Share News

క్రికెట్‌లోకి మతాన్ని తీసుకురావద్దు

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:48 AM

మతతత్వ స్ఫూర్తి ప్రభావితం చేయలేని జీవిత రంగం ఏదైనా మనకు ఉండకూడదా?’– దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం మహాత్మా గాంధీ సూటిగా వేసిన ప్రశ్న అది. ప్రతిపాదిత బాంబే పెంటాగ్యులర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ గురించి..

క్రికెట్‌లోకి మతాన్ని తీసుకురావద్దు

‘మతతత్వ స్ఫూర్తి ప్రభావితం చేయలేని జీవిత రంగం ఏదైనా మనకు ఉండకూడదా?’– దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం మహాత్మా గాంధీ సూటిగా వేసిన ప్రశ్న అది. ప్రతిపాదిత బాంబే పెంటాగ్యులర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ గురించి అడిగిన సందర్భంలో ఆయన ఇలా ప్రశ్నించారు. ప్రతిష్ఠాత్మక బాంబే క్వాడ్రాంగ్యులర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ తొలుత పార్సీలకు, యూరోపియన్లకు మధ్య ప్రతి ఏటా ‘ప్రెసిడెన్సీ’ మ్యాచ్‌గా జరిగేది. 1907లో హిందువులు కూడా చేరడంతో అది ముక్కోణపు (ట్రయాంగ్యులర్‌) టోర్నమెంట్‌ అయింది. 1912 నాటికి ముస్లిం జట్టు చేరడంతో ఆ టోర్నమెంట్‌ చతుర్ముఖం (క్వాడ్రాంగ్యులర్‌)గా మారింది. 1937 నాటికి భారతీయ క్రైస్తవులు, బౌద్ధులు, యూదులతో కూడిన ఐదవ జట్టు (రెస్టాఫ్‌ ఇండియా) చేరడంతో ఆ టోర్నీ పంచముఖి (పెంటాగ్యులర్‌)గా మారింది. మత సంబంధ బృందాల మధ్య పోటీగా ఆ టోర్నమెంట్‌ను నిర్వహించేవారు. ఈ ఆనవాయితీని గాంధీ ఎంతమాత్రం హర్షించలేదు. మత ప్రాతిపదిక పోటీలకు స్వస్తి చెప్పాలని బొంబాయి ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పెంటాగ్యులర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను అంతిమంగా 1946లో నిలిపివేశారు.

1940లో గాంధీ వేసిన ప్రశ్న 86 సంవత్సరాల అనంతరం కూడా అసాధారణ ప్రాసంగికత ఉన్నదిగా కనిపిస్తోంది. గతంలో భారతీయ క్రికెట్‌ను నిర్వచించిన మతపరమైన, ప్రాంతీయ విభజనలను అధిగమించడం భారతీయ క్రికెట్‌ మహా విజయాలలో ఒకటి. అయినప్పటికీ మహమ్మద్‌ షమీ, సర్ఫరాజ్‌ ఖాన్‌, ఇటీవల మహమ్మద్‌ సిరాజ్‌లను ఇండియా జట్టు నుంచి మినహాయించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముస్లిం మతస్థులైన క్రికెటర్ల పట్ల వివక్ష చూపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ క్రికెటర్లను భిన్నంగా పరిగణించడాన్ని క్రికెట్‌ అభిమానులు గర్హిస్తున్నారు. భారతీయ క్రికెట్‌ నేడు అన్ని విధాలా ఒక శిఖరాగ్ర స్థాయిలో ఉన్నది. ఈ ఘనతను మరింత సమున్నతం చేసుకోవడానికి బదులుగా మన క్రికెట్‌ను దశాబ్దాల వెనుకబాటుతనంలోకి తీసుకువెళ్లడానికి మనం సమాయత్తమవుతున్నామా?


తొలుత తక్షణ గతంలోని ఒక వివాదాన్ని తరచి చూద్దాం. న్యూజిలాండ్‌లో ఆడుతున్న భారత్‌ జట్టు నుంచి సిరాజ్‌ను తొలగించడం ప్రశ్నించదగిన క్రికెట్‌ నిర్ణయమని అనడానికి నేను సందేహించను. భారతదేశపు ప్రతిభావంతులైన ఫాస్ట్‌ బౌలర్లలో సిరాజ్‌ ఒకరు. ముఖ్యంగా విదేశ పిచ్‌లపై అతడి ఆట తీరు అమోఘమైనది. క్రికెటర్‌గా సిరాజ్‌ రికార్డును గౌరవించి తీరాలి. ఎందుకంటే భారత్‌ ఆధారపడదగ్గ విశ్వసనీయ ఫాస్ట్‌ బౌలర్లలో అతడు మేటి. మరి అతడిని ఇండియా జట్టు నుంచి ఎందుకు తొలగించారనే విషయమై క్రికెట్‌ అభిమానులకు క్రికెట్‌ బోర్డు వివరణ ఇచ్చి తీరాలి. షమీ సైతం ఇటీవలి సంవత్సరాలలో భారతదేశ ప్రశస్త ఫాస్ట్‌ బౌలర్‌గా వెలుగొందుతున్నారు. సర్ఫరాజ్‌ దేశీయ టోర్నమెంట్లలో అద్భుత ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన ఆటగాడు. భారత జట్టు నుంచి వీరిని మినహాయించడంపై వెల్లువెత్తిన ప్రశ్నలు అన్నీ సమంజసమైనవి. అయితే సిరాజ్‌ పేరు, మతపరమైన గుర్తింపే అతడిని తొలగించడానికి కారణమని కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ ఆక్షేపించడం పూర్తిగా భిన్నమైన విషయం. అదొక తీవ్ర ఆరోపణ. ఆ అభియోగానికి తగు సాక్ష్యాధారాలు చూపాలి. అన్యాపదేశంగా మాట్లాడితే సరిపోదు. ప్రశ్నించదగిన ఎంపిక నిర్ణయం దానంతట అదే మత సంబంధితమైనదిగా కాబోదు. ఏది ఏమైనా ఈ నిర్ణయాల విషయమై తలెత్తిన సందేహాలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒక సంస్థకు ఉన్నది. అది బీసీసీఐ. ప్రపంచంలోనే అత్యంత సంపద్వంతమైన ఈ క్రికెట్‌ బోర్డు అసాధారణ అపారదర్శకతతో పనిచేస్తోంది.


ఒక ఆటగాడికి బదులుగా మరో ఆటగాడికి ఎందుకు ప్రాధాన్యమిచ్చారు? ఫామ్‌, ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్‌, టీమ్‌ కాంబినేషన్‌ తదితర అంశాలను ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? ఘనమైన రికార్డుల చరిత్ర ఉన్న అనుభవజ్ఞులైన ఆటగాళ్లను ఎందుకు పక్కనపెట్టారు? ఈ ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు రావాల్సిన అవసరమున్నది. తన నిర్ణయాలపై వివరణ ఇచ్చేందుకు బీసీసీఐ నిరాకరించడం ఒక సమాచార శూన్యతను సృష్టించింది. ఆ శూన్యత నానా ఊహాగానాలకు, కుట్ర సిద్ధాంతాలకు మతతత్వ ఆరోపణలకు తావిస్తోంది. పారదర్శకత అనేది బోర్డు ప్రజలకు చేసే ఏదో ఒక ఉపకారం కాదు. ఒక జాతీయ క్రీడా సంస్థను నడిపేటప్పుడు ఉండాల్సిన కనీస బాధ్యత అది.

వర్తమాన భారతీయ క్రికెట్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీదాయకంగా, ప్రతిభాపాటవాల ఆధారంగా వర్ధిల్లుతోంది. విభిన్న నేపథ్యాల నుంచి ప్రభవించిన ప్రతిభాశాలురు అయిన క్రీడాకారుల బృందాలు పోటీపడుతున్నాయి. దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల నుంచి మేటి క్రికెటర్లు ప్రభవిస్తున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు సైతం జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఈ వ్యవస్థ పరిపూర్ణంగా లోపరహితమైనది కాదు. అభిమాన దురభిమానాలు, ప్రాంతీయ లాబీలు ప్రబలంగా ఉన్నాయి. ఎంపిక నిర్ణయాలు సక్రమంగా ఉంటున్నాయని చెప్పలేము. పక్షపాతాలు వాటిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఒక క్రికెటర్‌ తన క్రీడా నైపుణ్యాలు, ఆటతీరుతోనే జట్టులో తన స్థానాన్ని సముపార్జించుకోవాలనే ప్రధాన సూత్రం ఇప్పుడు మరింత బలంగా స్థిరపడింది.


భారత్‌లో ముస్లిం క్రికెటర్ల చరిత్రనూ చూడండి. ఇఫ్తిఖార్‌ అలీఖాన్‌ పటౌడీ 1946లో ఇండియా జట్టుకు కెప్టెన్‌. ఈయన కుమారుడే కెప్టెన్‌ మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ– భారతీయులు అమితంగా అభిమానించిన క్రికెట్‌ దిగ్గజాలలో ఒకరు. గులామ్‌ అహ్మద్‌ మరొక ప్రముఖ కెప్టెన్‌. ఆ తరువాత మహమ్మద్‌ అజారుద్దీన్‌ టీమ్‌ ఇండియాకు పలు సంవత్సరాల పాటు సారథ్యం వహించారు. భారత్‌ తన లౌకికవాదాన్ని ప్రపంచానికి నిరూపించేందుకు వారికి ఆ ఉన్నత బాధ్యతను అప్పగించలేదు. తమ అసాధారణ క్రికెటింగ్‌ కౌశలాలతో టీమ్‌ ఇండియాకు నాయకులైన ప్రతిభాసంపన్న క్రికెటర్లు వారు. ఇటీవలి సంవత్సరాలలో జహీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, మహమ్మద్‌ కైఫ్‌, మునాఫ్‌ పటేల్‌ మొదలైన ఆటగాళ్లు భారతీయ క్రికెట్‌కు విశేష పేరుప్రఖ్యాతులు సమకూర్చారు. వారి మతమేమిటో అడగాల్సిన అవసరం ఎవరికీ లేదు. వారు తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ క్రికెటర్లు. వ్యక్తులుగా, క్రీడాకారులుగా వారు పరిపూర్ణ భారతీయులు. సమకాలీన తరం వారిని చూడండి. యువ ఫాస్ట్‌ బౌలర్‌ అకిబ్‌ నబీ కశ్మీర్‌ నుంచి వచ్చాడు. విఖ్యాత వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌ కేరళం నుంచి వచ్చాడు. వారివి పూర్తిగా భిన్నమైన సామాజిక, సాంస్కృతిక, భాషా నేపథ్యాలు. వారందరూ ఒకే జాతీయ జెండా కోసం పోటీపడతారు. వేర్వేరు ప్రాంతాలు, నేపథ్యాల నుంచి వచ్చిన ప్రతిభావంతులను ఒకే తాటిపైకి తీసుకురావడమే భారతీయ క్రికెట్‌లోని అసలైన సౌందర్యం. అందులో అత్యంత లోతైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది.


భారతీయ క్రికెట్‌ ఒక లోపరహిత క్రీడా వ్యవస్థ అని నేను సూచించటం లేదు. మత పరమైన వివక్ష భారతీయ క్రికెట్‌లో ఎన్నడూ లేదని కూడా నేను చెప్పబోవటం లేదు. ఆటగాళ్ల ఎంపికకు సంబంధించిన నిర్ణయాలలో దాపరికం ఉండకూడదు. అవి నిష్కపటంగా ఉండాలి. అవకాశాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యాలు, సెలెక్టర్లు నిర్ణయాలు తీసుకునే తీరుతెన్నులపై ప్రశ్నలు న్యాయ సమ్మతమైనవి. అయితే ఒక ఎంపిక నిర్ణయాన్ని ప్రశ్నించడం, రుజువులు లేకుండా ఎంపికలో మత పరమైన వివక్ష చూపారని ఆరోపించడం మధ్య భేదాన్ని గుర్తించాలి. పెద్ద ప్రమాదమేమిటంటే మన రాజకీయ చర్చలను మతం ప్రగాఢంగా ప్రభావితం చేస్తోంది. ప్రతి సంఘటనను, ఉదంతాన్ని మత పరమైన కోణం నుంచి చూడడానికి మనం క్రమంగా అలవాటు పడుతున్నాం. ఓటర్లను సమీకరించేందుకు, ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు, ఇక్కట్లను సృష్టించేందుకు రాజకీయ నాయకులు మత విశ్వాసాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ ధోరణి క్రమంగా ప్రతి వ్యవస్థ, ప్రతి క్రీడా పోటీలోకి లోతుగా చొచ్చుకుపోతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మత పరమైన భావోద్వేగాలతో ప్రభావితం కాని ప్రజావ్యవహారమనేది లేకుండా పోతోంది. మతపరమైన దురాకర్షణలను క్రికెట్‌ ప్రతిఘటించాలి. మతం, భాష, ప్రాంతాలకు అతీతంగా కోట్లాది భారతీయులను ఏకం చేయగల అతి కొద్ది వ్యవస్థలలో ఒకటిగా క్రికెట్‌ మిగిలి ఉంది. మతపరమైన రాజకీయాలకు లేదా మతతత్వ విమర్శలకు క్రికెట్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ మరో వేదిక కావడం నిజంగా ఒక మహా విషాదమే అవుతుంది. జట్టు ఎంపికలపై ప్రశ్నించే హక్కు ఆ ఆట అభిమానులకు ఉంది; సెలెక్టర్ల నిర్ణయాలతో విభేదించే హక్కు మాజీ క్రికెటర్లకు ఉంది.


అయితే చర్చ క్రికెట్‌ గురించి మాత్రమే జరగాలి. క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావాలి. మతతత్వ భావన అంటని జీవనరంగం ఏదైనా ఉండగలదా అని గాంధీ ఒకసారి ప్రశ్నించారు. భారతీయ క్రికెట్‌ దశాబ్దాలుగా ఆ విశాల, సమష్టి జీవన వేదికను సమకూర్చుతోంది. మనం ఇప్పుడు దానిని కోల్పోకుండా జాగ్రత్త పడాలి. క్వాడ్రాంగ్యులర్‌, పెంటాగ్యులర్‌ టోర్నమెంట్ల కాలం నుంచి మనం చాలా ముందుకు సాగి, విశాల భావాలతో క్రికెట్‌తో మమేకమవుతున్నాం. క్రికెట్‌ డ్రెస్సింగ్‌ రూంలోకి మనం మళ్లీ మతాన్ని తీసుకురావడం సమంజసమేనా?

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - Nov 28 , 2026 | 12:52 AM