కాలయాపనతో కాంగ్రెస్‌కు నష్టమే!
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:06 AM
నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలోని భూములను బొంబాయి సర్వే సిస్టం ఆధారంగా కొలతలు వేసి ‘సేత్వారు’ను తయారు చేశారు. కోస్తాంధ్రలో మద్రాసు సర్వే సిస్టమ్ ఆధారంగా ‘రీ సెటిల్మెంట్ రికార్డు’ ..
నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలోని భూములను బొంబాయి సర్వే సిస్టం ఆధారంగా కొలతలు వేసి ‘సేత్వారు’ను తయారు చేశారు. కోస్తాంధ్రలో మద్రాసు సర్వే సిస్టమ్ ఆధారంగా ‘రీ సెటిల్మెంట్ రికార్డు’ (ఆర్ఎస్ఆర్) తయారయ్యింది. తెలంగాణలో 1934–36లో రూపొందించిన సేత్వారు ఆధారంగా... ఏ భూములు ఎవరు సాగు చేస్తున్నారు, ఏ ఆధారాలతో సాగు చేస్తున్నారు. సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్, విస్తీర్ణం, వర్గీకరణ, పట్టాదారు పేరు, ఖాస్తుదారు పేరు, ఖాతా నెంబర్, తరి, ఖుష్కి, ఎంత పన్ను వసూలు చేయాలి... ఇలా 25 కాలమ్స్ గల పట్టికతో కూడిన దస్తావేజు 1954–55లో ‘ఖాస్రా’ పహాణీగా రూపొందించారు. పూర్తి స్థాయి గ్రామ రెవెన్యూ రికార్డులుగా సరిచేయటానికి మరో మూడు సంవత్సరాలు పట్టింది. 1958లో పహాణీ లేదా అడంగళ్గా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. భూముల అమ్మకాలు, కొనుగోలు, విరాసత్‌లు, దానపత్రాలుగా మార్పులు చేర్పులు లాంటి లావాదేవీలు, భూమి శిస్తు వసూళ్ల వివరాలు రాసేవారు.
రెవెన్యూ గ్రామంలో పక్కా భూమి లెక్కలతో ప్రతి సంవత్సరం ‘నాజిం–ఎ–జమాబంది’ చేసేవారు. పరిపాలన సౌలభ్యం కోసం, భూ విస్తీర్ణం ఆడిట్ అయ్యేది. ప్రతి ఇంచు భూమికీ లెక్క దొరికేది. ఇప్పుడు ఆ సంప్రదాయం పూర్తిగా నిర్వీర్యమయింది. ‘జమాబంది’ మాటే మరచిపోయాం. 1954–55 రికార్డులు కనుమరుగయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ముఖ్యమైన ఆధారం కావాలంటే ‘ఖాస్రా’నే కీలకం. ప్రభుత్వ రంగంలోని అన్ని సంస్థలు ఈ రికార్డులను దృష్టిలో పెట్టుకొనే ముందుకు వెళ్లాయి. సాక్ష్యాధారాలు చూడాలని జ్యుడీషియరీ ఆదేశాలు ఉంటే, తాలూకా కోర్టులు మొదలుకొని జిల్లా కోర్టులు, రాష్ట్ర హైకోర్టు వరకు ఖాస్రా రికార్డులను ప్రామాణికంగా తీసుకునేవారు. ఇప్పుడు అన్ని కోర్టులు వాటిని అడగడం మానేశాయి. భూమి విస్తీర్ణాల అవకతవకల విషయంలో తమ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కలెక్టర్, ఆర్డీవోలు రికార్డుల పరిశీలన నిమిత్తం ప్రజలకు ఈ దస్త్రాన్ని అధికారికంగా చూపించేవారు. కోర్టు విచారణ కోసం సమర్పించేందుకు జిరాక్స్ కాపీలను సాక్ష్యాలుగా చూపించేవారు. వీటిని జిరాక్స్ కేంద్రాలకు తీసుకువెళ్లినపుడు అక్కడ కూడా కొన్ని పేజీలు కనిపించకుండా పోయాయి. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అసలు రాత ప్రతులను తారుమారు చేశారు. ఇలాంటి అక్రమార్కుల వలన ఎంతో ప్రాముఖ్యం ఉన్న రికార్డుకు చాలా నష్టం జరిగింది. అవసరాలకు అనుగుణంగా రికార్డు గదులు అందుబాటులో లేక ఈ పుస్తకాలను ఒక మూటగా కట్టి మూలన పడేశారు. వాటికి చెదలు కూడా పట్టాయి.
అవసరం వచ్చినప్పుడు కాగితాలు తిరగేయడం వల్ల అవి చిరిగిపోయి చిన్న చిన్న ముక్కలు కావడం, పాతకాలపు అక్షరాలు తుడిచిపెట్టుకుపోయి సగం అక్షరంతో అస్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కాలపు తహసీల్దారు కార్యాలయంలో రికార్డు గదులను ఒక పద్ధతిగా ఉంచేవారు. రోజులు, సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ భూముల ధరలు పెరిగాయి. ఆ గదులను, రికార్డులను కార్యాలయ సిబ్బందితో సహా, అందరూ జీర్ణదశకు చేర్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని కార్యాలయాల రికార్డు గదులనూ ఆధునికీకరిస్తున్నారు.
2014కు ముందు నుంచే భూ రికార్డుల డిజిటలీకరణ మొదలుపెట్టారు. కానీ, 2020 నుంచి భూ ప్రక్షాళన వేగవంతం అయింది. పాత కాలం నాటి పాసుబుక్కులు, టైటిల్ డీడ్స్‌ను పూర్తిగా రద్దుచేసి ఆ స్థానంలో కొత్తగా ఆరు కాలమ్స్‌తో కూడిన ‘ధరణి’ పాస్ పుస్తకం పంపిణీ చేశారు. ఇందులో ఖాస్తు కాలమ్ లేదు. దానితోపాటు కంప్యూటరీకరణ అయిన రికార్డులతో ‘ధరణి’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. భూమి రికార్డులన్నీ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. భూముల వివరాలను ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవడానికి ప్రజలకు వెసులుబాటు దొరికింది. చేతితో పహాణీలు రాయడం ఆపేశారు. దీంతో మాన్యువల్ రికార్డు లేక, స్కాన్ చేసిన కాపీలలో స్పష్టత లేక గ్రామాలలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు గుర్తించి నిలువరించేవారు లేకుండా పోయారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టం తెచ్చింది. అందులో భూములకు కొలతలు వేసి, ప్రతి కమతానికీ భూధార్ నంబర్, భూధార్ కార్డ్ ఇస్తామని చెప్పింది. అది ఇంతవరకు మొదలు కాలేదు. ఇప్పటికైనా కొత్తగా నియమితులైన లైసెన్స్డ్ సర్వేయర్లతో సర్వే చేపడితే కొంత ఫలితం ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం పలు సందర్భాలలో ప్రతి గ్రామాన్నీ సర్వే చేసి, ప్రతి ఇంచు భూమికీ, ప్రతి కమతానికీ ఒక యూనిక్ నంబర్ ఇస్తామని వాగ్దానం చేసింది. భూ విస్తీర్ణాలు, పట్టాదారుల పేర్లు, ప్రభుత్వ భూములు, దేవాలయ, మసీదు, భూదాన, సీలింగు భూముల చిట్టాను గ్రామ చావిడీలలో చదివి వినిపించాలని సూచనలు వచ్చాయి. గత ప్రభుత్వానికి ఎన్ని వినతులు చేసినా అది వినిపించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్షేత్రస్థాయిలో ఎక్కడా భూధార్ నెంబర్‌తో, భూధార్ కార్డులు పంపిణీ కాలేదు. ఇలా కాలయాపన చేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. వివాదాలు ఉంటే వాటిని 90 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. పాత రికార్డులు లేని చోట ఆ గ్రామంలో పూర్తిగా సర్వే చేసి గ్రామసభలో కొత్తగా ‘ఖాస్రా పహాణీ’లకు రూపకల్పన చేయాలి. ఆ దిశగా ప్రతి రైతు, రైతు కూలీలతో పాటు ఆయా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
- వి. బాలరాజు
రిటైర్డు తహసీల్దార్