Supreme Court: బాధ్యతారాహిత్యం
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:45 AM
ఢిల్లీ కాలుష్యానికి కారణాలు కనిపెట్టనందుకు కమిషన్ ఫర్ ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)ను మంగళవారం సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
ఢిల్లీ కాలుష్యానికి కారణాలు కనిపెట్టనందుకు కమిషన్ ఫర్ ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)ను మంగళవారం సుప్రీంకోర్టు తప్పుబట్టింది. గ్యాస్‌చాంబర్‌లాగా తయారైన ఢిల్లీని కాలుష్యం బారినుండి కాపాడాలన్న సంకల్పం ఈ సంస్థకు లోపించిందని, కారణాలు, పరిష్కారాలతో రెండువారాల్లోగా తనముందు ఉండాలని కోర్టు గట్టిగా చెప్పింది. పొరుగురాష్ట్రాలనుంచి ఢిల్లీ వచ్చే భారీ వాహనాలు గంటలతరబడి టోల్‌ప్లాజాల దగ్గర వేచివుండటం కూడా కాలుష్యానికి కారణమవుతున్నందున వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని కోర్టు సూచించింది. తరలించాలా లేక తాత్కాలికంగా మూసేయాలా అన్నది నిర్ణయించడానికే ఓ రెండు నెలలు పడుతుందని కమిషన్ చెప్పడంతో న్యాయమూర్తులకు కోపం వచ్చింది. మాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న టోల్‌ప్లాజాల జోలికిపోవద్దన్న రీతిలో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, గుర్‌గ్రామ్ డెవలప్‌మెంట్ అథారిటీ అఫిడవిట్లు సమర్పించినందుకు కూడా వారికి ఆగ్రహం కలిగింది. పొల్యూషన్‌కు పరిష్కారం సాధించాల్సిన వ్యవస్థలూ సంస్థలూ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని చీఫ్‌జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ ధర్మాసనం అభిప్రాయపడింది. రాజకీయ ప్రయోజనాలకోసం ఏదో సమస్యని సృష్టించి, విద్వేషాన్ని రగల్చి ప్రజల జీవితాలని అతలాకుతలం చేయగల ఘటనాఘటన సమర్థులైన పాలకులకు ఈ వాయుకాలుష్యం కార్యకారణసంబంధాల గురించి తెలియదని ఎవరైనా నమ్ముతారా?
ఢిల్లీలో కాలుష్యం తగ్గాలంటే కార్లు తగ్గాలి, ఒకరికి ఒకటే కారు నిబంధన ఉంటే కాలుష్యం కాస్త తగ్గచ్చు అన్నారట న్యాయవాది. జనం దృష్టిలో కారు స్టేటస్ సింబల్ అయిపోయింది, సైకిళ్ళు తొక్కడం మానేశారు, ధనవంతులు కాస్తంత త్యాగం చేసి, ఖరీదైన కార్ల బదులు విద్యుత్ వాహనాలు కొంటే ఉత్తమం అన్నారట చీఫ్‌జస్టిస్. ఇదే వేడిమీద, కార్ల అమ్మకాలు కొనుగోళ్ళను నియంత్రించడం గురించి కూడా రేపటిరోజుల్లో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఎంతో బాగుంటుంది. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత శక్తిమంతంగా తయారైందన్న న్యాయవాది వ్యాఖ్యలోనే అసలు నిజం ఉంది. వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణరంగం ఢిల్లీ ఉక్కిరిబిక్కిరికి ప్రధాన కారణాలని అందరికీ తెలుసు. సవివరమైన డేటాతో నిపుణులు వ్యాసాలు రాస్తున్నారు, మీడియా సైతం చర్చోపచర్చలు చేస్తోంది. కమిషన్ ఫర్ ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఏర్పాటై కూడా ఐదేళ్ళు దాటింది కనుక, దాని దగ్గర తగినంత సమాచారం లేదని అనుకోలేం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విశ్లేషించడంలో, వ్యవహరించడంలో ఎందుకంత జాప్యం జరుగుతోందో తెలియదు.
కాలుష్యనివారణ పేరిట చలికాలంలోనే హడావుడి చేసి, తరువాత సమస్యను వదిలివేయడం వల్లనే పదేళ్ళుగా అవే బాధలు అనుభవించవలసి వస్తోంది. శ్వాససంబంధిత సమస్యలతో, తీవ్ర జ్వరాలతో ఢిల్లీ పౌరులు ఆస్పత్రుల పాలవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి కూడా ఈ బాధ తప్పలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభమైననాడే ఢిల్లీ కాలుష్యం మీద సభలో చర్చజరగాలని ఆమె పట్టుబట్టారు. ఇది రాజకీయాంశం కాదని, ప్రభుత్వం చర్చకు గనుక సిద్ధపడితే చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఢిల్లీ సహా అన్ని ప్రధాన నగరాల్లో కోట్లాదిమంది ఉసురుతీస్తున్న కాలుష్యం మీద రాజకీయాలకు అతీతంగా సభలో చర్చించి, సమష్టి నిర్ణయాలు చేద్దామంటూ రాహుల్ సభాముఖంగా అభ్యర్థించినప్పటికీ, కేంద్రప్రభుత్వం ఊరుకుంది. వందేమాతరం మీద చర్చ పేరిట లోక్‌సభలో 11గంటలు, రాజ్యసభలో 13గంటలు గతాన్ని తవ్విపోయడానికే అధికారపక్షం ప్రాధాన్యం ఇచ్చింది.
ప్రతీ ఢిల్లీవాసీ ముప్పైఐదు సిగరెట్లు తాగినంత విషప్రభావాన్ని దిగమింగుతున్నాడట. వాయుకాలుష్యాన్ని దేశరాజధాని శీతాకాలంలోనే చవిచూస్తున్నట్టుగా కనిపిస్తున్నా, తీవ్రతలో కాస్తంత తేడాపాడాలతో ఏడాది అంతా అది కాలుష్యంలోనే మగ్గుతోంది. వాహన, పారిశ్రామిక, నిర్మాణరంగ కాలుష్యాలను నియంత్రించేపని నిరంతరం సాగాల్సిన అవసరం ఢిల్లీలో ఉంది. ఉన్నతస్థాయి పర్యవేక్షణతో, అన్ని విభాగాల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యం. బీజింగ్ వంటి ప్రధాన నగరాల్లో ఇంతకుమించిన భయానకమైన కాలుష్యంతో పోరాడిన చైనా పదేళ్ళకాలంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించింది. వాయుకాలుష్యానికి దారితీసే ఏ చిన్నదారినీ అది వదల్లేదు. ఢిల్లీ కాలుష్యంమీద నిరవధికంగా, నిరంకుశంగా, నిర్దాక్షిణ్యంగా పోరాడటానికి పాలకులు ఇప్పుడు సంకల్పిస్తే, కనీసం కొంతకాలానికైనా పరిస్థితులు కాస్తంత మెరుగుపడతాయి.