Share News

గురువులకు కూడా పరీక్షలు అవసరమే!

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:44 AM

ఉపాధ్యాయుల నైపుణ్యాలు నిరంతరం నవీకరించబడితేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యను మరింత సమగ్రంగా, నాణ్యంగా తీర్చిదిద్దేందుకు విద్యా కమిషన్ చేసిన సూచనలు...

గురువులకు కూడా పరీక్షలు అవసరమే!

ఉపాధ్యాయుల నైపుణ్యాలు నిరంతరం నవీకరించబడితేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యను మరింత సమగ్రంగా, నాణ్యంగా తీర్చిదిద్దేందుకు విద్యా కమిషన్ చేసిన సూచనలు సమయోచితమైనవి. ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లకు ప్రతి ఐదేళ్లకోసారి అర్హత పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదన విద్యా ప్రమాణాల పెంపునకు దోహదపడే చర్య. ప్రస్తుతం విద్యార్థుల అవసరాలు విభిన్నంగా మారుతున్నాయి. పాఠ్యాంశాలు మారుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ విద్య, ఆన్‌లైన్ లెర్నింగ్, నైపుణ్యాధారిత విద్య వంటి అంశాలు విద్యా రంగంలో కీలకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరుకోవడం ముఖ్యం.

ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, మూల్యాంకన విధానాలు అమలులో ఉన్నాయి. మన దేశంలో కూడా అలాంటి విధానాలు బలోపేతం చేయాలి. ఈ ప్రతిపాదనపై కొన్ని వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నా, దీని ప్రధాన లక్ష్యం ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం కాదు, విద్యా నాణ్యతను పెంచడమే. ఉద్యోగంలో చేరాక కూడా ఉపాధ్యాయులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి రావటం విద్యా వ్యవస్థకు మేలు చేస్తుంది. దీనివల్ల ఉపాధ్యాయులకు బాధ్యత పెరిగి విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బీఈడీ అర్హతను తప్పనిసరి చేసింది. అలాగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఉత్తీర్ణత సాధించాల్సిన నిబంధనను అమలు చేస్తోంది. చిన్నపిల్లలకు బోధించే ఉపాధ్యాయులకే ఇంత కఠిన ప్రమాణాలు అమలు చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించే జూనియర్ లెక్చరర్లకు నిర్దిష్ట వ్యవధిలో అర్హత పరీక్షలు నిర్వహించడం సముచితం.

భవిష్యత్తులో జూనియర్ లెక్చరర్ పోస్టులకు అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలన్న కమిషన్ సూచన కూడా సమంజసమే. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంగ్లిష్ మాధ్యమంలో పీజీ పూర్తి చేయాలి. అదనంగా బీఈడీ అర్హత ఉండాలి. డిగ్రీ, పీజీ, బీఈడీ కోర్సుల్లో కనీసం 60శాతం మార్కులు ఉండాలన్న ప్రతిపాదన విద్యా ప్రమాణాలను పెంచే ప్రయత్నమే. అలాగే అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేయడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

జంపాల ప్రవీణ్

ఇవి కూడా చదవండి..

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 17 , 2026 | 01:44 AM