రైతు పాలిట కల్పవృక్షం ‘ఆయిల్ పామ్’
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:46 AM
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వంటనూనెల దిగుమతి భారం తీరని లోటుగా మారింది. ఏటా సుమారు రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని కేవలం పామ్ ఆయిల్ దిగుమతుల కోసమే వెచ్చిస్తున్నాం.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వంటనూనెల దిగుమతి భారం తీరని లోటుగా మారింది. ఏటా సుమారు రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని కేవలం పామ్ ఆయిల్ దిగుమతుల కోసమే వెచ్చిస్తున్నాం. ఈ నేపథ్యంలో వంటనూనెల రంగంలో దేశాన్ని ‘ఆత్మనిర్భర్’గా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్‌ను ప్రవేశపెట్టాయి. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతి భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును ఉద్యమంలా ముందుకు తీసుకెడుతోంది. కేవలం సాగుకే పరిమితం కాకుండా, దానిని పారిశ్రామికాభివృద్ధితో అనుసంధానించడం ద్వారా రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మారుస్తోంది.
ఆయిల్ పామ్ సాగు కేవలం పొలాల్లోనే కాకుండా, పరిశ్రమల స్థాపనలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. పండించిన గెలలను తక్షణమే ప్రాసెస్ చేయాల్సి ఉండటంతో, ప్రతి సాగు జోన్‌లో ప్రాసెసింగ్ మిల్లుల నిర్మాణం యుద్ధప్రతిపాదికన జరుగుతోంది. ఒక్కో ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా వందలాది మందికి నేరుగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, సూర్యాపేట వంటి జిల్లాల్లో ఈ పంట ఆశాజనకమైన ఫలితాలను ఇస్తోంది. గతంలో కొన్ని ప్రైవేటు కంపెనీల వైఫల్యాల వల్ల రైతుల్లో నెలకొన్న అపనమ్మకాన్ని తొలగించి, ఆయిల్ ఫెడ్ నేరుగా రంగంలోకి దిగడం సాగు విస్తరణకు బలమైన ఊతాన్నిచ్చింది.
ఆయిల్ పామ్ రైతుకు అత్యధిక ఆదాయాన్నిస్తుంది. ఒక ఎకరా తోట ద్వారా ఏడాదికి సగటున 10 నుంచి 12 టన్నుల గెలల (ప్రారంభంలో ఆరు పైన) దిగుబడి వస్తుంది. జనవరి 2026 నాటికి టన్ను ధర సుమారు రూ.20,456 ఉంది. అంటే, ఎకరాకు అన్ని ఖర్చులు పోను ఏడాదికి రూ.1.5 లక్షల నుంచి రెండు లక్షల నికర ఆదాయం రైతుకు లభిస్తుంది. సూక్ష్మ నీటిపారుదల ద్వారా ఇతర పంటల కంటే 40 శాతం నీటిని ఆదాచేయవచ్చు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట వద్ద ఆయిల్ ఫెడ్ నిర్మించిన ప్రాసెసింగ్ మిల్లు తెలంగాణ గర్వించదగ్గ సాంకేతిక అద్భుతం. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మిల్లు ఆరంభ దశలో గంటకు 30 మెట్రిక్ టన్నుల గెలలను క్రష్ చేసే సామర్థ్యం కలిగి ఉంది, దీనిని భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఉంది. ఇది ‘జీరో వేస్ట్’ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇక్కడ వెలువడే వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, సేంద్రియ ఎరువుల తయారీ జరుగుతుంది. ఇది రైతులకు స్థానికంగా మార్కెటింగ్ భరోసాను కల్పిస్తోంది. ఈ మిల్లులో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, అత్యాధునిక రిఫైనరీ, నీటి పునర్వినియోగం వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, ఇతరులకు 90శాతం డ్రిప్ రాయితీనిస్తోంది. అలాగే, మొక్కలు నాటిన మొదటి నాలుగేళ్లలో నిర్వహణ కోసం ఎకరానికి సుమారు రూ.52,000 వరకు రాయితీని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. తెలంగాణను ‘ఆయిల్ పామ్ హబ్’గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల రైతులు అద్భుతంగా స్పందిస్తున్నారు. ప్రైవేటు సంస్థల వైఫల్యం తర్వాత పగ్గాలు చేపట్టిన ఆయిల్ ఫెడ్, నర్మెట్ట, బీచుపల్లి ఫ్యాక్టరీల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక తోడ్పాటును అందిస్తోంది.
- బండి దుర్గాప్రసాద్
తెలంగాణ ఆయిల్ ఫెడ్ లైజనింగ్ ఆఫీసర్