వందేళ్ళ స్ఫూర్తి సంకేతం
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:14 AM
తెలంగాణ నేలపై గోలకొండ పత్రిక వెలువడి ఈ ఏడాదికి వందేళ్లవుతోంది. 1926 నుంచి 1966 వరకు తొలుత అర్ధవార పత్రికగా, ఆ తర్వాత దినపత్రికగా నాలుగు దశాబ్దాలపాటు..
తెలంగాణ నేలపై గోలకొండ పత్రిక వెలువడి ఈ ఏడాదికి వందేళ్లవుతోంది. 1926 నుంచి 1966 వరకు తొలుత అర్ధవార పత్రికగా, ఆ తర్వాత దినపత్రికగా నాలుగు దశాబ్దాలపాటు ప్రచురితమవుతూ అప్పటి తెలంగాణ జన జీవనాన్ని నమోదు చేసింది. ఈ నలభై ఏళ్ల కాలంలో తెలంగాణలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఈ కాలంలోనే ఆంధ్ర జనసభ, ఆ తర్వాత ఆంధ్ర మహాసభ స్థాపన జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల విస్తరణ జరిగింది. భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామిలాంటి నేతలు దళిత జనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. కొమురం భీం నాయకత్వాన సాయుధ పోరాటం, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వీరోచిత రైతాంగ సాయుధ పోరాటం నడిచాయి. యూనియన్ సైన్యాలకు నిజాం లొంగుబాటు, రెండేళ్ల తర్వాత ఎన్నికల ద్వారా ప్రజా ప్రభుత్వ ఏర్పాటు జరిగాయి. అంతేగాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలన్న ఆందోళనలు, హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల విలీనం కూడా ఈ సమయంలోనే జరిగాయి. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమైన పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనలు ఈ కాలంలోనే చోటుచేసుకున్నాయి. ఇలాంటి అనేక చారిత్రక ఘటనలను గోలకొండ పత్రిక రికార్డు చేసింది.
నిజాం పాలనలో ఉర్దూ, మరాఠీ భాషాధిపత్యంతో తెలుగువారి అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతిని నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం పురుడు పోసుకున్నాక.. ఆ సంస్థ కార్యక్రమాల ప్రచారం కోసం, తెలుగు భాషా సేవ కోసం 1922లో నల్లగొండ కేంద్రంగా షబ్నవీస్ వెంకటరామనరసింహారావు ఆధ్వర్యంలో ‘నీలగిరి’, ఆ తర్వాత ఇనుగుర్తి నుంచి ఒద్దిరాజు సోదరుల ఆధ్వర్యంలో ‘తెనుగు పత్రిక’లు వారపత్రికలుగా వెలువడ్డాయి. ఈ పత్రికల నిర్వహణ కష్టంగా ఉన్న సమయంలో తెలంగాణ సాంస్కృతిక పునురుజ్జీవానికి, పునర్వికాసానికి దోహదపడేందుకు ‘గోలకొండ’ పత్రిక 1926 మే 10న ప్రారంభమైంది. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సురవరం ప్రతాపరెడ్డి అప్పటి హైదరాబాద్ కొత్వాల్ (సిటీ పోలీస్ కమిషనర్) రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో ఈ పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు.
పత్రిక తొలి సంచికలో సురవరం ప్రతాపరెడ్డి ‘స్వవిషయం’ పేర రాసిన వ్యాసంలో నాటి పత్రికా రంగం పరిస్థితి స్పష్టంగా అవగతమవుతుంది. ‘‘అనేక విఘ్న ప్రతిబంధముల కోర్చి యెట్టకేలకు గోలకొండ పత్రికనాంధ్ర జనులకు సమర్పించుకొనగలిగితిమి. ఇదివరకే విన్నవించిన రీతి పత్రిక యొక్క ముఖ్యోద్దేశం జన సేవయే గానీ తదితరమేదీయు గాదు. ప్రస్తుతం నిజాం రాష్ట్రమునకు 65 లక్షల కన్నానెక్కువగా ఆంధ్రులుండగా రెండు వార పత్రికలు మాత్రమే ఉండుట గొప్ప లోటు. ఒక చిన్న తిరువాన్కూర్ సంస్థాన మందు నూర్లకొలది నానావిధ పత్రికలుండ హైదరాబాద్ లోని యాంధ్రులకై మూడో పత్రిక ప్రచారం చేసినందులకు మేం చింతింపము’’ అని పేర్కొన్నారు.
నిజాం రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజా చైతన్యాన్ని రగలించడం, తర్వాత కాలంలో దానికి నాయకత్వం వహించడంలో ఆంధ్ర మహాసభ నిర్వహించిన పాత్ర అపూర్వమైంది. తెలంగాణ ఆంధ్రమహాసభ తొలి సమావేశం మెదక్ జిల్లా జోగిపేటలో నిర్వహించగా, సభకు గోలకొండ పత్రిక సంపాదకుడిగా ఉన్న సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రతాపరెడ్డి ఈ ఉద్యమానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం వల్ల సహజంగానే గోలకొండ పత్రిక ఆంధ్ర మహాసభకు ఒక ప్రచార సాధనంగా పనిచేసింది. అందుకే ఆంధ్ర మహాసభలో జరిగిన ప్రతి పరిణామం, ప్రతి సమావేశం, తీర్మానం ఈ పత్రికలో వార్తలుగా మారాయి. వెట్టిచాకిరీ, కొన్ని సాంఘిక దురాచారాలు, మామూళ్లు, ప్రభుత్వాధికారుల జులుం, గ్రంథాలయోద్యమం, రాత్రి పాఠశాలలపై ప్రత్యేక వ్యాసాలు, వార్తలు వచ్చాయి. గోలకొండ పత్రికలో అప్పటికే మద్రాస్ నుంచి వెలువడుతున్న కృష్ణా, ఆంధ్ర పత్రికల తరహాలోనే గ్రామ స్థాయి వార్తలు మొదలు అంతర్జాతీయ వార్తల వరకు ప్రాచుర్యం కల్పించారు. జాబులు శీర్షికతో పాఠకులు గోలకొండ సంపాదకుడికి లేదా నిజాం ప్రభువుకు సమస్యలపై చేసిన విజ్ఞాపనలను ప్రచురించేవారు. అలాగే స్థానిక వృత్తాంతములు, తెలంగానా వార్తలు, రాష్ట్రీయ వార్తలు, పల్లెటూరి ప్రజల నివేదనం, గ్రామ సమాచారములు అనే శీర్షికల కింద గోలకొండ పత్రిక విలేఖరులు, పాఠకులు రాసిన వార్తలను అచ్చువేసేవారు.
శిథిలదశలో ఉన్న తాళపత్ర గ్రంథాలతోపాటు కాలగర్భంలో కలిసిపోయే అవకాశమున్న శాసనాల పరిరక్షణను కూడా గోలకొండ పత్రిక భుజానికెత్తుకుంది. గుప్తంగా ఉన్న చరిత్రను బయటితీసేందుకు ఇతోథికంగా కృషి చేసింది. ‘ఆంధ్ర విజ్ఞాన ప్రియులకు విజ్ఞాపనం’ శీర్షికతో తాళపత్ర గ్రంథాల సేకరణ కోసం సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికలో రాసిన వ్యాసం ఆలోచింపచేస్తుంది. 1927 మే 28న శేషాద్రి రమణకవులు తాళపత్ర గ్రంథాల సేకరణ, శాసనాల పరిశోధనకు మహబూబ్‌నగర్‌కు ప్రయాణమైనట్లు వార్తను ప్రచురించడం, వారికి జిల్లాలోని పండితులు సహకరించాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేయడం తెలంగాణ చరిత్ర పరిశోధనకు ఆ పత్రిక ఎంత బాధ్యతాయుతంగా పని చేసిందో అర్థమవుతుంది. గోలకొండ పత్రికలో చరిత్ర, పరిశోధనకు సంబంధించి లభిస్తున్న వ్యాసాల్లో ప్రధానంగా కాకతీయుల పాలన విశేషాలు, తెలంగాణలో ప్రముఖ పట్టణాలు, గ్రామాల చారిత్రక నేపథ్యం, ఆలయాల స్థల పురాణాలు, ప్రాచీన కాలం నాటి శాసనాలు, కోటలు, దుర్గాల చరిత్ర, పరిశోధన చేస్తున్న వ్యక్తులు, సంస్థల కృషి తదితర అంశాలు కనిపిస్తాయి. తెలంగాణలోని లక్ష్మణరాయ పరిశోధక మండలి, వరంగల్ కేంద్రంగా స్థాపితమైన ఆంధ్ర చారిత్రక పరిశోధక మండలి ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలను గోలకొండ పత్రిక ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ తెలంగాణ ప్రజలు తమ ప్రాంత చరిత్రను తెలుసుకునేలా చేసింది.
1930వ దశకంలో బాల్య వివాహాలకు మద్దతుగా సనాతనుల సభలు, సమావేశాలు, వారి వాదనలను ‘దివ్యవాణి’ అనే పత్రిక ఎక్కువగా ప్రచారం చేసేది. ఇందులో వచ్చే వ్యాసాలను ఖండిస్తూ రాసిన అభిప్రాయాలు గోలకొండ పత్రికలో అచ్చయ్యేవి. హిందూ మతంలోని కుల వ్యవస్థలోని రుగ్మతలను గురించి చెప్పిన సురవరం ప్రతాపరెడ్డి ప్రపంచంలోని అన్ని మతాల గుట్టును కూడా విప్పారు. ‘మతము వలన ప్రపంచమునకు ఏమి లాభం?’ (1932, అక్టోబర్ 22) శీర్షికతో ఆయన వ్యాసం రాశారు. దేవుడి పేర వంచించుటే కాదు.. బెదిరింపులకు కూడా దిగుతున్నారని ఆ వ్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘అసహనం’ గురించి జరుగుతున్న చర్చ మనందరికీ తెలిసిందే. సురవరం ప్రతాపరెడ్డి 90 ఏళ్ల ఆ చర్చను ప్రారంభించాడంటే ఆశ్చర్యం కలగకమానదు.
‘నిజాం రాష్ట్రమునందు ఆంధ్ర కవులే పూజ్యము’ అంటూ గోలకొండ భావ సంవత్సరాది సంచికలో ముడుంబై వెంకటరాఘవాచార్యులు అనే రచయిత తన వ్యాసంలో చేసిన ప్రకటనకు సమాధానంగా, తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటనగా 354 మంది కవుల కవిత్వంతో గోలకొండ కవుల సంచిక వెలువడిన విషయం తెలిసిందే. తెలంగాణ సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచిన గోలకొండ కవుల సంచికను తీసుకురావాలన్న సురవరం ప్రతాపరెడ్డి ఆలోచనకు గోలకొండ పత్రికే వేదికగా మారింది. ఈ సంచికకు సంబంధించిన పనులన్నీ హైదరాబాద్ ట్రూప్ బజార్ లోని గోలకొండ పత్రిక కార్యాలయం కేంద్రంగానే సాగాయి. అంతేగాక సాహిత్య చరిత్రలలో తెలంగాణ సాహిత్యానికి దక్కని చోటు గురించిన ఆందోళన, ఆలోచనలకు ప్రారంభం కూడా ఆయనే. కురుగంటి సీతారామయ్య సంపాదకత్వంలో వచ్చిన ‘నవ్యాంధ్ర సాహిత్య వీధులు’ సమీక్ష ద్వారా ఆయన ఆ పని ప్రారంభించారు.
నిజాం పాలన తర్వాత తెలంగాణ నుంచి కథలు పెద్దగా రాలేదని, 1970 నుంచే విస్తృతంగా వచ్చిందనే అవగాహన కొందరు సాహిత్యకారుల్లో ఉంది. కానీ సాహిత్యంలో స్తబ్ద కాలంగా పరిగణించబడుతున్న 1955–66 మధ్య పదేళ్ల కాలంలో 224 స్వతంత్ర కథలు గోలకొండ పత్రికలో అచ్చవడం విశేషం. గోలకొండ పత్రికలో 333 స్వతంత్ర కథలు, 82 అనువాద కథలు 82 కలిపి 415 కథలు కనిపించాయి. స్వతంత్ర కథల్లో 21 మాత్రమే మహిళలు రాసినవి ఉన్నాయి. తెలుగులో ఇప్పటి వరకు ‘వెట్టి మాదిగ’ (1931, భాగ్యనగర్ పత్రిక) కథ రాసిన భాగ్యరెడ్డి వర్మను తొలి దళిత కథకుడిగా చెప్పుకుంటున్నాం. కానీ అంతకుముందే యానంకు చెందిన శ్రీనివాసులు అనే దళిత విద్యార్థి దళిత సమస్యపై రాసిన ‘నేరేడు పండ్లకంటు’ అనే కథ 1928 ఫిబ్రవరి 15న గోలకొండ పత్రికలో ప్రచురితమైంది. గోలకొండ పత్రికపై నేను చేసిన పరిశోధనలో 22 జానపద గేయాలు, 156 పద్య కవితా ఖండికలు, 228 వచన కవితలు, 22 అనువాద కవితలు కలిపి మొత్తం 384 కవితలు గుర్తించాను.
తెలంగాణలో గ్రంథాలయోద్యమం, ఆంధ్రోద్యమం జమిలిగా నడిచాయి. వాటితోపాటు గోలకొండ పత్రిక కూడా కలిసే నడిచింది. అందువల్ల పై రెండు ఉద్యమాలను గురించిన సమాచారాన్ని ఈ పత్రిక చాలా వరకు నమోదు చేసింది. స్త్రీ సమస్య, కుల సమస్య 1920ల నాటికే తెలంగాణలో చర్చనీయాంశాలు. సామాజిక దురాచారాలు, అస్పృశత, మద్యపానం, వెట్టిచాకిరీ విధానంపట్ల వ్యతిరేకత నుంచి గోలకొండ పత్రికలో వచ్చిన కవిత్వం తెలంగాణలో సంస్కరణోద్యమం లేదనుకొనే వారికి గట్టి సమాధానమిస్తాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత 1966 వరకు చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తెలంగాణ నేతలకు తగ్గుతూ వచ్చిన ప్రాధాన్యం ఈ పత్రికను చదివితే అర్థమవుతుంది. తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర రచనతోపాటు రాజకీయ, సామాజిక చరిత్ర రచనకు గోలకొండ పత్రిక సారవంతమైన వనరు. ఈ పత్రిక నిర్వహణ ద్వారా సురవరం ప్రతాపరెడ్డి వందేళ్ళ క్రితం నెలకొల్పిన విలువలు, ప్రమాణాలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయి.
- నుగ్గునూతుల యాకయ్య
8919913723