విద్యార్థుల తలరాతను తిరగరాసే విధాత
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:25 AM
విద్యార్థుల తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
విద్యార్థుల తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తన జన్మదినోత్సవాన్ని ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని భారతదేశానికి రెండో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన మేధావి. ప్రఖ్యాత రచయిత. గొప్ప రాజనీతిజ్ఞుడు. అయినప్పటికీ ఉపాధ్యాయునిగా తాను పోషించిన పాత్రనే అన్నింటి కంటే మిన్నగా భావించారు. అత్యంత ఆదరణ పొందిన రాష్ట్రపతుల్లో ఒకరైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను ఒక సందర్భంలో.. ‘మిమ్మల్ని ప్రజలు ఓ శాస్త్రవేత్తగా గుర్తుంచుకోవాలా? రాష్ట్రపతిగా గుర్తుంచుకోవాలా?’ అని ఒకరు ప్రశ్నించారు. తనను ఓ ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని కలాం సమాధానమిచ్చారు.
సామర్థ్యం, నైతిక విలువలే ఉపాధ్యాయులను పూజనీయులుగా మారుస్తాయి. అలాంటి వారినే విద్యార్థులు దైవంగా భావిస్తారు. వారినే ఆదర్శంగా తీసుకుంటారు. తమ సంతానం మాదిరిగానే విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు ప్రేమించాలని మన ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నాయి. వారిని సమానంగా, న్యాయభావంతో చూడాలని, విద్యార్థులపై కోపం ప్రదర్శించకూడదని, సహనంతో ఉండాలని తెలియజేస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చి వారి సామర్థ్యానికి అనుగుణంగా బోధించాలని నిర్దేశిస్తున్నాయి. అలాంటి గురువులను గౌరవిస్తూ... ‘ఆచార్యదేవో భవ’ అనే కాలాతీత సందేశాన్ని దాదాపు మూడు సహస్రాబ్దాల క్రితం నాటి తైత్తిరీయ ఉపనిషత్తులోని శిక్షావల్లి అందిస్తోంది.
ఎంతోమంది వివేకవంతులైన, ప్రేమ నిండిన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని పొందడం నాకు కలిగిన గొప్ప అదృష్టం. కొన్ని సందర్భాల్లో పాఠశాల సమయం ముగిసిన తర్వాత సైతం తమ గృహాల్లోనే వారు మాకు పాఠాలు చెప్పేవారు. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఏడో తరగతి తర్వాత పై చదువుల కోసం మా ఊరు నుంచి బయటకు వెళ్లిన మొదటి అమ్మాయిని నేనే. ఆ తర్వాత భువనేశ్వర్‌లో చదువుతున్నప్పుడూ నా ఉపాధ్యాయుల నుంచి అపారమైన ప్రేమను, ప్రోత్సాహాన్ని పొందగలగడం నాకు దక్కిన భాగ్యం. నా ఉపాధ్యాయుల గురించి ఎంతో వినయంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే... ‘ప్రేమ, అంకితభావం ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థిలో అపరిమితమైన సామర్థ్యాన్ని, స్ఫూర్తిని మేల్కొల్పగలరు’ అనే గొప్ప సత్యాన్ని వారి కథ తెలియజేస్తుంది. ఆ ప్రోత్సాహం అందించే తోడ్పాటుతోనే జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే, అత్యున్నత లక్ష్యాలను సాధించే విశ్వాసాన్ని విద్యార్థులు వృద్ధి చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా తమ ప్రవర్తన, ఆదర్శాల ద్వారా ఫలప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన కళను, నైపుణ్యాలను సైతం విద్యార్థులకు నేర్పిస్తారు. విద్యా ప్రయాణంలో విద్యార్థికి మార్గదర్శిగా, శ్రేయోభిలాషిగా, స్నేహితునిగా, సహ ప్రయాణికునిగా ఉపాధ్యాయులు ఉంటారు.
మంచి ఉపాధ్యాయున్ని తీర్చిదిద్దే సూక్ష్మం... ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతీ సంప్రదాయాల ద్వారా మనకు లభించింది. అది నేటి కాలానికి సైతం వర్తిస్తుంది. శతాబ్దాల క్రితం, మహాకవి కాళిదాసు తన ‘మాళవికాగ్ని మిత్రం’ నాటకంలో ‘అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉండటంతో పాటు, దానిని ఇతరులకు అందించగల సామర్థ్యం ఉన్నవారే మంచి ఉపాధ్యాయుడు’ అని రాశారు.
ఓ ప్రసిద్ధ సంస్కృత సూక్తి మనకు ఇలా చెబుతోంది. ‘సర్వత్ర విజయం ఇచ్ఛేత్, శిష్యాత్ ఇచ్ఛేత్ పరాజయం’ – ఎక్కడైనా విజయాన్ని కోరుకోవచ్చు. కానీ శిష్యుని ముందు ఓటమిని కోరుకోవాలి అని దానర్థం. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించడం, వారిలో ఆసక్తిని రేకెత్తించడం, తర్కాన్ని, ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించడం, నిర్ణయ సామర్థ్యానికి పదునుపెట్టడం, వారు సాధికారత సాధించిన వ్యక్తులుగా ఎదగడానికి సాయపడటం ఇవే బోధనకు ఉన్న అత్యంత ఉపయోగకరమైన, ప్రతిఫలాన్ని అందించే అంశాల్లో కొన్ని. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విద్య ద్వారా మాత్రమే విజయవంతమైన వ్యాపారవేత్తలు, ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, సృజనాత్మకత ఉన్న కళాకారులు, ఆధునిక సవాళ్లకు వినూత్న పరిష్కారాలు అందించే పౌరులను సిద్ధం చేయగలం.
బోధన అంటే వృత్తి మాత్రమే కాదు. అది ఓ ప్రతిజ్ఞ. అది ఉద్యోగం లేదా పని కంటే ఎక్కువ. అది మానవాళిని తీర్చిదిద్దే పవిత్రమైన కార్యం. భవిష్యత్తు తరాలకు ప్రకాశవంతమైన మార్గాన్ని అందించే ఉన్నతమైన బాధ్యత.
బోధనకు సంబంధించిన నా జ్ఞాపకాలు నాకు ప్రత్యేకమైన సంతృప్తిని ఇస్తాయి. నేను ఒడిశాలోని రాయరంగ్‌పూర్‌లో ఉన్న శ్రీ అరబిందో ఇంటిగ్రల్ పాఠశాలలో చిన్నారులకు బోధించాను. వివిధ పాఠ్యాంశాలను బోధించడంతో పాటు... సంగీత ప్రదర్శనలకు, క్రీడలకు, నాటకాలకు వారిని సిద్ధం చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉండేదాన్ని. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మా సన్నాహాలను, ఆ సమయంలో పిల్లల ఆనందోత్సాహాలను గుర్తుచేసుకుంటే ఈనాటికీ నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. విద్యార్థులను అందమైన ప్రదేశాలకు విహారయాత్రలకు తీసుకెళ్లడంలోను, జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కల ప్రపంచాన్ని ఆటలు, అన్వేషణ ద్వారా వారికి పరిచయం చేయడంలోనూ గొప్ప సంతృప్తిని, అర్థాన్ని కనుగొన్నాను.
పాఠశాల విద్య పూర్తయి ఏళ్లు గడిచినా... ఇప్పటికీ నా విద్యార్థులు వారి కుటుంబ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తుంటారు. నా విద్యార్థుల్లో చాలామంది పేర్లు ఇంకా నాకు స్పష్టంగా గుర్తున్నాయి. వాటితో పాటు మేం వారిని పిలిచిన మారుపేర్లు కూడా గుర్తున్నాయి. నా విద్యార్థుల నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. బాలల నుంచి.. తక్షణమే స్పందించే గుణాన్ని, ఆసక్తిని ఉపాధ్యాయులు నేర్చుకుంటారని నేను విశ్వసిస్తాను.
నేను రాష్ట్రపతిగా రెండో సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు రాష్ట్రపతి భవన్ ఆవరణలోని పాఠశాల విద్యార్థులతో సమయం గడిపాను. అప్పుడు వారికి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించాను. నేను ఎల్లప్పుడూ విద్యార్థులను కలవడానికి, వారి ఆలోచనలను, అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపుతాను. వారు పంచుకునే విషయాలు నాకు గుర్తుండిపోతాయి.
సుమారు పదకొండేళ్ల క్రితం, నేను మా ఊరిలో ఒక గురుకుల పాఠశాలను స్థాపించాను. ఆ పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన బాలలు చదువుకుంటారు. వారిని కలుసుకునేందుకు అప్పుడప్పుడూ ఆ పాఠశాలను సందర్శిస్తుంటాను. ఈ ఏడాది జూన్ 20న నా పుట్టినరోజు సందర్భంగా ఆ బాలలతో సమయం గడపడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైతం నాతో పాటు ఆ పాఠశాలను సందర్శించి వారిలో స్ఫూర్తి నింపారు. ప్రధానిని కలుసుకున్న అసాధారణ అనుభవం వారికి చిరకాలం స్ఫూర్తినిచ్చేదిగా నిలిచిపోతుంది. వారి అభివృద్ధిని చూడటం నాలో ఒక ప్రత్యేకమైన అర్థవంతమైన భావనను నింపుతుంది.
విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం కాదు. తమ ప్రవర్తన, విజయాల ద్వారా బాలలకు ఆదర్శంగా నిలిచేవారు కూడా నేర్చుకోవడానికి, స్ఫూర్తికి విలువైన వనరుగా ఉంటారు.
తమ పిల్లలను చదువుకోవడానికి పంపించేటప్పుడు ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు, సంరక్షకులు అత్యంత విశ్వాసాన్ని ఉంచుతారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటారని, వారి భద్రత, అభివృద్ధి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటారని నమ్ముతారు. తమపై ఉంచిన ఈ పవిత్రమైన నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి ఉపాధ్యాయుని ధర్మం. ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన, నడవడిక బాలల్లో భయాందోళనలను కలిగించకూడదు, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు. లేదా వారిలో ఎలాంటి న్యూనతా భావం పెరిగేలా చేయకూడదు.
తమ విద్యార్థులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే పవిత్ర మైన బాధ్యత ఉపాధ్యాయులదే. తమ ఆలోచనల్లో, చేతల్లో నైతికతను పాటిస్తూ... సంపదను, కీర్తిని సాధించే విద్యార్థులే ఉపాధ్యాయుని విజయానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తారు.
సామాజిక సమ్మిళిత్వమే కేంద్రంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యం దిశగా భారత్ స్థిరంగా ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో మన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాల గొప్పతనాన్ని గౌరవించే, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని మానవాళి సంక్షేమానికి కృషి చేసే, అంత్యోదయ ఆదర్శాన్ని నిలబెట్టే, పర్యావరణాన్ని, సకల జీవరాశులను పరిరక్షించే, వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సు కోసం కృషి చేసే, ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో ముందుకు సాగేలా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పౌరునికీ నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. అంకితభావం, నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులను సమున్నతంగా గౌరవిద్దాం. చిత్తశుద్ధి కలిగిన ఉపాధ్యాయుల కృషితో నేర్చుకోవడాన్ని నిరంతరం కొనసాగిస్తూ... భారత్ అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం)