పాలిటెక్నిక్.. ‘శక్తి’యుక్తం!
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:29 AM
ప్రస్తుత విద్యా విధానంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ స్థాయిల్లో మెజారిటీ విద్యార్థులు డిగ్రీలు సాధిస్తున్నప్పటికీ, పరిశ్రమలకు అవసరమైన కనీస నైపుణ్యాలు లేకపోవడమే నేటి నిరుద్యోగానికి ప్రధాన సమస్యగా మారింది.
ప్రస్తుత విద్యా విధానంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ స్థాయిల్లో మెజారిటీ విద్యార్థులు డిగ్రీలు సాధిస్తున్నప్పటికీ, పరిశ్రమలకు అవసరమైన కనీస నైపుణ్యాలు లేకపోవడమే నేటి నిరుద్యోగానికి ప్రధాన సమస్యగా మారింది. ఐటీ రంగంలో ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాన్ని తట్టుకుని సంస్థలు మునుపటిలా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు సృష్టించే రోజులు పోయాయి. అదే సమయంలో రానున్న రోజుల్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ ఇంజనీరింగ్ విద్య కీలకం కానుందని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు.
ఈ పెనుమార్పును ముందుగానే గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆ దిశగా వేగంగా అడుగులు వేశారు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయడానికి ఆయా పనులకు 2024 జూన్‌లో శంకుస్థాపన చేశారు. పదిహేను నెలలు తిరగక ముందే, అంటే 2025 సెప్టెంబర్‌లో 65 ఏటీసీలను ప్రారంభించారు. శిలాఫలకాలు, టెంకాయలు, శంకుస్థాపనలకు సంవత్సరాల తరబడి సాగదీసే సంస్కృతి చూసిన తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి అనతికాలంలోనే పూర్తిచేయడం అసాధారణ విషయం. 65 ఏటీసీల్లో శిక్షణ పొందిన విద్యార్థులు ఇప్పటికే గొప్ప ఫలితాలు కనబరుస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,572 మంది ఏటీసీ విద్యార్థులు వివిధ క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో పాల్గొనగా ఏకంగా 82 శాతం మందిని అంటే 2,113 విద్యార్థులను ప్రఖ్యాత యాపిల్, ఐటీసీ, ఎల్ & టీ, భారత్ డైనమిక్స్, ఐచర్, అపోలో, టాటా మోటార్స్, స్నైడర్ ఎలక్ట్రిక్ వంటి మేటి సంస్థలు మంచి పారితోషికాలతో ఉద్యోగాల్లో చేర్చుకున్నాయి. రానున్న నెలల్లో ఇంకా కొన్ని వేల మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందనున్నారు. ఈ 65 ఏటీసీలతో పాటు మరో 54 ఏటీసీలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.
ఇదే విధంగా ఇండస్ట్రీ 4.0 సాంకేతికతకు అనుగుణంగా కోర్సులను ఆధునికీకరించి, ప్రాక్టికల్ శిక్షణతో విద్యార్థులకు మార్కెట్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను అందించాలని పారిశ్రామిక నిపుణుల సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను బలపరుస్తూ పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సరికొత్త పరిపాలనా సంస్కరణలతో పాలిటెక్నిక్ కళాశాలలను ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ పరిధిలోకి తెస్తూ నూతనంగా ఏర్పాటైన ‘శక్తి’ శాఖకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
కానీ ప్రతిపక్ష పార్టీలు, వాటి వెనుక ఉన్న కొన్ని దుష్టశక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టించటం దురదృష్టకరం. శక్తి శాఖ పరిధిలోకి వెళ్తే ఇంజనీరింగ్‌లోకి లాటరల్ ఎంట్రీ ఆగిపోతుందని, ఫీజులు పెరుగుతాయని, పాలిటెక్నిక్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారని చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. ఇవన్నీ కేవలం విద్యా సంస్కరణలను, రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడానికి సృష్టించిన దుష్ప్రచారాలు మాత్రమే.
ఈ మార్పు వెనుక ప్రభుత్వ ఉద్దేశం పాలిటెక్నిక్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కాదు, దానికి మరింత ‘శక్తి’ని ఇవ్వడం. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థి కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా, చదువు పూర్తి కాగానే అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయడమే ఈ శక్తి అసలు ధ్యేయం.
దీంతో భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉండే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ పొందే పాలిటెక్నిక్ విద్యార్థులకు మంచి పునాది ఏర్పడుతుంది.
హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్–1 ప్రయోగం ఇటీవల విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1,300కు పైగా మెకానికల్, ఏరోస్పేస్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లే ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు కాదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అవకాశాల గురించి వివిధ వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే, ఇండస్ట్రీ 4.0 సాంకేతిక శిక్షణ పొందిన విద్యార్థులకు రానున్న రోజుల్లో జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాల్లో భారీ స్థాయిలో డిమాండ్ ఉండగా, ఆయా దేశాల్లో అవసరమయ్యే భాషా పరిజ్ఞానం కలిగించేందుకు టాంకాం సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మన దేశంలోనూ ఈ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణుల అంచనా. కొసమెరుపు ఏంటంటే ఈ శిక్షణ కలిగిన ఏటీసీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు రానున్న కాలంలో ఇంజనీరింగ్ విద్యార్థులకంటే మెరుగైన జీతాలు ఉండే అవకాశం లేకపోలేదు. కళాశాలలు కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చే నిరుద్యోగుల కర్మాగారాలుగా మారకూడదనే ఆలోచనతో ఈ పాలిటెక్నిక్ సంస్కరణలు ప్రతిపాదించారు. ఈ విధానంతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
- మేడిపల్లి సత్యం
చొప్పదండి ఎమ్మెల్యే