Share News

పరుగుల పండుగ

ABN , Publish Date - Feb 07 , 2026 | 02:18 AM

పిడుగుల్లాంటి సిక్సర్లు, ఫోర్ల్లు.. బుల్లెట్లలా దూసుకొచ్చే బంతులు.. మెరుపుల్లాంటి క్యాచ్‌లతో హోరెత్తిపోయే టీ20 పండగ వచ్చేసింది.

పరుగుల పండుగ

పిడుగుల్లాంటి సిక్సర్లు, ఫోర్ల్లు.. బుల్లెట్లలా దూసుకొచ్చే బంతులు.. మెరుపుల్లాంటి క్యాచ్‌లతో హోరెత్తిపోయే టీ20 పండగ వచ్చేసింది. భారత్‌, శ్రీలంక ఆతిథ్యంలో నేటినుంచి వచ్చేనెల ఎనిమిది వరకు జరిగే విశ్వక్రీడా సంరంభానికి రంగం సిద్ధమైంది.

20 జట్లు, 55 మ్యాచ్‌లతో ఈసారి జరగబోతున్నది పదో ప్రపంచకప్‌. గత టోర్నీ విజేత భారత్‌ మరోసారి టైటిల్‌ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. దాయాది జట్లు భారత్‌, పాకిస్థాన్‌తో పాటు అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియా గ్రూప్‌–ఎ నుంచి పోటీలో ఉన్నాయి. మరో ఆతిథ్య జట్టు శ్రీలంక, పటిష్ఠ ఆస్ట్రేలియా గ్రూప్‌–బి నుంచి, మాజీ విజేతలు ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ గ్రూప్‌–సి తరఫున అమీతుమీకి సిద్ధమయ్యాయి. తొలి కప్పు కోసం ఎన్నాళ్లుగానో నిరీక్షిస్తున్న న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా గ్రూప్‌–డిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇదే గ్రూప్‌ నుంచి సంచలనం సృష్టించేందుకు అఫ్ఘానిస్థాన్‌ సిద్ధంగా ఉంది. ప్రారంభ టీ20 ప్రపంచకప్‌ జరిగిన 2007లో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా, తర్వాతి కాలంలో ఆ స్థాయి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. 2014 ఫైనల్లో పరాజయం పాలైంది. 2022లో సెమీఫైనల్‌ దశలోనే నిష్క్రమించింది. తదనంతరం అద్భుతంగా పుంజుకొన్న భారత జట్టు రెండేళ్ల క్రితం రోహిత్‌ శర్మ సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచి రెండోసారి కప్‌ను ఖాతాలో వేసుకుంది. గత టోర్నీలో జట్టును విశ్వవిజేతగా నిలబెట్టిన రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఈమారు సూర్యకుమార్‌ నేతృత్వంలో భారత జట్టు కప్‌ వేటను ఆరంభించనుంది.


ఈ దఫా పోటీల ఆరంభానికి ముందే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఇందులో అత్యంత చర్చనీయాంశమైన అంశం బంగ్లాదేశ్‌ జట్టు బహిష్కరణ. టోర్నీ ముందస్తు షెడ్యూలు ప్రకారం గ్రూప్‌–ఎలో ఉన్న బంగ్లాదేశ్‌ జట్టు.. తన గ్రూప్‌ దశ మ్యాచ్‌లను భారత్‌లో ఆడాలి. కానీ, భద్రతా కారణాల సాకు చూపుతూ ఆ జట్టు భారత్‌లో ఆడేందుకు నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని కోరింది. అందుకు ఐసీసీ తిరస్కరించడంతో, భారత్‌కు వచ్చేదే లేదంటూ మొండిపట్టు పట్టింది. దీంతో బంగ్లాను టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది. బంగ్లా ఇంతలా మంకు పట్టడానికి కారణం.. ఆ దేశ క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి తప్పించడం. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. బంగ్లా ఆటగాడిని ఐపీఎల్‌కు ఎంపిక చేయడంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీసీసీఐ ఆదేశాల మేరకు నైట్‌రైడర్స్‌ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదలచేసి బంగ్లాకు పంపించింది. ప్రతిగా తమ జట్టును టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కు పంపేది లేదని బంగ్లాదేశ్‌ హూంకరించడంతో ఆ దేశ జట్టు మెగా టోర్నీలో చోటు కోల్పోక తప్పలేదు. టోర్నీ నుంచి బంగ్లా వైదొలగడంతో పాకిస్థాన్‌ కూడా భారత్‌పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. బంగ్లాదేశ్‌పై వేటుకు నిరసనగా తాము భారత జట్టుతో ఆడబోమని టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే తదుపరి కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ పాక్‌ క్రికెట్‌ బోర్డును ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. అయినా ఆ జట్టు వైఖరిలో ఎలాంటి మార్పు కానరావడం లేదు. ఈ దశలో షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15న కొలంబో వేదికగా భారత్‌, పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్న సందిగ్ధత క్రికెట్‌ వర్గాల్లో నెలకొంది.


తామైతే యథావిధిగా ఆ రోజు మ్యాచ్‌ కోసం కొలంబోకు టిక్కెట్లు కూడా బుక్‌ చేసుకున్నామని టీమిండియా సారథి సూర్యకుమార్‌ ప్రకటించాడు. మరి.. ఆ మ్యాచ్‌కు పాకిస్థాన్‌ హాజరుకాకపోతే నిబంధనల ప్రకారం గెలుపు పాయింట్లను భారత్‌కు కేటాయిస్తారు. ఒకవేళ సెమీఫైనల్‌.. లేదంటే ఫైనల్లో ప్రత్యర్థిగా భారత్‌ ఎదురైతే అప్పుడు కూడా మ్యాచ్‌ను బహిష్కరిస్తారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు పాక్‌ జట్టు నుంచి సమాధానం లేదు. పాక్‌ జట్టు తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటే, బంగ్లా జట్టు తరహాలో కోలుకోలేని నష్టాన్ని చవిచూడక తప్పదు. ఇక, సీనియర్ల వరల్డ్‌కప్‌కు అంతా సిద్ధమైన ఈ తరుణంలో భారత అండర్‌–19 కుర్రాళ్లు అదరగొట్టే విజయంతో ట్రోఫీని కైవసం చేసుకున్నారు. మన కుర్రాళ్లు ప్రపంచకప్‌ను గెలవడం ఇది ఏకంగా ఆరోసారి. ఈ విజయం స్ఫూర్తితో సీనియర్లు కూడా వరల్డ్‌కప్‌ను గెల్చుకొస్తారని ఆశిద్దాం.

Updated Date - Feb 07 , 2026 | 02:29 AM