నిలదీస్తేనే మార్పు!
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:25 AM
ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ నాయకులు హామీల వర్షం కురిపిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు నిత్యం వందలాది సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.
ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ నాయకులు హామీల వర్షం కురిపిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు నిత్యం వందలాది సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. గుంతలమయమైన రోడ్లు, తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా, ఆధునిక వసతులు లేని ఆసుపత్రులు వంటి ప్రాథమిక అవసరాల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తోంది. ఇవేగాక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరడంలో మధ్యవర్తులు, అవినీతి అధికారులు అడ్డుగోడలుగా మారుతున్నారు. పేదల ఆకలి తీర్చడానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి కేటాయించిన నిధులు దారి మళ్లుతున్నాయి. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం రాజకీయ నాయకుల ప్రాథమిక కర్తవ్యం. ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేశాడు, ఎంతమందికి ఉపాధి కల్పించాడు, పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలపై నిరంతరం సమీక్షించుకోవాలి. ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించాలి. ఓటు వేయడంతో బాధ్యత తీరిపోయిందని భావించకూడదు. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి నిధులు ఎక్కడ ఖర్చవుతున్నాయో ప్రశ్నించాలి. సోషల్ మీడియాను వినోదం కోసం కాకుండా, సామాజిక మార్పు కోసం వాడాలి. నాయకులను నిలదీసే ధైర్యం ప్రజల్లో వచ్చినప్పుడే రాజకీయాల్లో మార్పు మొదలవుతుంది. పనిచేయని నాయకులను పదవీకాలం ముగియక ముందే వెనక్కి పిలిచే ‘రైట్ టు రీకాల్’ వంటి విప్లవాత్మక మార్పులపై చర్చ జరగాలి. రాజకీయాల్లోకి విద్యావంతులు, సేవా దృక్పథం ఉన్న యువత రావాలి. కులం, మతం, డబ్బు చూసి ఓటు వేసే సంస్కృతి నుంచి ప్రజలు బయటపడాలి.
– సూర్యదేవర రామకృష్ణ