పెయ్యిడ్వని రంది
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:58 AM
నడిపించీ నడిపించీ తొవ్వజూపినోడే నడి అడివిల కాటగల్పినట్టు, మాట కల్పినట్టే కల్పి, బాట మల్పినట్టు, పరాష్కమాడుతుంటది బత్కు....
నడిపించీ నడిపించీ
తొవ్వజూపినోడే నడి అడివిల కాటగల్పినట్టు,
మాట కల్పినట్టే కల్పి, బాట మల్పినట్టు,
పరాష్కమాడుతుంటది బత్కు....
జీవిడిసె దాకా పెయ్యిడ్వనంటది రంది,
గావరైతున్నట్టు ఎట్లెరుకైతదో
మూడు తొవ్వల కాడ ఎత్తిపొయ్యిమంటరు మంది.
ఎవలిమాటా ఇనేదానికి లేదు,
ఎటురోకూ పొయ్యేదెట్లో తెల్వదు,
వడగండ్ల వానకోర్వలేక కూలి నడిమిట్ల ఇరిగిన ఇంటి
మొగురం తీరున్నది మనసు,
కుమ్మరావి పూడ్చలేని తూటువడ్డ పటువలోలె
కండ్లున్నయి...
ఊగులాడుతున్న ఊపిరితాడుకు మొదలెట్లుండెనో
ఎరుక లేదు కానీ,
కానొస్తలేదు కొసదాంకా కంటికాల్వపొంటి గెట్టు,
కాలానిదేముంది కసాయిదనుకుని సరిపెట్టుకుందు,
కానోళ్లదేముంది కటినాత్ములనుకుంటు ఊకుందు,
ఎనకెనకే నక్కి ఎన్నురుచి మర్గినోళ్లను,
ఏమందునుల్లా....? ఏమ్జేద్దునుల్లా....?
బైలువెట్టిన పిల్లగాని నెత్తి సుట్టూ,
పిడికిట్ల దొడ్డుప్పు మూడుసుట్లు తిప్పి,
నిప్పుల్ల గాల్చిన అవ్వ చెయ్యసొంటి చెయ్యి,
పొద్దుమాపు యాదికొస్తున్నది,
నెమలీకల కట్టతో నెత్తిని నిమిరి, ఈపుల సర్శి,
ఊద్దాన్ పొగను పెయ్యంతావట్టిచ్చి,
రందివడ్డ మనసుకు తాయత్తు కట్టే దాదా ఇకమతు
జాముకోపారి కండ్లల్ల మెదులుతున్నది...
ఇదిప్పుడప్పుడే ఒడవని దుక్కం...
పేయంతా పరిక్కంపలు గుచ్చుకున్న సలపరం,
తూరుపు కొమ్మమీంచి ఎగిరిన ఎల్తురు పిట్ట,
ఏ దినమూ పాక మీద వాలది,
బత్కుమీద పరుస్కున్న నల్లమబ్బుల సాటుంగ
పడమటి దుగూట్ల కాటగలిశే నియ్యతి మర్షిన చీకటి గువ్వ...
దారువట్టిన కత్తితోని కాలం నా ముంగట నిలవడ్డది,
బోనాల పండుక్కి జడ్తియ్యని మ్యాకపిల్లను నేను.
- జాబేర్ పాషా
95730 43596