ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:42 AM
మన రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా పది వేల ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా మరో మూడు వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం మంచిదే.
మన రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా పది వేల ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా మరో మూడు వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం మంచిదే. అంతేగాక, ప్రస్తుతం లక్షకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తే నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి. నేడు దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఉన్నత విద్య అభ్యసించిన కోట్లాది మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వాలు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచుతుండటంతో నిరుద్యోగులకు ఉన్న అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగడంతో ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగి, ఉద్యోగ నియామకాలకు నిధుల కొరత ఏర్పడింది. అందువల్ల రిటైర్మెంట్ వయస్సును గతంలో ఉన్న 58 ఏళ్లకు తగ్గించి, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను ప్రోత్సహిస్తే కొత్త ఉద్యోగాలకు అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగం అనేది నిరుద్యోగులకు జీవన్మరణ సమస్య. కాబట్టి తాత్కాలిక ఉద్యోగాలుగానైనా, అవసరమైతే పాత స్కేల్ జీతాలతోనైనా నియామకాలు చేపట్టాలి.
– తిరుమలశెట్టి సాంబశివరావు