Share News

‘సురవరం’: తెలుగు సాహిత్య సరోవరం

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:26 AM

తెలుగు సారస్వత క్షేత్రంలో పసిడి పంటలు పండించిన అక్షర కృషీవలుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కృషి చేసిన మహనీయుడు.

‘సురవరం’: తెలుగు సాహిత్య సరోవరం

తెలుగు సారస్వత క్షేత్రంలో పసిడి పంటలు పండించిన అక్షర కృషీవలుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కృషి చేసిన మహనీయుడు. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఆయనది. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి.

మద్రాస్‌ కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ప్రతాపరెడ్డిపై పడింది. నిజాం రాష్ట్రాంధ్ర దుస్థితి రూపురేఖలను మార్చాలన్న తపన ఆనాటి నుంచే సురవరం మనస్సులో నాటుకుపోయింది. నిద్రాణమైన తెలుగు జాతిని తట్టి లేపేందుకు గోల్కొండ పత్రికను సురవరం స్థాపించారు. ఈ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. దాంతో నిజాం ఆగ్రహించి, సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలనే నిబంధన తెచ్చాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాపరెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించారు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.


సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాదు కొత్వాల్‌గా ఉన్న రాజబహదూర్‌ వేంకటరామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ పనిచేసిన దశాబ్ది కాలంలో విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు. వేయి గ్రంథాలున్న హాస్టల్‌ లైబ్రరీని 11 వేల గ్రంథాల వరకు పెంచి, విద్యార్థులలో భాషాభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 మంది కవులతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి, గ్రంథ రూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో ఆయన నిష్ణాతులు. గోల్కొండ పత్రికకు అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశారు. తెలంగాణ గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖ పాత్ర వహించారు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించారు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు. జీవితం చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

1953 ఆగస్టు 25న సురవరం మరణించారు. ఆ తరువాత రెండేళ్లకు 1955లో ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచనకు గానూ ఆయనకు ‘కేంద్ర సాహిత్య అకాడమి’ అవార్డును ప్రకటించారు. తెలుగుజాతికి సురవరం చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతాపరెడ్డి పేరిట సాహితీవేత్తలకు అవార్డులు ఇవ్వాలి. ఆయన జన్మించిన గద్వాల జిల్లాకు సురవరం ప్రతాపరెడ్డి జిల్లాగా పేరు మార్చాలి.

- కామిడి సతీశ్‌రెడ్డి

Updated Date - Aug 25 , 2026 | 12:28 AM