Share News

బంగ్లాలో మళ్లీ బీఎన్పీ

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:56 AM

తారీఖ్‌ రహ్మాన్‌ బంగ్లాదేశ్‌ ప్రధాని కాబోతున్నారు. మూడున్నర దశాబ్దాల తరువాత ఆ పీఠం మీద ఒక పురుషుడు కూచోబోతున్నారు. ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి మగ ప్రధాని కూడా......

బంగ్లాలో మళ్లీ బీఎన్పీ

తారీఖ్‌ రహ్మాన్‌ బంగ్లాదేశ్‌ ప్రధాని కాబోతున్నారు. మూడున్నర దశాబ్దాల తరువాత ఆ పీఠం మీద ఒక పురుషుడు కూచోబోతున్నారు. ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి మగ ప్రధాని కూడా. జీవితంలో ఒక్క ఎన్నిక కూడా గెలవని వ్యక్తి ఇప్పుడు నేరుగా దేశపాలకుడైనాడు. పదిహేడేళ్ళు ప్రవాసంలో ఉండి, ఓ యాభై రోజుల క్రితమే దేశంలో కాలూనిన తారీఖ్‌ నేతృత్వంలో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్పీ) మూడింట రెండువంతుల స్థానాలు గెలుచుకోవడం విశేషం. లండన్‌లో ఉంటూ, యూనిస్‌ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచుతూ, ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాతే స్వదేశానికి రావడం, ఈ స్వల్పకాలంలోనే ఆయన తల్లి, బీఎన్పీ అధినాయకురాలు ఖలీదా జియా కన్నుమూయడం ఈ భారీ విజయానికి దోహదం చేశాయి.

హసీనా పార్టీ బరిలో లేకపోవడం ఓటింగ్‌ శాతాన్ని బాగా తగ్గించినా, అనుకున్నట్టుగానే ఖలీదా పార్టీకి లాభించింది. అవామీలీగ్‌ ఓట్‌బ్యాంక్‌ గణనీయంగా బీఎన్పీవైపు మళ్ళింది. పట్టణప్రాంతాలు, మధ్యతరగతి, మహిళలు జమాత్‌–ఏ–ఇస్లామీని ఆదరించలేదు కనుక, ఆది మనం భయపడినట్టుగా ఘన విజయాలు సాధించలేదు. తమ దేశం మరో అఫ్ఘానిస్థాన్‌ కాకూడదని బంగ్లా మహిళలు అనుకొని ఉంటారు. అధికశాతం యువత కూడా జమాత్‌తో పోల్చితే బీఎన్పీ ఉత్తమమని భావించింది. హిందువులతో సహా మైనారిటీలంతా పెద్దసంఖ్యలో బీఎన్పీకే ఓటేశారు. అయినప్పటికీ, కొత్త సభలో జమాత్‌ పదకొండుపార్టీల కూటమితో బలమైన విపక్షంగా నిలబడగలిగింది. ఎన్నికల్లో లబ్ధికోసం హిందువులమీద దాడులకు పాల్పడిన జమాత్‌ను యూనిస్‌ ప్రభుత్వం ఇతోధికంగా ఎగదోసింది. ఒకదశలో జమాత్‌ మహాద్భుత విజయం సాధిస్తుందన్న అంచనాలు కూడా వెలువడ్డాయి. చివరకు, ఈ పాకిస్థాన్‌ అనుకూల మతఛాందసశక్తి అధికారంలోకి రాకూడదన్న భారత్‌ కోరిక నెరవేరింది. విద్యార్థి ఉద్యమమే హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చి, ఆమెను దేశంనుంచి వెళ్ళగొట్టినప్పటికీ, నేషనల్‌ సిటిజెన్స్‌ పార్టీ ఈ ఎన్నికల్లో స్వల్ప విజయాలు సాధించడం ఆశ్చర్యం. తిరుగుబాటు కాలంలో వల్లెవేసిన ఆదర్శాలు, ఎజెండాలు గాలికి కొట్టుకుపోయి, అంతిమంగా జమాత్‌తో చేయికలపడం వారిని అరడజను స్థానాలకు పరిమితం చేసింది. హసీనాను గద్దెదించడంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి నాయకులంతా జమాత్‌ విద్యార్థి విభాగానికి చెందినవారే.


భవిష్యత్తులో జమాత్‌ మరింత బలపడవచ్చునేమో కానీ, ఇప్పటికైతే మూడింట రెండువంతుల మెజారిటీతో బీఎన్పీ గెలిచినందుకు సంతోషించాలి. తొలి ప్రసంగంలోనూ, ఎన్నికల సందేశాల్లోనూ తారీఖ్‌ దృక్పథం ఏంటో తెలుస్తోంది. దేశంలో కాలూనగానే ‘ఐ హావ్‌ ఏ ప్లాన్‌’ అంటూ యావత్‌ దేశాన్ని ఒక్కటిగా ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అన్ని మతాలను పేరుపేరునా ప్రస్తావించి సమానంగా చూస్తానన్న సందేశాన్ని ఇచ్చాడు. ‘బంగ్లాదేశ్‌ ఫస్ట్‌’ అంటూ భారత్‌, పాకిస్థాన్‌ తనకు సమదూరమన్నాడు. యూనిస్‌ ప్రభుత్వం చైనా, పాకిస్థాన్‌లతో రాసుకుపూసుకున్న నేపథ్యంలో, కొత్త ప్రధాని తన విధానం ‘నాట్‌ డిల్లీ, నాట్‌ పిండి’ అనడం సంతోషమే. భారత్‌తో ఘర్షణపడే ఉద్దేశంలో ఆయన లేడు. బీఎన్పీ మేనిఫెస్టో కూడా భారత్‌ పేరు ప్రస్తావించకుండా వాణిజ్యం, నీటిపంపకాలు ఇత్యాది విషయాల్లో సానుకూల వ్యాఖ్యలే చేసింది. యూనిస్‌ ప్రభుత్వం ఏలుబడిలో దిగజారిన ఉభయదేశాల సంబంధాలు ఇకపై మెల్లగా మెరుగుపడతాయని భావించాలి. హసీనా అధికారంలో ఉన్నప్పటి పూర్తి సానుకూలతనైతే కొత్త ప్రభుత్వం నుంచి ఆశించలేం. బంగ్లాదేశ్‌ ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఉరిశిక్ష విధించిన హసీనాను అప్పగించే అంశం రెండు దేశాల మధ్యా ఎన్నటికీ తెగని వివాదంగా, అతుకుపడేందుకు అడ్డంకిగా ఉంటున్నది వాస్తవం. 2001–06 మధ్యకాలంలో ఖలేదాజియా ప్రధానిగా ఉండగా, జమాత్‌ భాగస్వామిగా బీఎన్పీ అనుసరించిన భారత వ్యతిరేక వైఖరి తెలిసిందే. పాక్‌ ఉగ్రసంస్థలకూ, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులకు ఆమె ప్రభుత్వం ఆర్థిక, ఆయుధసాయం అందించింది. ప్రధాని నివాసానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న హవా భవన్‌లో కూచొని, సర్వమూ తానే అయి అన్నీ చక్కబెట్టిన ఖలేదా కుమారుడు ఇప్పుడు తాను మారిన మనిషినని అంటున్నాడు. భారత్‌తో తారీఖ్‌ రహ్మాన్‌ 2.0 వ్యవహారం ఎలా ఉండబోతున్నదో చూడాలి.

Updated Date - Feb 14 , 2026 | 12:56 AM