ఫీజు బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:32 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నానాటికీ బలహీనపడుతోంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ పథకం అమలులో ఎదురవుతున్న తీవ్రమైన లోపాలు, నిధుల విడుదల ఆలస్యం, పరిపాలనాపరమైన వైఫల్యాలు...
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నానాటికీ బలహీనపడుతోంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ పథకం అమలులో ఎదురవుతున్న తీవ్రమైన లోపాలు, నిధుల విడుదల ఆలస్యం, పరిపాలనాపరమైన వైఫల్యాలు తెలంగాణ విద్యార్థి లోకాన్ని, విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు తొమ్మిది నుంచి పదివేల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. కోర్సు పూర్తయినా డిగ్రీ, బీటెక్ ఒరిజినల్ మార్కుల మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కళాశాలలు నిరాకరిస్తున్నాయి. పరీక్షల సమయంలో ఫీజు బకాయిలు ఉన్నాయనే నెపంతో హాల్‌టికెట్లు ఆపడం లేదా అండర్‌టేకింగ్ బాండ్లు రాయించుకోవడం వంటి చర్యలకు దిగుతున్నాయి. కోర్సు పూర్తయి రెండేళ్లయినా డిగ్రీ సర్టిఫికెట్ చేతికి రాక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని, ప్రభుత్వ బకాయిలకు మమ్మల్ని బలిపశువులను చేయడం ఎంతవరకు సమంజసమని బాధిత విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఐసెట్, గేట్, పీజీఈసెట్ ద్వారా ఉన్నత కోర్సుల్లో సీట్లు వచ్చినా, ఒరిజినల్ సర్టిఫికెట్లు లేక విద్యార్థులు కౌన్సెలింగ్‌కు దూరమవుతున్నారు. విదేశాల్లో పై చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థుల వీసా, అడ్మిషన్ ప్రక్రియలు కూడా సర్టిఫికెట్లు లేక నిలిచిపోతున్నాయి. పరీక్షలు రాయడానికి, సర్టిఫికెట్లు పొందడానికి ఫీజు మొత్తం చెల్లించాల్సిందేనని కళాశాలలు పట్టుబట్టడంతో, పేద తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. కాలేజీ ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేసే ప్రమాదం పెరిగింది.
ఈ సంక్షోభం కేవలం విద్యార్థులకే పరిమితం కాకుండా విద్యా వ్యవస్థ మొత్తాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు అధ్యాపకులకు, సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. ఫలితంగా ప్రతిభావంతులైన అధ్యాపకులు, సిబ్బంది విద్యా రంగాన్ని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మొగ్గుచూపుతున్నారు. ల్యాబ్‌లు, లైబ్రరీలు, మౌలిక వసతుల నిర్వహణకు నిధులు లేకపోవడంతో బోధనా నాణ్యత పతనమవుతోంది. విద్యా ప్రమాణాలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతున్నాయి. ఆర్థిక భారాన్ని తట్టుకోలేక రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్, డిగ్రీ, ఫార్మసీ కళాశాలలు మూతపడే దిశగా పయనిస్తున్నాయి.
ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రతి నెలా లేదా సెమిస్టర్ వారీగా నిర్ణీత క్యాలెండర్ ప్రకారం బకాయి నిధులను విడుదల చేయాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే క్రెడిట్ చేసే విధానాన్ని ఎటువంటి సాంకేతిక, పరిపాలనా జాప్యం లేకుండా పక్కాగా అమలు చేయాలి. ప్రభుత్వ బకాయిల కారణంతో ఏ కళాశాల కూడా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయకుండా విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలి. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై విద్యార్థులు సులభంగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ పోర్టల్‌ను బలోపేతం చేయాలి.
జీవన్
(ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు)
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..