టాటా గ్రూప్ భవిష్యత్తు ఏమిటి?
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:12 AM
దిగ్గజ వ్యాపార సంస్థల అంతర్గత వ్యవహారాలు కేవలం వాటికే పరిమితం కాకుండా సామాన్యుడి ఆశయాలు, ముఖ్యంగా యువ విద్యావంతుల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతాయి.
దిగ్గజ వ్యాపార సంస్థల అంతర్గత వ్యవహారాలు కేవలం వాటికే పరిమితం కాకుండా సామాన్యుడి ఆశయాలు, ముఖ్యంగా యువ విద్యావంతుల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతాయి. టాటా గ్రూప్‌లో యాజమాన్య ఆధిపత్య పోరు మున్ముందు– తెలుగునాట ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆశయ స్వప్నమైన ఉద్యోగం మొదలు, భోగాపురం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల వరకూ ప్రభావితం చేయగలిగే వ్యవహారం.
అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన కార్పొరేట్ సంస్థలలో టాటా గ్రూప్ ప్రథమ గణ్యమైనది. 100కు పైగా దేశాలలో వివిధ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ సర్వత్రా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నది. టాటాలో పనిచేసిన అనుభవంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో కొలువులు పొంది రాణిస్తున్న భారతీయులు పలువురు ఉన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వి.బి.కె మూర్తి అనే ఇంజినీర్ అటువంటివారిలో ఒకరు. జంషెడ్‌పూర్‌లోని టాటా ఉక్కు కర్మాగారంలో నాలుగు దశాబ్దాల క్రితం పనిచేసిన అనుభవంతో నేడు ఆయన ఖతర్‌లోని ఒక అగ్రశ్రేణి అమెరికన్ ఇంజినీరింగ్ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్నారు. మధ్యప్రాచ్య దేశాలలో ఆ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. టాటా గ్రూప్‌లో భాగమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రతిభావంతులైన వేలాది తెలుగు యువతీయువకులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. క్యాంపస్ ఇంటర్వ్యూలలో టీసీఎస్ పిలుపు కొరకు ఎదురుచూసే యువతకు తెలుగునాట కొదవలేదు. అమెరికా, అరబ్, ఐరోపా దేశాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో రాణిస్తున్నారంటే అందుకు టీసీఎస్ చేస్తున్న దోహదం విస్మరించలేనిది. గత ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ ఆర్జించిన 1 లక్షా 70 వేల కోట్ల రూపాయల నికరలాభంలో సింహభాగం టీసీఎస్ ద్వారా సమకూరింది. టీసీఎస్ విజయాలకు తెలుగు యువ ఇంజినీర్లు కూడా ప్రధాన కారకులు అనేది ఒక వాస్తవం.
అవిభక్త భారతదేశంలో టాటా గ్రూప్ నెలకొల్పిన ఎయిర్ ఇండియానే ఇప్పటికీ భారత్‌లో సగటు భారతీయుడి విమానయాన సంస్థ. స్వాతంత్ర్యానంతరం జాతీయీకరణ అయిన ఈ సంస్థ నిరంతరం నష్టాలతో నడుస్తుండేది. ప్రైవేటీకరణ అనంతరం 2022లో టాటా గ్రూపే మళ్లీ దీన్ని స్వాధీనం చేసుకున్నది. కారణమేమైనప్పటికీ విదేశీ విమానయాన సంస్థలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల సంస్థలతో పోటీపడలేక ఎయిర్ ఇండియా నష్టాలను చవిచూస్తోంది! భారత పౌరవిమానయాన విపణిలో ఎమిరేట్స్, ఖతర్ ఎయిర్‌వేస్ లాభాలను ఆర్జిస్తుండగా ఎయిర్ ఇండియాకు మాత్రం నష్టాలు వస్తున్నాయి. టాటా గ్రూప్ స్వాధీనం చేసుకున్న అనంతరం కూడా ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో రూ.22,238 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఫలితంగా ఎయిర్ ఇండియా తన మనుగడను నిలబెట్టుకునేందుకు ఏటా తన మాతృసంస్థ టాటా గ్రూప్ నుంచి నిధులు కోరడం పరిపాటి.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్ ఇండియా వద్ద విమానాలు లేకపోవడమే అది చవిచూస్తున్న నష్టాలకు ఒక ప్రధాన కారణం. కనుకనే విజయవాడ, విశాఖపట్టణం ఇత్యాది నగరాల నుంచి మరిన్ని అంతర్జాతీయ, జాతీయ విమాన సర్వీసులను నడపాలనే ప్రజల ఆకాంక్షను ఎయిర్ ఇండియా నెరవేర్చలేకపోతున్నది. విమానాల కొరతను అధిగమించేందుకై భారీగా 470 విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా పూనుకున్నది. ఈ కొనుగోళ్లకు టాటా గ్రూప్ నిధులు సమకూర్చవల్సి ఉంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్‌లో 66 శాతం వాటా ఉన్న అసలు యజమానులైన టాటా ట్రస్టుల అభీష్టానికి విరుద్ధంగా యాజమాన్య మార్పిడి దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాపార సంస్థే అయినప్పటికీ మేరా భారత్ మహాన్‌లో టాటా గ్రూప్ తన వంతు పాత్రను ప్రశస్తంగా పోషించిందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు.
- మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)