సస్పెన్షన్ సరిపోదు!
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:18 AM
ప్రభుత్వ పాఠశాలలు విద్యాబుద్ధులు నేర్పే ఆలయాలుగా కాకుండా కొందరు ఉపాధ్యాయుల వల్ల వెకిలిచేష్టలకు నిలయాలుగా మారుతుండటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం.
ప్రభుత్వ పాఠశాలలు విద్యాబుద్ధులు నేర్పే ఆలయాలుగా కాకుండా కొందరు ఉపాధ్యాయుల వల్ల వెకిలిచేష్టలకు నిలయాలుగా మారుతుండటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. నారాయణపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ పాఠశాలలో విలువలు నేర్పాల్సిన టీచర్ కంప్యూటర్ ల్యాబ్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థినిని అమాంతం ముద్దు పెట్టుకోవాలని చూడటం అమానుషం. సీసీటీవీ ఫుటేజీలో ఈ అసభ్య ప్రవర్తన బయటపడటంతో డీఈఓ సస్పెన్షన్ వేటు వేశారు కానీ అది సరిపోతుందా? ఇలాంటి ఘటనలు ఒక్క నారాయణపేటకే పరిమితం కాలేదు. గతంలో నిర్మల్ జిల్లా నర్సాపూర్ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల కీచక పర్వం సాగించి పోక్సో కేసులకు గురయ్యారు. తాజాగా నిర్మల్ రూరల్ పరిధిలోని కొండాపూర్ పాఠశాల విద్యార్థినులపై కూడా ఒత్తిడి తెచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. వరుసగా ఇన్ని ఉదంతాలు వెలుగుచూస్తున్నాయంటే కీచక గురువులకు చట్టం అన్నా వ్యవస్థ అన్నా భయం లేకుండా పోయిందని స్పష్టమవుతోంది. ఇలాంటి అకృత్యాలు జరిగినప్పుడు సస్పెన్షన్ కాకుండా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగిస్తే కాని వారికి బుద్ధి రాదు. పాఠశాలలకు తమ పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతి పాఠశాలలో విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతిరోజూ పర్యవేక్షించాలి. కీచక గురువులపై విచారణను వేగవంతం చేసి వారిని కఠిన కారాగారానికి పంపాలి. వారిని ప్రభుత్వ సర్వీసు నుంచి శాశ్వతంగా బహిష్కరించాలి.
– వెంకగారి భూమయ్య