అణచివేత దాటి ఆత్మగౌరవం వైపు
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:27 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను మలుపుతిప్పిన సకలజనుల సమ్మెలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులే సంపూర్ణంగా సమ్మెలో పాల్గొని రాష్ట్ర ఏర్పాటు అనివార్యతను సృష్టించారు....
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను మలుపుతిప్పిన సకలజనుల సమ్మెలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులే సంపూర్ణంగా సమ్మెలో పాల్గొని రాష్ట్ర ఏర్పాటు అనివార్యతను సృష్టించారు. ఉద్యోగులు 42 రోజుల వేతనం కోల్పోయి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి దశాబ్ద కాలంలో ఒక ఫిక్స్‌డ్ ఇంక్రిమెంట్ మినహా ఒరిగిందేమీ లేదు. మొదటి పీఆర్సీ ఎరియర్స్ రిటైర్మెంట్ తర్వాత చెల్లింపులు, రెండో పీఆర్సీ, డీఏల పెండింగ్ సంస్కృతికి బీజం పడి, రెగ్యులర్ వేతనాలు సైతం గ్యారంటీ లేని తేదీలతో వంతుల వారీగా చెల్లింపులు, పైగా అడుగడుగునా అవమానాలు, వేధింపులు, అణచివేతలే ఉద్యోగులకు మిగిలాయి.
2001 జూన్ 22, జీవో 264 ప్రకారం ‘రోసా’ నిబంధనల మేరకు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల గుర్తింపును గత ప్రభుత్వం మే 31, 2016న జీవో 200 తీసుకొచ్చి జూన్ 2, 2014 నుంచి రద్దు చేసింది, ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను చంపేసింది. 317 జీవోతో ఉద్యోగుల కుటుంబాలు కకావికలమై ఛిద్రమైనవి. అన్ని డిపార్టుమెంట్‌లలో అరాచకం ఆరంభమైంది. ప్రశ్నించిన ఉద్యోగులను వేధించడం, సస్పెండ్ చేయడం సాధారణమైపోయింది. ఒక ఉద్యోగికి మూడు ప్రమోషన్లు తొక్కిపెట్టి, అర్హతలు లేకున్నా అనుయాయులను అందలం ఎక్కించడం, మరో ఉద్యోగికి తొమ్మిది ఇంక్రిమెంట్ల కోతలు లాంటి లెక్కలేనన్ని అణచివేత చర్యలు గత పాలనలో నిత్యకృత్యమైపోయాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అభయహస్తంతో దూసుకొచ్చింది, గంటల వ్యవధిలోనే కోట భద్రతకు నిర్మించుకున్న బారికేడ్లు బద్దలయ్యాయి, ఉద్యోగుల సంబరాల మధ్య సచివాలయం గేట్లు తెరుచుకున్నాయి. డిసెంబర్ 7, 2023 నుంచి ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘాల్లో గతకాలపు భజన నాయకత్వం మారింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం చొరవ తీసుకొని 2024 సెప్టెంబర్ 24న ఉద్యోగ సంఘాలను కమాండ్ కంట్రోల్ రూంకు ఆహ్వానించడంతో ఉద్యోగ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడింది. మొత్తం 64 డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచగా, ముప్పైమంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక్కొక్కరితో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చైర్మన్‌గా; మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ్యులుగా; కె.కేశవరావు సలహాదారుగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ నేతృత్వంలో ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బ్యాంకుల వద్ద చేసిన అప్పుల నెలవారీ వాయిదాలు సకాలంలో చెల్లించలేక సిబిల్ స్కోర్ పడిపోయి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ ప్రభుత్వం– రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ– పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ప్రతి నెల ఒకటవ తేదీనే చెల్లిస్తున్నది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు విడతల వారీగా చెల్లించటానికి హామీ లభించింది.
2025 జూలై 8న, జీవో 111 ద్వారా నూతన జిల్లాలకు క్యాడర్ స్ట్రెంత్ ఇచ్చింది. ఆగస్టు 21న, ఏసీబీ కేసులు సత్వరం పరిష్కరించుటకు 175 జీవో విడుదల చేసింది. 26న 1167 జీవో విడుదల చేసి మెడికల్ ఇన్‌వాలిడేషన్‌ను పునరుద్ధరించింది. సెప్టెంబర్ 9న జీవో 185 ద్వారా ఉద్యోగసంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను పునరుద్ధరించింది. 317 జీవోపై మంత్రులతో రివ్యూ కమిటీ ఏర్పాటుచేసి, కమిటీ సిఫార్సుల మేరకు నాలుగు జీవోలు ఇచ్చింది. జీవో 243 స్పౌస్, జీవో 244 మెడికల్, జీవో 245 పరస్పర బదిలీలు చేసి, స్థానికత ఆధారం కలిగినవారికి 190 జీవో జారీచేసి డిప్యుటేషన్ కల్పించింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న డిసిప్లీనరీ కేసుల సత్వర పరిష్కారానికి జీవో 83 ద్వారా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నష్టపోయిన నిరుద్యోగుల కోసం నూతన నియామకాల్లో వయోపరిమితిని పదేళ్లకు పెంచింది. ప్రమోషన్లకు ఆటంకంగా ఉన్న పదవీ విరమణ పొందిన ఉద్యోగుల నియామకాలను యూఓ నోట్ 506 ద్వారా రద్దుచేసి, రెగ్యులర్ డీపీసీలను రెగ్యులేట్ చేసింది. వివిధ డిపార్టుమెంట్లకు బదిలీ చేసిన వీఆర్ఓలను తిరిగి రెవెన్యూ శాఖకు తీసుకొచ్చింది. గత రెండున్నరేళ్లలో రెండుసార్లు సాధారణ బదిలీలు చేపట్టింది. మొదటి పీఆర్సీ పే ఫిక్సేషన్ పెండింగ్ అయిన ఉద్యోగుల కోసం మరో అవకాశం ఇస్తూ నోట్ 3347844/506–2025 జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీరాజ్ శాఖలోని ప్రమోషన్లను క్లియర్ చేసింది. 20 ఏళ్లుగా నానుతున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌లకు గెజిటెడ్ హోదా ఇస్తూ 79 జీవో జారీ చేసింది. రెండవ గ్రేడ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లకు మొదటి గ్రేడ్ హోదా కల్పిస్తూ జీవో 27 జారీచేసింది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేక గత ప్రభుత్వం ఎవరూ అడగకపోయినా పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచి తప్పించుకుంది. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అప్పులపాలైంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం నుంచి రిటైర్మెంట్లు ఆరంభమైనవి. రాష్ట్ర ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ బకాయిల విడుదలకు పూనుకుంది. మొదట్లో నెలకు వంద కోట్లు, అనంతరం నెలకు 250 కోట్లు, తర్వాత 750 కోట్ల చొప్పున ప్రస్తుతం నెలకు వెయ్యి కోట్లు బకాయిలు విడుదల చేస్తున్నది. వంద రోజుల్లో ఆరువేల కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం, ఆ గడువుకు చాలా ముందే తన మాట నిలబెట్టుకుంది.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నగదురహిత చికిత్స హెల్త్ కార్డులను 2026 జూన్ 6న, జీవో 40 ద్వారా ఇచ్చి, జూలై 17న, జీవో 50 ద్వారా ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటుచేసి ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సంకల్పించింది. జూలై 17న కార్డులు పంపిణీ చేసి అమలుకు శ్రీకారం చుట్టింది. అడగకుండానే ఉద్యోగులకు గరిష్ఠంగా కోటిన్నర రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని 16బ్యాంకులతో మాట్లాడి ఒప్పించి, ఒప్పందం చేసింది. ఇది రిటైర్డ్, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, అంగన్వాడీ వర్కర్లందరికీ వర్తింపజేయటం, ఉద్యోగులందరినీ ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగా భావిస్తోందనడానికి ఒక ఉదాహరణ. ఉద్యోగుల పనిభారం తగ్గించుటకు డెభ్బై నాలుగు వేల నూతన ఉద్యోగులను నియమించింది.
రెండున్నరేళ్లలో ఉద్యోగులకు ఎన్నో ఇచ్చిన ప్రభుత్వం, ఇంకనూ ఆరు డీఏలు, పీఆర్సీ ఇవ్వవలసి ఉంది. సీపీయస్ కింద పనిచేస్తున్న రెండు లక్షల అరవైవేల ఉద్యోగులను ఓపీయస్ పరిధిలోకి తేవలసి ఉంది. హక్కులకై నిలబడి బాధ్యతలు నిర్వహిస్తే రావలసినవి సాధించుకోవడం సమస్యే కాదు. ఉద్యోగికి వేతనం, డీఏలు, బిల్లులే కాదు, స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు, ఆత్మగౌరవాన్ని పెంపొందించే వాతావరణం ఉన్నందున అంకితభావంతో పనిచేసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుతున్నందుకు ఉద్యోగులందరూ గర్వపడుతున్నారు.
ఏలూరి శ్రీనివాసరావు
బి.శ్యామ్
మామిడి నారాయణ
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్
Also Read:
వర్షాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇంట్లో గులాబీ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి