Share News

‘విద్యా హక్కు’ ఇకనైనా అమలవుతుందా?

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:04 AM

‘విద్యా హక్కు’ ఇకనైనా సుప్రీంకోర్టు ఇటీవల ఒక చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ‘ఒక ఆటో డ్రైవర్ లేదా వీధి వ్యాపారి బిడ్డ, ధనవంతుల బిడ్డతో కలిసి పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చోవడం అనేది సహజమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియగా మారాలి.

‘విద్యా హక్కు’ ఇకనైనా అమలవుతుందా?

‘విద్యా హక్కు’ ఇకనైనా సుప్రీంకోర్టు ఇటీవల ఒక చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ‘ఒక ఆటో డ్రైవర్ లేదా వీధి వ్యాపారి బిడ్డ, ధనవంతుల బిడ్డతో కలిసి పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చోవడం అనేది సహజమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియగా మారాలి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. ఆర్టికల్ 21ఏ, 39(ఎఫ్‌) కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కు’ అని కోర్టు పేర్కొంది. కులం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే ‘అనుమానాస్పద గుర్తింపులను’ పక్కన పెట్టి, విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది.

ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ఒకటవ తరగతిలో కనీసం 25శాతం సీట్లు ఉచిత విద్య కోసం సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు తప్పనిసరిగా కేటాయించాలి. విద్యాహక్కు చట్టం అమలుచేయని రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, ఈ తీర్పును గంభీర హెచ్చరికగా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన ముఖ్యమైన చట్టాల్లో విద్యా హక్కు చట్టం ఒకటి. ఇది అమలులోకి వచ్చి పదిహేనేళ్లు గడిచినా, తెలంగాణలో ఆ చట్టం అమలుకు గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ చట్టం ఊసే ఎత్తకపోవడం విచారకరం. ఏడాదికేడాది ప్రభుత్వాలు తమ చట్టబద్ధ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

యూడీఐఎస్‌ఈ 2024–25 గణాంకాల ప్రకారం, తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల వరకు చదువుతున్న పిల్లల సంఖ్య సుమారు 62 లక్షలు. దాదాపు 59.5 శాతం మంది పిల్లలు ప్రైవేటులో చదువుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రైవేటు బడుల్లో 30 లక్షల మంది విద్యార్థులు ఉంటే, ఇప్పుడది దాదాపు 37 లక్షలకు చేరింది. మరి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రకటించే విప్లవాత్మక మార్పులు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదు. ఇదే విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులలో మొత్తం 30.48 లక్షల విద్యార్థులు నమోదు అయితే, అందులో 20.66 లక్షల విద్యార్థులు ప్రైవేటు బడుల్లో చేరారు. ఒకటవ తరగతిలో 6.62 లక్షల మంది చేరితే, 4.79 లక్షల విద్యార్థులు (72.4 శాతం) ప్రైవేటు బడుల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం ఎంతగా క్షీణించిందో ఈ గణాంకాలే సాక్ష్యం.


దేశం మొత్తంలో 7,993 పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ ఉంటే మన రాష్ట్రంలోనే 2,245 (28శాతం) జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలు ఉన్నాయి. గ్రామాల్లో బడుల నిర్వహణ, వసతులు లేని కారణంగా విద్యార్థులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో 5,001 సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 68 వేల మంది విద్యార్థులు నమోదయ్యారు. అంటే నాణ్యమైన విద్యను ఆశించే తల్లిదండ్రులు ఈ పాఠశాలల మీద నమ్మకం కోల్పోతున్నారు. ఒకసారి పాఠశాల మూసుకుపోతే, ఆ గ్రామంలో ప్రభుత్వ విద్యను పునరుద్ధరించటం చాలా కష్టం. పరిపాలనా స్థాయిలో కూడా పరిస్థితి బలహీనంగానే ఉంది. 630 మండల విద్యాశాఖాధికారుల్లో కేవలం 14 మంది మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. కేవలం ముగ్గురు జిల్లా విద్యాధికారులే పూర్తి బాధ్యతలతో ఉన్నారు. దీని ప్రభావం పర్యవేక్షణ, నాణ్యత, బాధ్యత అన్నింటిపైనా పడుతోంది.

విద్యకు కేటాయించే బడ్జెట్ విషయంలో తెలంగాణ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. 2014–15లో 10.89శాతంగా ఉన్న విద్యా బడ్జెట్, 2024–25 నాటికి 7.5శాతానికి పడిపోయింది. ఇది కొఠారి కమిషన్ సూచించిన 20శాతం, జాతీయ సగటు 15శాతంతో పోలిస్తే చాలా తక్కువ. బడ్జెట్ తగ్గిన కొద్దీ, మౌలిక వసతులు, ఉపాధ్యాయ నియామకాలు, విద్యా నాణ్యత అన్నీ ప్రభావితమవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఎస్‌ 80వ సర్వే ప్రకారం, ఒక విద్యార్థిపై సగటు వార్షిక ఖర్చు రూ.50,000కు చేరుతోంది. తెలంగాణలో దాదాపు 37 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని భావిస్తే, తల్లిదండ్రులు ఏటా సుమారు రూ.18,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారంగా మారింది. ఇక ఇంటర్ విద్యను కలిపితే ఈ ఖర్చు ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిపాదన చేసింది. ఇవి కేవలం 2,68,800 విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడతాయి.

తెలంగాణలో ప్రజా విద్యను పునరుజ్జీవింప చేయాలంటే 2026–27 సంవత్సరానికి విద్యకు కనీసం 20శాతం బడ్జెట్ కేటాయించాలి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నమోదు అయిన పాఠశాలలను గుర్తించి సిబ్బంది కొరత లేకుండా వాటికి అన్ని వసతులు కల్పించాలి. విద్యా హక్కు చట్టాన్ని జిల్లాల వారీగా కఠినంగా అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సెక్షన్ 12(1)(c)ను వెంటనే అమలుచేయాలి. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి. బాలలందరికీ సమాన విద్య అందించాలంటే ఎక్కువ ప్రభుత్వ వనరులు, మెరుగైన ఉపాధ్యాయులపై అధిక శ్రద్ధ పెట్టాలి.

సంక్షేమ పథకాలతో అసమానతలను అంతం చేయడం కష్టం. ప్రభుత్వ నిధులతో కూడిన సమాన, సార్వత్రిక విద్య మాత్రమే సమాజంలో కృత్రిమంగా సృష్టించబడిన సామాజిక అసమానతలను కూల్చివేస్తుంది. ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసినప్పుడు లేదా ప్రైవేటీకరించినప్పుడు, అసమానతలు కొత్త రూపాల్లో ఏర్పడతాయి. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని తమ తీర్పులో పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఆర్.వెంకటరెడ్డి

Updated Date - Feb 14 , 2026 | 01:04 AM