారుగా పరిగణించడం సమంజసం కాదు. అందువల్ల ఖరీఫ్‌, రబీ సీజన్లకు విడివిడిగా టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి, వాస్తవ అవుట్‌టర్న్ రేషియోను నిర్ధారించాలి. ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడిన వారిని, పరిస్థితులు లేదా విధానపరమైన లోపాల వల్ల బకాయిపడిన వారిని వేరు చేయాలి.

ప్రతి పంట సీజన్‌ తర్వాత నిల్వలను తనిఖీ చేసి, ధాన్యం, బియ్యం సరఫరా, బకాయిలపై అధికారులు లెక్కలు తేల్చాలి. గతంలో ఈ ప్రక్రియ సక్రమంగా జరిగిందా? పాత బకాయిలను పరిష్కరించకుండానే, నిల్వలను సమగ్రంగా తనిఖీ చేయకుండానే తదుపరి సీజన్లలో ధాన్యం కేటాయింపులు కొనసాగించారా? అనే అంశాలను సమీక్షించాలి. నాణ్యత లేని ధాన్యం, గన్నీ సంచుల వల్ల మిల్లర్లు ఎదుర్కొన్న నష్టాలు, పెరిగిన హమాలీ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే అధికారులు నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా వారిపైనా నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి.


ధాన్యం సకాలంలో తిరిగి తీసుకోకపోవడం వల్ల తరుగు, నాణ్యత నష్టాలు ఏర్పడుతున్నాయని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపించిన ధాన్యం వల్ల బియ్యం రంగు మారి, ఎఫ్‌సీఐ వద్ద తిరస్కరణకు గురైనప్పుడు నష్టానికి అసలు కారణాలను పరిశీలించాలి. ధాన్యం నాణ్యత, నిల్వ, తరలింపులోని లోపాలకు మిల్లర్లనే పూర్తి బాధ్యులుగా చేయడం న్యాయం కాదు. మరోవైపు, మిల్లర్లకు చెల్లించాల్సిన మిల్లింగ్, రవాణా చార్జీలు, ఇతర అర్హమైన బకాయిలపై ప్రభుత్వం సమగ్ర లెక్కలు ప్రకటించి, చెల్లింపులు జరపాలి. ధాన్యం తరలింపులో జాప్యం వల్ల ఏర్పడే నష్టాలకు పరిహారం లేదా డెమరేజ్ చెల్లింపులపై స్పష్టమైన విధానం రూపొందించాలి. ముఖ్యమంత్రి– అధికారులతో, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను వినాలి. వాస్తవాలను సమీక్షించి, విల్‌ఫుల్ డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాన్‌–విల్‌ఫుల్ డిఫాల్టర్ల విషయంలో ఉపశమనం కల్పించాలి. అర్హమైన ప్రభుత్వ బకాయిలను చెల్లించి, వివాదాస్పద బకాయిలను సమీక్షించాలి. నిబంధనల ప్రకారం వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పించాలి.

భవిష్యత్తులో పారదర్శకమైన సీఎంఆర్‌ ఒప్పందాలు, సీజన్‌ వారీ టెస్ట్ మిల్లింగ్, క్రమబద్ధమైన నిల్వల తనిఖీలు, సమయానుకూల ధాన్యం తరలింపు, స్పష్టమైన బాధ్యతలతో కూడిన కొత్త విధానాన్ని అమలు చేయాలి. ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కాపాడుతూ, తప్పు చేసినవారిని శిక్షించే సమతుల్య విధానం అవసరం.

- సయ్యద్ రఫీ (గౌరవాధ్యక్షుడు, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్)

Updated Date - Nov 07 , 2026 | 01:29 AM