అయిననూ రావలె..!
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:01 AM
బంగ్లాదేశ్ ప్రధాని తారీఖ్ రహ్మాన్ భారత పర్యటన తేదీని ఖరారు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని, సరైన సమయంలో ఈ పర్యటన జరుగుతుందని బంగ్లాదేశ్ మంత్రి హుమాయూన్ కబీర్ గురువారం ఓ వ్యాఖ్య చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని తారీఖ్ రహ్మాన్ భారత పర్యటన తేదీని ఖరారు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని, సరైన సమయంలో ఈ పర్యటన జరుగుతుందని బంగ్లాదేశ్ మంత్రి హుమాయూన్ కబీర్ గురువారం ఓ వ్యాఖ్య చేశారు. ఉభయదేశాల ప్రయోజనాల రీత్యా ఈ పర్యటన కచ్చితంగా జరుగుతుందని, అయితే, సమయం కూడా కలిసిరావాలని అన్నారాయన. మొన్న శనివారం న్యూఢిల్లీలో ‘ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్’ (ఎఫ్‌సీసీ) నిర్వహించతలపెట్టిన ఓ సదస్సుకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, బంగ్లాదేశ్ నుంచి ఈ సానుకూల స్పందన వచ్చిందని మన మీడియా విశ్లేషిస్తోంది. రద్దయిన ఆ ఎఫ్‌సీసీ సదస్సులో అవామీలీగ్ అనుకూలురు కొందరు పాల్గొంటూ, అక్కడ విలేకరుల సమావేశం కూడా జరపబోతున్నందునే పోలీసులు దానిని అనుమతించలేదని వార్తలు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు బయటకు ఒప్పుకోకపోయినా, పర్మిషన్ కోసం ఎఫ్‌సీసీ సమర్పించిన పత్రం మీద తిలక్‌మార్గ్ పోలీసులు రాసిన వాక్యాలు కొన్ని ప్రచారంలోకి వచ్చాయి. ‘అందిన సమాచారం ప్రకారం, కొన్ని వివాదాల కారణంగా ఈ కార్యక్రమానికి అనుమతి లేదు’ అంటూ పోలీసులు ఈ సమావేశాన్ని అడ్డుకున్న విషయాన్ని బంగ్లాదేశ్ మీడియా విశేషంగా ప్రచారంలోకి తెచ్చి, భారత్ వైఖరిలో మార్పునకు నిదర్శనంగా అభివర్ణించింది కూడా.
ఎఫ్‌సీసీ సదస్సుకు ఢిల్లీ పోలీసులు అనుమతించకపోవడానికీ, తారీఖ్ రహ్మాన్ పర్యటనకూ ప్రత్యక్ష సంబంధం లేకపోవచ్చు. అయితే, ఆగస్టు 5న ఎఫ్‌సీసీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె కోసమే ఏర్పాటైన ఆ మీడియా సమావేశంలో హసీనా వర్చువల్‌గా పాల్గొంటారని ముందు అనుకున్నప్పటికీ, ఆమె ఒక ఆడియో సందేశం ద్వారా తన డిసెంబరు నాటి బంగ్లాదేశ్ పర్యటన గురించి విస్పష్ట ప్రకటన చేశారు. తాను పదవి కోల్పోవడానికి కారణమైన ఉద్యమం విద్యార్థులది కాదని, దాని వెనుక కొన్ని దుష్టశక్తులు, కుట్రలు ఉన్నాయని మరోమారు ఈ వేదిక ద్వారా ప్రపంచం ముందు వాపోయారు. ప్రస్తుత పాలకులు బంగ్లాదేశ్‌ను సర్వనాశనం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. హసీనా పాల్గొనబోతున్న ఈ మీడియా సమావేశం జరిగిన పక్షంలో భారత్ బంగ్లా సంబంధాలు మరమ్మతుకు కూడా పనికిరానంత దెబ్బతింటాయని బంగ్లాదేశ్ ముందస్తు హెచ్చరికలు చాలానే చేసింది. ఈవెంట్ జరగకుండా ఆపాలని పరోక్షంగా కోరినప్పటికీ, దానితో కానీ, నిర్వహిస్తున్న సంస్థతో కానీ, వ్యక్తమయ్యే అభిప్రాయాలతో కానీ తనకు సంబంధం లేదని భారత్ ప్రకటించి ఊరుకుంది. తన మనసులో ఉన్నదంతా హసీనా కక్కేసిన తరువాత బంగ్లాదేశ్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, తాము అభ్యంతరాలు తెలియపరిచినా భారత్ బేఖాతరు చేసిందంటూ తీవ్ర ఆగ్రహాన్ని ప్రకటించింది కూడా.
ఆగస్టు 5తో పోల్చితే, 29నాటి ‘యూరప్ అండ్ ఆసియా: ఫ్రమ్ డైలాగ్ టు పార్ట్‌నర్‌షిప్’ సదస్సు సాధారణమైనదే అయినా, భారత్ దానిని జరగనివ్వకపోవడం బంగ్లాదేశ్‌కు సహజంగానే నచ్చివుంటుంది. అనవసర రాద్ధాంతాలతో ఉభయదేశాల సంబంధాలు దెబ్బతినకూడదని భారత్ కోరుకుంటున్నట్టు బంగ్లా మీడియా వ్యాఖ్యానించింది. ఇటీవలే విదేశాంగశాఖ సహాయమంత్రిగా నియమితులైన హుమాయూన్ కబీర్ కూడా ఈ పరిణామాన్ని సానుకూలమైనదిగా అభివర్ణించారు. దీనితో, తారీఖ్ పర్యటనకు మార్గం సుగమమైనట్టేనా? అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు కానీ, ఆగస్టు 5నాటి మీడియా సమావేశం మాత్రం అప్పట్లో తారీఖ్ పర్యటన ప్రయత్నాల మీద ప్రభావం చూపినట్టుగా నర్మగర్భమైన వ్యాఖ్యలైతే చేశారు.
బలమైన పొరుగు దేశంతో సత్సంబంధాలు కొనసాగించడం బంగ్లాదేశ్‌కు అత్యవశ్యకమని బంగ్లా ప్రధానికి తెలియకపోదు. వాణిజ్యం, ఇంధనం, నీరు, విద్యుత్ ఇలా చాలా విషయాల్లో భారత్ మీద బంగ్లాదేశ్ ఆధారపడక తప్పదు. ప్రకృతివిపత్తులు సంభవిస్తే తక్షణమే రంగంలోకి దిగి సాయపడేది కూడా మనమే. అయితే, బీఎన్పీ సైద్ధాంతిక విధానాలవల్లా, స్వదేశంలో రాజకీయవాతావరణంతోనూ భారత్‌తో దూరం పాటిస్తున్నట్టుగా తారీఖ్ రహ్మాన్ వ్యవహరించవలసిందే. తనను ఘనంగా స్వాగతించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ఇటీవలి పరిణామాలు తారీఖ్ రహ్మాన్‌కు ఇప్పటికే స్పష్టమైన సందేశాన్ని అందించాయి. ఆగర్భశత్రువు హసీనాకు ఆశ్రయం ఇచ్చిన దేశంలో, తన దేశ ప్రయోజనాలకోసం ఎప్పుడు కాలుమోపాలో తేల్చుకోవాల్సింది ఆయనే.