Share News

‘సీఎం విజయ్’ ముందున్న సామాజిక కర్తవ్యం

ABN , Publish Date - Jul 11 , 2026 | 02:58 AM

తమిళనాడు రాజకీయాలంటే సామాజిక న్యాయం, స్వయం గౌరవం, వెనుకబడిన వర్గాల సాధికారత, కుల వ్యతిరేక పోరాటాలే గుర్తుకొస్తాయి. పెరియార్ నాయకత్వంలోని ద్రావిడ ఉద్యమం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని....

‘సీఎం విజయ్’ ముందున్న సామాజిక కర్తవ్యం

తమిళనాడు రాజకీయాలంటే సామాజిక న్యాయం, స్వయం గౌరవం, వెనుకబడిన వర్గాల సాధికారత, కుల వ్యతిరేక పోరాటాలే గుర్తుకొస్తాయి. పెరియార్ నాయకత్వంలోని ద్రావిడ ఉద్యమం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సవాలు చేసి, విద్య ఉద్యోగ అవకాశాలను విస్తరించి, వెనుకబడిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచింది. ఒక మౌలికమైన ప్రశ్న ఏమిటంటే– దశాబ్దాలుగా సాగిన ఈ ప్రయాణం కుల నిర్మూలన అనే అంతిమ లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకుంది? రాజకీయ అధికార మార్పు జరిగినంత మాత్రాన క్షేత్రస్థాయిలో సామాజిక సంబంధాలు మారిపోయాయా?

ఈ ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు తమిళనాడు సమాజంలోని వైరుధ్యాలు బయటపడతాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం దళితులపై నమోదైన అఘాయిత్య కేసులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కోర్టుల్లో వేలాది కేసులు పెండింగ్‌లో ఉండటం, శిక్షల శాతం తక్కువగా ఉండటం ఆందోళనకరం. ‘ఎవిడెన్స్’ వంటి సంస్థల అధ్యయనాలు గ్రామీణ తమిళనాడులో ఆలయ ప్రవేశంపై ఆంక్షలు, రెండు గ్లాసుల విధానం, వేర్వేరు శ్మశానాల వినియోగం వంటి రూపాల్లో అంటరానితనం ఇంకా సజీవంగానే ఉందని చూపిస్తున్నాయి. చట్టపరంగా నిషేధమైన వివక్ష సామాజిక ఆచారాల రూపంలో కొనసాగుతుండటం చూస్తుంటే, సమానత్వం కేవలం రాజకీయ నినాదంగానే మిగిలిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ సమస్యకు మూలాలు కేవలం రాజకీయ అధికారంలో మాత్రమే కాదు, గ్రామీణ భూ యాజమాన్యంలో ఉన్నాయి. గ్రామీణ సమాజంలో భూమి కేవలం ఆస్తి కాదు; అది ఆర్థిక శక్తికి, సామాజిక ప్రతిష్ఠకు, స్థానిక ఆధిపత్యానికి మూలాధారం. ద్రావిడ ఉద్యమం వల్ల బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గినప్పటికీ, గ్రామీణ ఆర్థిక, సామాజిక నిర్మాణాలు పూర్తిగా ప్రజాస్వామీకరణ కాలేదు. కావేరి డెల్టా, కొంగు ప్రాంతం, దక్షిణ తమిళనాడులోని కొన్ని ఆధిపత్య మధ్యస్థ/ వ్యవసాయ కులాల చేతుల్లోనే భూమి, స్థానిక అధికారం కేంద్రీకృతమయ్యాయి. అందువల్ల నేడు తమిళనాడులో జరుగుతున్న కుల ఘర్షణలు కేవలం అగ్రవర్ణాలు–దళితుల మధ్య కాకుండా, క్షేత్రస్థాయిలో ఆర్థిక, రాజకీయ శక్తి కలిగిన ఆధిపత్య ఓబీసీ వర్గాలు–దళితుల మధ్య జరుగుతున్నాయి. బ్రాహ్మణ వ్యతిరేకత ఒక్కటే కుల నిర్మూలనకు సరిపోదు; సమాజంలోని ప్రతి స్థాయిలో ఉన్న ఆధిపత్య నిర్మాణాలను ప్రశ్నించే ధైర్యం అవసరం.


ఈ సామాజిక న్యాయ చర్చ కేవలం ఎస్సీలు, ఓబీ‍సీలకే పరిమితం కాకూడదు. ఇరులర్, కట్టునాయకన్ వంటి గిరిజన సమాజాలు ఇప్పటికీ భూమి, అటవీ హక్కులు, విద్య, ఆరోగ్య రంగాల్లో తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయి. అలాగే కులాంతర వివాహాల విషయంలో ఒకవైపు సామాజిక చైతన్యం పెరుగుతున్నా, మరోవైపు గోకుల్‌రాజ్, శంకర్ వంటి ఘటనలు చూపించినట్లుగా హింసాత్మక ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది. ఈ వివక్షకు, హింసకు కేంద్రస్థానంలో దళిత, గిరిజన మహిళలు నిలుస్తున్నారు. వారు కులం, లింగం, ఆర్థిక అసమానతలు కలిసే కూడలిలో నలిగిపోతున్నారు. కాబట్టి సమానత్వాన్ని కేవలం రాజకీయ ప్రాతినిధ్యంతో కాదు, మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛతో మాత్రమే కొలవాలి.

కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్‌ ప్రభుత్వం చరిత్రలో నిలవాలంటే, కేవలం నినాదాలకే పరిమితం కాకుండా దశాబ్దాలుగా పరిష్కారం కాని ఈ నిర్మాణాత్మక సమస్యలపై యుద్ధం ప్రకటించాలి. అందుకు ఈ చర్యలు అవసరం. 1) భూమిలేని దళిత, గిరిజన కుటుంబాలకు భూ హక్కులు కల్పించాలి. బ్రిటిష్ కాలం నాటి ‘పంచమి భూముల’ ఆక్రమణలను తొలగించి, అసలు లబ్ధిదారులకు అప్పగించాలి. 2. దళిత, గిరిజన యువత కేవలం వ్యవసాయ కూలి పనులపై ఆధారపడకుండా వారికి విజ్ఞాన ఆధారిత రంగాలలో శిక్షణ ఇవ్వాలి. స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమల స్థాపనకు పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడాలి. 3. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు సమర్థమైన రక్షణ, పునరావాసం, ఉచిత న్యాయ సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను నిర్మించాలి. 4. ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాల విచారణ కోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను బలోపేతం చేసి, ఏడాది లోపే శిక్షలు పడేలా చూడాలి. వివక్షపై స్పందించని స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 5. గ్రామస్థాయిలో కుల వివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణలను పర్యవేక్షించడానికి సమర్థ అధికారాలు గల సామాజిక నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలి. విద్యాసంస్థల్లో నైతిక విలువలతో కూడిన సామాజిక స్పృహను బోధించాలి. వీటితో పాటు మిగతా కులాల ప్రజలకు సోదరభావం పెంచే బలమైన అవగాహన కల్పించాలి.

ముఖ్యమంత్రులు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ భూమి యాజమాన్యం, గ్రామీణ శక్తి నిర్మాణాలు, సామాజిక ప్రతిష్ఠ, వివాహ సంబంధాలు మారనంత వరకు సామాజిక విప్లవం పూర్తి కాదు. అధికారం మారిందా? లేక సమాజం మారిందా? అనే ప్రశ్నకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇచ్చే పాలనాపరమైన సమాధానమే ఆయన రాజకీయ భవిష్యత్తును, తమిళనాడు సామాజిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

పాపని నాగరాజు

సత్యశోధక మహాసభ

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 02:58 AM