Share News

ఈ కాస్త ఊరటకే ఇంత సంబరమా?

ABN , Publish Date - May 05 , 2026 | 12:51 AM

కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో బీఆర్‌ఎస్‌ పార్టీ సంబరాలు చేసుకుంది. న్యాయస్థానం...

ఈ కాస్త ఊరటకే ఇంత సంబరమా?

కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో బీఆర్‌ఎస్‌ పార్టీ సంబరాలు చేసుకుంది. న్యాయస్థానం సాంకేతిక కారణాల రీత్యా తాత్కాలిక ఊరట కల్పించినంత మాత్రానికే దోషులు తెల్లారి లేచేసరికి నిర్దోషులైపోయినట్టు ఉత్సాహపడటం హాస్యాస్పదంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని ఎదురులేకుండా ఏలింది. ఆ పార్టీ నాయకుల అహంకార ధోరణికి ప్రజలు విసిగిపోయి, 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికలలో ఆ పార్టీకి ఎదురుతిరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఆ ఎన్నికల ప్రచార సభలలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సోనియాగాంధీ తదితరులు గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపైన దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఆ వాగ్దానానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై మాజీ న్యాయమూర్తి పీ.సీ.ఘోష్‌ దర్యాప్తు కమిషన్‌ను నియమించారు. విద్యుత్తు కొనుగోళ్లపైన మరో జ్యుడీషియల్ కమిషన్ వేశారు. ఈ–కార్ రేస్ పైన ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు. ఇప్పటికే ఈ కమిషన్ల దర్యాప్తు నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం కూడా పొందాయి. జస్టిస్ ఘోష్‌ నివేదికపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీబీఐకి బదిలీ చేసింది. దీంతో నివేదికలో నిందితులుగా పేర్కొనబడిన గత ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం తన ఉత్తర్వులలో జస్టిస్ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత ఉన్నదని తేల్చిచెప్పడం గమనించవలసిన విషయం.


తెలంగాణ పేరు మీద బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు నిరాటంకంగా చేసిన ఆర్థిక విధ్వంసం ఇంతా అంతా కాదు. ఇప్పటికీ.. తమ పదేళ్ల పరిపాలనలో జరిగిన తప్పొప్పులను సమీక్షించుకోవడంగానీ, అంతర్మథనం చెందడంగానీ లేదు. పైగా, తమను ఎన్నికలలో ఓడించటం ప్రజలు చేసిన తప్పు అన్నట్టు పైనుంచి కిందస్థాయి నాయకుల వరకు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇది వారి అహంభావానికి నిదర్శనం. ఏది ఏమైనా తెలంగాణ పౌర సమాజం జాగరూకతతో నిరంతరం నిశ్శబ్దంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు తన శక్తి సామర్థ్యాలను అనూహ్యంగా ప్రదర్శిస్తుంది. ఇది ఎన్నోసార్లు నిరూపితమైన సత్యం. న్యాయస్థానాలు సాంకేతిక కారణాల దృష్ట్యా తాత్కాలిక ఊరట కల్పించినంత మాత్రాన తమ అక్రమాలు సక్రమాలైపోతాయని అనుకుంటే అంతకన్నా తెలివిమాలిన ఆలోచన మరొకటి లేదు. ఎన్నికలలో గెలుపోటములకు అతీతంగా ప్రజాక్షేత్రం ఒకటి ఉంటుందని గుర్తుంచుకోవటం నాయకులకు మంచిది.

జూకంటి జగన్నాథం

ఈ వార్తలు కూడా చదవండి

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ

Updated Date - May 05 , 2026 | 12:51 AM