రసాయన రియాక్టర్లుగా డంప్‌యార్డులు!
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:03 AM
స్వచ్ఛత అంటే చెత్తను కనిపించకుండా చేయడమేనా? లేక పర్యావరణానికి హాని కలగకుండా దాన్ని నిర్వహించడమా? భారత పట్టణాల వ్యర్థాల నిర్వహణ తీరును పరిశీలిస్తే మొదటి పద్ధతే పాటిస్తున్నారని అర్థమవుతోంది.
స్వచ్ఛత అంటే చెత్తను కనిపించకుండా చేయడమేనా? లేక పర్యావరణానికి హాని కలగకుండా దాన్ని నిర్వహించడమా? భారత పట్టణాల వ్యర్థాల నిర్వహణ తీరును పరిశీలిస్తే మొదటి పద్ధతే పాటిస్తున్నారని అర్థమవుతోంది. ప్రతి ఉదయం మున్సిపల్ వాహనాలు వీధుల్లో చెత్తను సేకరిస్తాయి. ప్రజలు శుభ్రమైన రోడ్లను చూస్తారు. పాలకులు పరిశుభ్రత విజయాలను ప్రచారం చేసుకుంటారు. కానీ నగర శివార్లలో పడేసిన అదే చెత్త కొద్ది రోజుల్లో విషవాయువులు వెదజల్లే, భూగర్భ జలాలను కలుషితం చేసే, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే రసాయన రియాక్టరుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఈ వాస్తవం ప్రజా చర్చల్లో ఎక్కడా చోటు దక్కించుకోదు.
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో అధిక భాగం సేంద్రియమే. అవి పశువులకు మేతగా, పొలాలకు ఎరువుగా, ప్రకృతిలో మళ్లీ కలిసిపోయే వనరులుగా ఉపయోగపడేవి. కానీ పట్టణ జీవనశైలి వ్యర్థాల స్వరూపాన్నే మార్చేసింది. ప్లాస్టిక్ సంచులు, ప్యాకేజింగ్ పదార్థాలు, వైద్య వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీలు, రసాయనాలు, నిర్మాణ వ్యర్థాలు, ఆహార అవశేషాలు అన్నీ ఒకే ట్రక్కులో చేరి, చివరకు ఒకే డంప్‌యార్డులో పడుతున్నాయి. అక్కడి నుంచి ప్రారంభమయ్యే రసాయన, జీవరసాయన చర్యలు సంవత్సరాల తరబడి కొనసాగుతుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు శాస్త్రీయ నిర్వహణ లేని డంప్‌యార్డుల్లాంటి స్థలాలను ‘స్లో కెమికల్ రియాక్టర్లు’గా అభివర్ణిస్తున్నారు.
డంప్‌యార్డు అనేది కేవలం చెత్త గుట్ట కాదు. అది నిరంతరం పనిచేసే జీవ, రసాయన ప్రయోగశాల. సేంద్రియ వ్యర్థాలు ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో కుళ్లిపోవడంతో మీథేన్ వాయువు విడుదలవుతుంది. ఈ వాయువు కార్బన్ డై ఆక్సైడ్ కంటే అనేక రెట్లు ఎక్కువగా భూతాపాన్ని పెంచుతుంది. చెత్త గుట్టల్లో తరచూ చెలరేగే మంటలకు ఇదే కారణం. ఆ మంటల నుంచి విడుదలయ్యే డయాక్సిన్లు, ఫ్యూరాన్లు, సూక్ష్మ ధూళికణాలు ఊపిరితిత్తుల వ్యాధులకు, గుండె సమస్యలకు, క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వర్షాకాలంలో చెత్తలోంచి కారే లీచేట్ భూగర్భ జలాలను విషపూరితం చేస్తుంది. దశాబ్దాల పాటు ఆ ప్రభావం కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ప్రతి ఏటా పట్టణ ఘన వ్యర్థాల పరిమాణం పెరుగుతూనే ఉంది. కానీ దానికి అనుగుణంగా శాస్త్రీయ ప్రాసెసింగ్ కేంద్రాలు, రీసైక్లింగ్ వ్యవస్థలు, కంపోస్టింగ్ యూనిట్లు, వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు పెరగడం లేదు. ఫలితంగా ప్రతి నగరం తన శివార్లలో ఒక కొత్త పర్యావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది.
తెలంగాణ పరిస్థితి దీనికి మినహాయింపు కాదు. హైదరాబాద్‌లో ఇంటింటికీ చెత్త సేకరణ, యాంత్రిక శుభ్రత వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపించినా, నగరం రోజూ ఉత్పత్తి చేస్తున్న వేల టన్నుల వ్యర్థాలను పూర్తిగా శాస్త్రీయంగా నిర్వహించడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. వరంగల్‌లోని రాంపూర్ డంప్ యార్డు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అనేక నగరాలు స్వచ్ఛత ర్యాంకుల్లో పోటీ పడుతున్నాయి. అయితే ఆ ర్యాంకుల్లో నగర వీధుల పరిశుభ్రతకు ఇచ్చిన ప్రాధాన్యం, డంప్‌యార్డుల శాస్త్రీయ నిర్వహణకు కూడా సమానంగా లభించిందా? అనే ప్రశ్నకు సమాధానం అంత సంతృప్తికరంగా లేదు. వీధుల్లో కనిపించని చెత్త, పట్టణ శివార్లలో కనిపించే పర్యావరణ విపత్తుగా మారితే దాన్ని అభివృద్ధి అనలేం.
వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రంగా పాత తప్పులను పునరావృతం చేయకుండా కొత్త నమూనాను అవలంబించే అవకాశం తెలంగాణకు ఉంది. ఇక్కడి నగరాల్లో భవిష్యత్తు వ్యర్థాల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. ఇప్పటికే పేరుకుపోయిన చెత్త గుట్టలను బయోమైనింగ్ ద్వారా వేగంగా తొలగించాలి. మీథేన్‌ను వృథా కాకుండా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలి. లీచేట్ శుద్ధి కేంద్రాలు, భూగర్భ జలాల నాణ్యత పర్యవేక్షణ, ఆధునిక రీసైక్లింగ్ వ్యవస్థలు ప్రతి నగరంలో తప్పనిసరి కావాలి.
పౌరుల బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. ఇంటి వద్దే చెత్తను వేరు చేయడం, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, స్థానిక సంస్థలతో సహకరించడం ప్రతి కుటుంబం అలవాటు చేసుకోవాలి. ప్రతి నగరం తన చెత్తను తానే బాధ్యతగా నిర్వహించగలిగినప్పుడే నిజమైన పరిశుభ్రత సాధ్యమవుతుంది. లేకపోతే మనం నిర్మిస్తున్నవి డంప్‌యార్డులు కాదు... భవిష్యత్ తరాలకు విషాన్ని తయారు చేసే భారీ రసాయన రియాక్టర్లే.
- బత్తుల సత్యనారాయణ