మైనారిటీ సంక్షేమానికి మొండిచెయ్యేనా?
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:35 AM
బడ్జెట్ అనేది ప్రభుత్వ ఆలోచనా విధానం, సామాజిక న్యాయం పట్ల దాని నిబద్ధత, సమాజంలోని వివిధ వర్గాల మధ్య సమతుల్యతను ఎలా సమన్వయం చేస్తుందో తెలియజేసే ప్రామాణిక పత్రం.
బడ్జెట్ అనేది ప్రభుత్వ ఆలోచనా విధానం, సామాజిక న్యాయం పట్ల దాని నిబద్ధత, సమాజంలోని వివిధ వర్గాల మధ్య సమతుల్యతను ఎలా సమన్వయం చేస్తుందో తెలియజేసే ప్రామాణిక పత్రం. 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం 3,24,234 కోట్లతో రూపొందిన తాజా బడ్జెట్‌ను మనం ఈ కోణంలో పరిశీలించాలి. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమానికి సంఖ్యాపరంగా కేటాయింపులు పెరిగినా, ఒక అసమాన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి సుమారు 3,769 కోట్లు కేటాయించారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది పెరుగుదలగానే కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఈ కేటాయింపు మొత్తం బడ్జెట్‌లో కేవలం ఒక శాతం కంటే కాస్త ఎక్కువ మాత్రమే. జనాభాపరంగా చూస్తే తెలంగాణలో మైనారిటీలు 12–13 శాతం ఉన్నారు. ఇదే సందర్భంలో ఇతర వర్గాల పరిస్థితిని పరిశీలిస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్‌లు సుమారు 17శాతం ఉండగా, వారికి కేటాయింపు మొత్తం బడ్జెట్‌లో 12–13శాతం ఉంటుంది. గిరిజనులు 9–10శాతం ఉండగా, వారికి 5–6శాతం కేటాయింపులు అందుతున్నాయి. వెనుకబడిన వర్గాలు (బీసీలు) జనాభాలో సగానికి దగ్గరగా ఉన్నా, వారికి కేటాయింపులు 4శాతం ఉన్నాయి. అయితే ఈ మొత్తం పోలికలో అత్యంత వెనుకబడిన స్థితి మాత్రం ఒక్క మైనారిటీలదే. కాంగ్రెస్ పార్టీ తాను మైనారిటీల పక్షపాతినని చెప్పుకుంటోంది. మైనారిటీలకు కాంగ్రెస్ అతిగా ప్రాధాన్యం ఇస్తోందని మరికొన్ని పార్టీలు విమర్శిస్తాయి. ఈ రెండు వాదనలు వాస్తవాల కంటే రాజకీయ ప్రయోజనాలకు దగ్గరగా ఉన్నాయి. మూడు లక్షల కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీలకు కేవలం ఒక శాతం మాత్రమే కేటాయింపులు జరగడం పక్షపాతం కాదా?
ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం కేవలం కేటాయింపుల పరిమాణం కాదు; దాని నిర్మాణం కూడా. మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రధానంగా విద్య, ఉపాధి, మహిళా సంక్షేమం, మత–సాంస్కృతిక అవసరాలు వంటి విభాగాల్లో వినియోగిస్తున్నారు. విద్యారంగంలో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి పథకాలు ఉన్నా, వాటి అమలులో తరచూ ఆలస్యాలు, నిధుల విడుదలలో లోపాలు కనిపిస్తున్నాయి. మహిళా సంక్షేమంలో తాత్కాలిక ఆర్థిక సహాయం కనిపిస్తుండగా, దీర్ఘకాలిక సాధికారతకు అవసరమైన నిర్మాణాత్మక మార్పులు పరిమితంగానే ఉన్నాయి. మరో కీలక అంశం ఏమిటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్‌లు, గిరిజనులకు ఉన్నట్లుగా మైనారిటీలకు ప్రత్యేక ‘సబ్ ప్లాన్’ విధానం లేకపోవడం. ఈ కారణంగా వారికి కేటాయింపులు చట్టపరమైన భరోసా లేకుండా, ప్రతి ఏడాది ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడే స్థితిలో ఉన్నాయి. ఇది దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలకు అడ్డంకిగా మారుతోంది. నిజమైన సామాజిక న్యాయం అంటే ప్రతి వర్గానికి వారి అవసరాలకు, జనాభా వాటాకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా మైనారిటీ సంక్షేమానికి కేటాయింపులను గణనీయంగా పెంచాలి. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి. స్కాలర్‌షిప్‌లను సమయానికి ఇవ్వాలి, ఉపాధి పథకాల అమలులో పారదర్శకత తీసుకురావాలి, మహిళా సాధికారతకు నిర్మాణాత్మక మార్పులు చేపట్టాలి.
- యండి. ఉస్మాన్‌ఖాన్