Share News

ఓపీ‘ఎస్’ అంటే ఆర్థిక అత్యయిక పరిస్థితే!

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:59 AM

పెండింగ్ బకాయిలను చెల్లించాలని, వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలలో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఓపీ‘ఎస్’ అంటే ఆర్థిక అత్యయిక పరిస్థితే!

పెండింగ్ బకాయిలను చెల్లించాలని, వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలలో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. సమాజంలో మిగిలిన శ్రామికుల్లాగే ప్రభుత్వోద్యోగులకు కూడా హక్కులున్నాయి. కాబట్టి శాంతియుతంగా, పరిపాలనకు ఆటంకం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా వారు తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేపట్టవచ్చు. కానీ ప్రస్తుత నేపథ్యం అసాధారణమైనది. నేను వాస్తవాల ఆధారంగా చెబుతున్నాను. పరిష్కారాలతో వినమ్రంగా అర్థిస్తున్నాను. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ప్రభుత్వోద్యోగులు, ప్రజలు వీటిని నిశితంగా పరిశీలించి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవలసిందిగా కోరుతున్నాను.

పరిపాలన ఉన్నది– ప్రభుత్వంలోని అధికారులు, ఉద్యోగులు, నేతల కోసం కాదు. పన్నులు కట్టే సామాన్య ప్రజల కోసం. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు తినే లేదా ఉపయోగించే ప్రతి వస్తువు మీదా కట్టే పన్నులు సైతం ఖజానాకు వెళ్తున్నాయి. ఈ డబ్బుతో పాటు ఆ ప్రజల పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టి నేటి అవసరాల కోసం ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. రేపటి రోజున వారి పిల్లలే ఈ అప్పులను పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రెండోది– ప్రభుత్వోద్యోగులు జీతభత్యాలు కోరటంలో తప్పులేదు. మరి అంతే గట్టిగా ప్రజలకు సేవలూ అందించాలిగా? ఈ దేశంలో ఏ రంగంలో చూసినా కొరతలే. హైదరాబాద్‌నే తీసుకుంటే... మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, వర్షం వస్తే వరదనీరు ముంచెత్తకుండా ఏర్పాట్లు, ట్రాఫిక్, చట్టబద్ధపాలన దగ్గర్నుంచి స్కూళ్లలో మన పిల్లలకు అందించే విద్య వరకు ఖర్చు కనిపిస్తోంది గానీ, ఫలితాలనివ్వటం లేదు. ఆ ఫలితాలను ఇవ్వాల్సింది ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగులే కదా!


ఇదేదో ముఖ్యమంత్రి, ఉద్యోగుల మధ్య సమస్య అనుకుంటున్నారు గానీ.. సమాజం సమస్య అని గుర్తించటం లేదు. అందుకే పాఠశాల విద్య ఇంత దిగజారినా, విద్యాప్రమాణాలు అధ్వానంగా ఉన్నా సరైన చర్చ చేయటం లేదు. సామాన్య ప్రజలు, పన్నులు కట్టే మిగిలినవారు ఏం పాపం చేశారు? వాళ్ల పిల్లలకు ఎందుకు చదువు అందటం లేదు? ప్రభుత్వంలో ఉన్నవారు, సంపన్నులు తమ పిల్లలకు ఇంట్లో ట్యూషన్లు పెట్టిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు చదువుకున్నారు కాబట్టి స్వయంగా బోధిస్తున్నారు. కానీ కొద్దిమంది తంటాలు పడితే సరిపోతుందా? సామాన్య ప్రజల పిల్లలకు విద్య అక్కర్లేదా? మరి ఆ బాధ్యతను ప్రభుత్వం ఎందుకు నెరవేర్చటం లేదు? ప్రజలు గొంతెత్తటం లేదు కాబట్టా? ఎన్నికల్లో డబ్బులిస్తేనో, తాయిలాలిస్తేనో సరిపోతుంది కాబట్టా? కులం, మతం రెచ్చగొడితే సరిపోతుంది కాబట్టా?.. ప్రజల హక్కుల్ని కాపాడే బాధ్యతను పట్టించుకోకుండా, ఉద్యోగులు తమ హక్కుల్ని మాత్రం కాపాడాలి అంటే– ప్రజాస్వామ్యం ఎంతోకాలం నిలవదు.

జేపీకి ప్రభుత్వోద్యోగులంటే కోపం అని చాలామంది అనుకుంటారు. నేనూ ప్రభుత్వంలో పనిచేశాను. నిజాన్ని నిజాయితీగా, నిష్పాక్షికంగా చెప్పటం అంటే అది ఒకరికి వ్యతిరేకం కాదు. ఈ దేశం పట్ల ప్రేమ. రాబోయే తరం భవిష్యత్తు పట్ల బోలెడంత ఆసక్తి, ఆందోళన. రిటైరైన ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్ వేలాది కోట్లు ప్రభుత్వం ఇవ్వలేకపోవడాన్ని ఇప్పటికే మనం చూస్తున్నాం. అలవిమాలిన కోర్కెలు మనం కోరితే ఇక పరిస్థితి ఏమిటి? రేప్పొద్దున ఏం జరిగినా, దేశం అల్లకల్లోలమైనా ‘మా జీతభత్యాలకు, పెన్షన్లకు ఏం ఢోకా ఉండదని ప్రభుత్వోద్యోగులు అనుకుంటుండవచ్చు. అలాంటిదేమీ ఉండదు. ఇప్పటికే చెల్లించలేకపోతున్నారు. పరిస్థితి మరీ చేయి దాటిపోతే, ఆర్థిక వ్యవస్థ నడుము విరిగిపోతే, కూలబడిపోతే ఎవరికీ ఏ జీతాలూ రావు. మీకు తెలుసో లేదో రాజ్యాంగంలోనే ఆ ఏర్పాటు ఉంది. ఆర్థిక అత్యవసర పరిస్థితిని (ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ) ప్రకటించేదాకా వస్తే, ఎవరూ ఏమీ చేయలేరు. ఆ పరిస్థితి తీసుకురావద్దు.


మరో అంశం– దేశం మొత్తంలో ప్రభుత్వోద్యోగులకు అత్యధిక జీతభత్యాలున్నది తెలంగాణ రాష్ట్రంలో. మామూలుగా కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఎక్కువ జీతాలుంటాయి. జాతీయస్థాయిలో విధులు పరిమితం, తక్కువ సంఖ్యలో ఉద్యోగులుంటారు కాబట్టి. పనులు జరిగేది రాష్ట్రాల్లో కాబట్టి, నూటికి 90 మంది రాష్ట్ర ప్రభుత్వ కొలువుల్లో ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో కంటే తెలంగాణలో ఉద్యోగుల జీతభత్యాలు 25–30శాతం ఎక్కువ. తెలంగాణ నమూనాను అనుకరించింది కాబట్టి.. ఆ తర్వాత ఏపీలో. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు దేశంలోనే అత్యంత మిగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ విషయాన్ని పద్నాలుగవ ఆర్థిక సంఘం వివరాలతో సహా ప్రకటించింది. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్‌లాంటి తరగని గని ఉన్నా కూడా, ఇంతమంది ఇంత కష్టపడుతున్నా, పన్నులు కడుతున్నా కూడా నెలనెలా ఖర్చుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. కాబట్టి మనం ఉద్యోగుల అవసరాలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తీర్చాలి. కానీ గొంతెమ్మ కోర్కెలు కోరితే.. రేప్పొద్దున డబ్బులు కట్టాల్సింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాదు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కాదు, వారి పిల్లలు కాదు... ఈ రాష్ట్రంలోని బిడ్డలు, వచ్చేతరం యువతే.


దేశం మొత్తంలో పనిచేసే వారిలో కేవలం 3శాతం ఉన్న ప్రభుత్వోద్యోగులకు మాత్రమే వర్తించే పాత పెన్షన్ విధానం ఎంత ప్రమాదకరమో అవగాహన పెంచేందుకు గతంలోనే లోక్‌సత్తా ప్రయత్నం చేసింది. ఓపీఎస్ గురించి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం కావాలి. ప్రపంచంలో ఎన్నదగిన అన్ని దేశాల్లో.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ– ఎక్కడైనా ప్రభుత్వం ఎక్కువ, ప్రైవేటు తక్కువ అనుకోవటం ఉండదు. ఉద్యోగం చేసేటప్పుడే అందరూ జీతం నుంచి కొంత డబ్బు వెనకేస్తారు. ప్రభుత్వం లేదా ప్రైవేటు యాజమాన్యం అంతే మొత్తం డబ్బు జమ చేస్తుంది. ఉదాహరణకు, అమెరికాలో ఉద్యోగి నెల జీతం నుంచి 6.2శాతం వెనకేస్తాడు. అంతే డబ్బును యాజమాన్యం లేదా ప్రభుత్వం ఆ ఖాతాలో వేస్తుంది. ప్రైవేటులో అయితే ఆ సంస్థ యజమాని తమ వాటాగా అందులో జమ చేస్తారు. ఈ డబ్బు మొత్తాన్నీ వేరే ఖాతాలో పెడతారు. ఇలా ఉద్యోగి సర్వీసులో ఉన్నంతకాలం ఏ నెలకానెల జమ చేస్తుంటారు. ఆ డబ్బు నుంచే వారికి పెన్షన్ చెల్లిస్తారు. దీనివల్ల వచ్చే తరం మీద ఒత్తిడి ఉండదు.


ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లపై సమగ్ర అధ్యయనం చేశారు. అప్పట్లో, అంటే 3–4 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.1 లక్షా 42 వేలు. కానీ ప్రభుత్వోద్యోగుల సగటు ఓపీఎస్ పెన్షన్ ఏడాదికి రూ.5 లక్షల 34 వేలు. ఇప్పుడు తలసరి ఆదాయం పెరిగినా, ఆ నిష్పత్తిలో తేడా ఉండదు. ఇందులోని అసమతుల్యతను, అన్యాయాన్ని అర్థం చేసుకోవటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. తలసరి ఆదాయానికి నాలుగు రెట్లు సగటు పెన్షన్, అదీ పనిచేసేవారిలో 3శాతం మాత్రమే ఉన్న ప్రభుత్వోద్యోగులకు మాత్రమే. అమెరికా ప్రభుత్వం పెట్టే ఖర్చులో 14–15శాతం పెన్షన్లకు పోతుంది. కానీ ప్రభుత్వ, ప్రైవేటు, తయారీ, సాఫ్ట్‌వేర్ తేడా లేకుండా సమాజంలో పనిచేసే దాదాపు 94శాతం మందికి అందుతుంది. మన దేశంలో 3శాతం ఉన్న ప్రభుత్వోద్యోగులకోసం, అది కూడా ఖజానాలో డబ్బు పెట్టకుండా, ఏటా ప్రభుత్వ ఖర్చులో 18శాతం నేరుగా పెన్షన్ కోసం వ్యయం చేస్తున్నాం.


ఒక రాష్ట్రం అప్పుల భారం సొంత ఆదాయంలో 20శాతం దాటకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 50శాతం దాటిపోయింది. ఓపీఎస్ కొనసాగిస్తే ఇది క్రమంగా 200శాతానికి వెళ్తుంది. భవిష్యత్తును కాపాడే ఉద్దేశంతోనే వాజపేయి ప్రభుత్వం చివరి దశలో అందరినీ ఒప్పించి 2004 నుంచి కొత్త పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ తీసుకొచ్చింది. తెలంగాణలో ఓపీఎస్ గణాంకాలపై సమగ్ర అధ్యయనం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వానికి బహిరంగంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పాత పెన్షన్ పద్ధతిని మళ్లీ తెచ్చినట్లయితే ఏం జరుగుతుందో– గతంలో ఏపీ చేసినట్లుగా నిపుణుల కమిటీ లేదా ప్రామాణిక సంస్థలతో అధ్యయనం చేయించండి. ఆ శ్వేతపత్రాన్ని బయటపెట్టండి.

నేను చెప్పినవన్నీ వాస్తవాలు. ఒక్కటైనా అబద్ధమేమో పరిశీలించండి. ప్రభుత్వోద్యోగులకు కొన్ని న్యాయమైన ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు, ఎన్‌పీఎస్‌/సీపీఎస్‌లో మేం పెట్టిన డబ్బు తదనంతరం ఏమవుతుంది? అని. ఆ డబ్బు ఎక్కడికీ పోదు, ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యులకు వెళ్తుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఫండ్‌లో, స్టాక్ మార్కెట్‌లో డబ్బు తిరిగి రాకపోతే?... ఈ భయాలకు సమాధానంగానే ప్రభుత్వం ఇంకో పద్ధతిని తీసుకొచ్చింది. అది యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్). దీనివల్ల ఏ పరిస్థితుల్లోనూ ఉద్యోగికి చివరి సంవత్సరంలో సగటు జీతంలో 50శాతానికి తగ్గకుండా పెన్షన్ లభించేలా ప్రభుత్వం హామీ ఉంటుంది. తెలంగాణలోనూ ఆ పనిచేయండి. యూపీఎస్ అమలు చేయండి.

- డాక్టర్ జయప్రకాశ్‌ నారాయణ్

లోక్‌సత్తా వ్యవస్థాపకులు

Updated Date - Oct 09 , 2026 | 02:04 AM