మన ఓటుకు ఫారం–7 ముప్పు
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:52 AM
తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వెలుగు చూస్తున్న ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ‘సవరణ’ ముసుగులో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది.
తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వెలుగు చూస్తున్న ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ‘సవరణ’ ముసుగులో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ఓటర్ల జాబితాను సరిచేయడానికి, సవరించడానికి ఉద్దేశించిన ఫారాలు ప్రత్యర్థుల చేతిలో ఓటర్లను తొలగించే అస్త్రాలుగా మారడం విచారకరం. ఎవరైనా ఓటరు మరణించినా, వేరే ప్రాంతానికి మారినా లేదా నకిలీ ఓటరుగా ఉన్నా వారి పేరును జాబితా నుంచి తొలగించమని కోరడానికి ఫారం–7 ఉపయోగపడుతుంది. కానీ, ఇప్పుడు ఈ ఫారంనే ఒక రాజకీయ కుట్రకు ఉపయోగిస్తున్నారు. ముందస్తుగా పేర్లు, చిరునామాలు ముద్రించిన ఫారం–7 దరఖాస్తులను హైదరాబాద్‌లోని ముషీరాబాద్, బహదూర్‌పురా వంటి పలు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున దాఖలు చేయడం దీనికి నిదర్శనం. నిబంధనల ప్రకారం ఓటరు స్వయంగా సంతకం చేసి దరఖాస్తు ఇవ్వాలి. కానీ నియోజకవర్గాల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని లేదా ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని, వారి ప్రమేయం లేకుండానే ఫారం–7లను దాఖలు చేసి ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు.
కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం–6, విదేశాల్లో ఉండే భారతీయ పౌరుల కోసం ఉద్దేశించిన ఫారం–6Aలలో కూడా భారీ స్థాయిలో తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తేలింది. ఒక నిర్దిష్ట వర్గం ఓటర్లను, ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుల ఓట్లను డిలీట్ చేయడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ముందస్తు సమాచారం, విచారణ లేకుండా తీసివేయడం పౌరుడి ప్రాథమిక హక్కును హరించడమే. ఈ దారుణస్థితిపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు కొంత ఊరట. నోటీసు ఇవ్వకుండా లేదా బాధితుడికి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించకుండా ఓటును ఎలా తొలగిస్తారు? అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు.
అయితే, క్షేత్రస్థాయిలో చాలా మార్పులు రావలసి ఉంది. బీఎల్‌వో వ్యవస్థని, పర్యవేక్షణ అధికారులను పటిష్ఠం చేసుకోవాలి. ఫారం–6, 6A, 7 ఏది వచ్చినా, బూత్ లెవల్ ఆఫీసర్లు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి, నేరుగా మాట్లాడిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఒకే ఐపీ అడ్రస్, ఒకే వ్యక్తి ద్వారా బల్క్‌గా వచ్చే ఫారం–7 అప్లికేషన్లను ముందుగానే గుర్తించి, కుట్రదారులపై క్రిమినల్ విచారణ జరిపించాలి. సాంకేతిక కారణాల వల్ల లేదా కుట్రల వల్ల ఓటు కోల్పోయిన ఓటర్లు వెంటనే తిరిగి నమోదు అయ్యేందుకు సులువైన, వేగవంతమైన ప్రక్రియ అందుబాటులో ఉంచాలి. ప్రత్యర్థులను ఓడించేందుకు అడ్డదారిలో పౌరుల ఓట్లను తొలగించడమనే ఈ డిజిటల్, ఫారం కుట్రలను సమాజం నిరసించాలి. భారత రాజ్యాంగం కల్పించిన సార్వజనీన ఓటు హక్కు వర్ధిల్లాలి.
- ఎర్రోజు శ్రీనివాస్
తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్)