Share News

‘ఆకునూరి’ సిఫార్సులపై అలకెందుకు?

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:48 AM

తెలంగాణ విద్యా కమిషన్ ఫిబ్రవరి 26న సమర్పించిన సిఫార్సుల రిపోర్టును వివిధ రంగాలకు చెందినవారు విభిన్న కోణాలలో చూస్తున్నారు. భవిష్యత్తులో టీచర్ల వేతన స్థిరీకరణ పరిశీలన చేయాలని కమిషన్ చేసిన ఒక సిఫార్సుపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి.

‘ఆకునూరి’ సిఫార్సులపై అలకెందుకు?

తెలంగాణ విద్యా కమిషన్ ఫిబ్రవరి 26న సమర్పించిన సిఫార్సుల రిపోర్టును వివిధ రంగాలకు చెందినవారు విభిన్న కోణాలలో చూస్తున్నారు. భవిష్యత్తులో టీచర్ల వేతన స్థిరీకరణ పరిశీలన చేయాలని కమిషన్ చేసిన ఒక సిఫార్సుపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. రాజకీయ పార్టీలైతే కమిషన్ చైర్మన్, దానిలోని సభ్యుల అర్హతలు, ఉనికినే ప్రశ్నించాయి. దీంతో అసలు విషయం పక్కకుపోయి రిపోర్టునే ఒక వివాదాస్పదం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున విద్యావిధాన చైర్మన్ కేశవరావు స్వయంగా వివరణ ఇచ్చినా, ఉపాధ్యాయుల్లో అలజడి పోలేదు. కమిషన్ మాత్రం తన రిపోర్టు అత్యంత శాస్త్రీయమని, అందుకు తాము పరిశీలించిన అంశాలు, సేకరించిన వివరాలు కచ్చితమైనవని, వాటిని ఎవరైనా తనిఖీ చేసుకోవచ్చునని చెబుతున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్ల పాఠశాలను మోడల్‌గా చూపుతూ... తమ సిఫార్సులు అమలుకు ఆచరణ సాధ్యమైనవని, అందుకు అవసరమైన ఆర్థిక వనరుల లెక్క కూడా చెప్పారు.

విద్యా కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించే వారిలో ఒక సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉండటం యాదృచ్ఛికమైనా, వారిలో కొందరు ఏకంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని దూషిస్తూ తమ సామాజిక దురహంకారాన్ని ప్రదర్శించటం గర్హనీయం. దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మాణమవుతుందని, విద్యను సార్వజనీనకం చేయాలన్న కొఠారి కమిషన్ రిపోర్టు(1966)ను ఆనాడు విద్యాధికులైన బ్రాహ్మణ సామాజికవర్గం తప్పు పట్టలేదు. సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో విద్య లాభాలు ఆర్జించే ‘సరుకు’గా మారి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు, విద్యార్థుల నమోదు గణనీయంగా పడిపోయి పేదవారికి నాణ్యమైన విద్య అందని ద్రాక్ష అవుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలానుగుణంగా విద్యావిధానాన్ని ఆధునికీకరించి బోధనను అప్డేట్ చేయడానికి, ప్రైవేటు విద్యకు ఒక ప్రత్యామ్నాయం కోసం చేస్తున్న ప్రయత్నంపై విషం చిమ్ముతున్న వారు, ఇతర ప్రత్యామ్నాయ విధానాలను మాత్రం చూపరు.


విద్యా కమిషన్ సిఫార్సుల అమలు ఫలితాలు కాలం నిర్ణయించినా, కమిషన్ లేవనెత్తిన లేదా గుర్తించిన అంశాలను వ్యతిరేకిస్తున్న వారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం సిఫార్సును వ్యతిరేకిస్తూ... తాము తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదిగామని చెబుతున్న వారు తమ పిల్లలను ఏ స్కూల్లో ఏ మీడియంలో చదివించారో, చదివిస్తున్నారో చెప్పగలరా? కమిషన్ పేర్కొన్న ప్రైవేటు స్కూళ్ళ టీచర్ల కంటే ప్రభుత్వ స్కూళ్ల టీచర్ల వేతనాలు ఎక్కువ అన్న విషయం అబద్ధమని ఎవరైనా రుజువు చేయగలరా? ప్రభుత్వ టీచర్లు ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షల్లో నెగ్గారని వాదించే టీచర్ల సంఘాలు, తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపడంలో మర్మమేమిటి?

రెండంకెల టీచర్లు ఉన్న స్కూళ్లలో రెండంకెల విద్యార్థుల సంఖ్య దాటని స్కూళ్ల కొనసాగింపు మంచిదికాదన్న సిఫార్సును వ్యతిరేకించే టీచర్ల సంఘాల నేతలు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి, అలాగే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి వారి విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తికి, వాస్తవ నిష్పత్తి వ్యత్యాసానికి వీరిచ్చే సమర్థనకు ప్రాతిపదిక ఏమిటి? విద్యార్థుల లభ్యత ఉండి ప్రభుత్వ స్కూళ్లకు పంపకుండా, నైపుణ్యం, సమర్థవంతమైన బోధన లేని ప్రైవేటు స్కూళ్లకు తల్లిదండ్రులు ఎందుకు పంపుతున్నారో ఏ టీచర్ల సంఘమైనా ఒక సమగ్రమైన సర్వే చేసిందా? ‘కుల’ గురుకులాలు– కులాల మధ్యన అదృశ్యపు అడ్డుగోడలను బలోపేతం చేస్తున్నా, అవి విద్యార్థి ‘కౌమారదశ’లో పెరిగే మానసిక విచక్షణ ఆలోచనల ఎదుగుదలకు, పరిధికి అవరోధాలనే వాస్తవ విషయంపై మాట్లాడకపోవడం బాధ్యతారాహిత్యం కాదా? లేక కుల సంఘాల ముసుగులో ఉపాధి ఉద్యమాలు చేస్తున్న వారంటే భయమా? టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లను అమ్ముకున్న ఉపాధ్యాయులు కూడా, మురళి సిఫార్సులు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయనడం విడ్డూరం.


విద్యా కమిషన్ 18 నెలల కాలంలో ఏసీ రూముల్లో కూర్చుని నివేదిక రాయలేదు. మూడు దేశాలు, నాలుగు రాష్ట్రాలను, అంగన్వాడీ మొదలు ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల వరకు 305 విద్యా సంస్థలను ప్రత్యక్షంగా పరిశీలించింది. ప్రభుత్వంలోనే 29 రకాల యాజమాన్య విద్యా సంస్థలున్నాయని, ప్రైమరీ స్కూళ్ళలో 35, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో 120 మంది సగటు విద్యార్థులున్నారని, గత మూడేళ్లలో 1,920 స్కూళ్ళలో జీరో నమోదు, ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్ళలో కేవలం 26శాతం, ప్రైవేటు స్కూళ్ళలో 74శాతం నమోదు కావడం పట్ల విద్యా కమిషన్ ఆందోళన చెందడంలో అర్థమున్నది. క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలన చేసిన తర్వాత ఈ కమిషన్‌ ఇచ్చిన 434 సిఫార్సులను అమలు చేయాలి. అయినా తత్వం బోధపడితే గాని జ్ఞానోదయం కాదన్నట్లు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో పటిష్ఠమైన ప్రైవేటు స్కూళ్ళను రద్దు చేయాలని వ్యాసాలు రాసిన మురళి, ఇక్కడ ఫీజుల నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు సూచనతో సరిపెట్టారు. టీచర్ల జ్ఞానాన్ని గరిష్ఠంగా విద్యార్థికి చేరడానికి, తల్లిదండ్రులను, గ్రామాలను భాగస్వామ్యం చేయడం, కుటుంబ వ్యవస్థలో విద్యార్థి భాగస్వామియై తన తల్లిదండ్రులు ఎంత కష్టం చేస్తున్నారో తెలుసుకోడానికి సెలవుల్లో ఇంటి పనుల్లో చేదోడు కావడానికి చేసిన సూచనలు సామాజిక ఆత్మీయ కుటుంబబంధాల పటిష్ఠతకు దోహదం చేస్తాయి. తెలంగాణలో విద్యారంగంలో ఇప్పటికే అనేక ప్రయోగాలు జరిగాయి. పీవీ నరసింహారావు విద్యాశాఖ మంత్రిగా దేశంలోనే తొలి గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని తలచి, ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లా సర్వేల్‌లో 1971లో దానిని ఏర్పాటుచేశాక, అది నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు మార్గదర్శకమైంది.


ఎన్నో సిఫార్సులు చేసిన కమిషన్.. ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు భరోసానిచ్చే ఒక్క సిఫార్సు కూడా చేయకపోవడంతో స్పష్టమైన వెలితి కనబడుతోంది. ౧2వ తరగతి వరకు కచ్చితంగా ఎనిమిదేళ్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు వృత్తివిద్యా కోర్సుల్లో 50 శాతం సీట్లు, డిగ్రీ వరకు కనీసం పదేళ్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారికి 50శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే చట్టం తీసుకురావాలి. అప్పుడు మురళి సిఫార్సుల అమలుకు ఆటంకాలు ఏర్పడినా, అమలులో వైఫల్యం చెందినా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తగ్గుతారనే భయం ఉండదు. రేషనలైజేషన్‌లో తమ పోస్టులు తగ్గిపోతాయనే భయం టీచర్లకూ ఉండదు. ఇక టీచర్ల జీతాలు తగ్గించే సాహసం ఏ ప్రభుత్వం చేయదు. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళ మధ్య ఆరోగ్యవంతమైన పోటీతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేయాలి.

-మామిడి నారాయణ

సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్

Updated Date - Mar 21 , 2026 | 03:52 AM