ఖనన హక్కుల కోసం కోర్టు మెట్లు!
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:13 AM
సమస్యలు, గొడవలు సాధారణంగా బతికున్న మనుషులకే ఉంటాయి. అయితే ప్రస్తుతం భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల మృతదేహాలు ప్రాథమిక హక్కు కోసం పోరాటం చేస్తున్నాయి!
‘ఒక వ్యక్తి చనిపోయాక– ఆ వ్యక్తి బతికున్నప్పుడు పాటించిన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరపటం కూడా జీవించే హక్కు పరిధిలోకి వస్తుంది’ అని సుప్రీంకోర్టే గతంలో పలుమార్లు చెప్పింది. మరి బస్తర్ ప్రాంతంలోని ఆ గ్రామంలో, మహ్రా కులానికి చెందిన శ్మశానవాటికలో క్రైస్తవులను ఖననం చేయనివ్వకపోవడం, గ్రామ పంచాయితీ అభ్యంతరం చెప్పడం ఏ పాటి రాజ్యాంగబద్ధత అవుతుంది?
సమస్యలు, గొడవలు సాధారణంగా బతికున్న మనుషులకే ఉంటాయి. అయితే ప్రస్తుతం భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల మృతదేహాలు ప్రాథమిక హక్కు కోసం పోరాటం చేస్తున్నాయి! ఒక వ్యక్తి చనిపోయిన తరువాత, వారి ఆచారం ప్రకారం ఆ మృతదేహాన్ని ఖననం చేసే ప్రాథమిక హక్కు మీద సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం నడుస్తున్నది.
బస్తర్‌లో ఏడాది కాలంగా క్రైస్తవ ఆదివాసీల మృతదేహాలకు తమ గ్రామాలలో చోటు లేదని చెబుతూ, ఖననం చేసిన వారి మృతదేహాలను తవ్వితీస్తూ, వాటిని వేరే చోటుకు తరలిస్తున్నారు. దానికి కారణం వారు క్రైస్తవులు అయి ఉండడం. వారు మతం మారారు అని, అటువంటి వారికి చనిపోయిన తరువాత కూడా గ్రామంలో స్థానం లేదని, ఆదివాసీలకు మతం ఏమిటి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవ్వడం సహజం. షెడ్యూల్డ్ ట్రైబ్ గుర్తింపునకు మతంతో సంబంధం లేదనే ఒక రాజ్యాంగ నిబంధన ఉందనే అవగాహన కలిగి ఉండటం కూడా నేరం అయ్యేటట్టు ఉంది.
ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో వివిధ రాచరికాల కింద ఉన్న రాజ్యాలలో హిందుత్వ శక్తుల ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ మృతదేహాల వెలికితీతకు సంబంధించిన మూలాలు మాత్రం గత సంవత్సరం సుప్రీంకోర్ట్ ఒక కేసులో ఇచ్చిన తీర్పులో ఉన్నాయి. గత ఏడాది జనవరిలో బస్తర్ జిల్లాలో దర్భా మండలంలోని ఒక గ్రామంలో దళిత మహ్రా కులానికి చెందిన ఒక వ్యక్తి చనిపోయారు. ఆ గ్రామంలో సుమారుగా 6,500 జనాభాలో అత్యధికులు ఆదివాసీలు కాగా, సుమారుగా 200 మంది మహ్రా కులానికి చెందిన క్రైస్తవులు. ఆయన, ఆయన కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా క్రైస్తవులు. ఆయన క్రైస్తవ మత బోధకుడిగా కూడా పనిచేశారు. ఆయన క్రైస్తవుడు కాబట్టి, ఆయన మృతదేహాన్ని గ్రామంలో ఆ కులానికి సంబంధించిన శ్మశానవాటికలో ఖననం చేయడానికి వీలులేదని గ్రామ పంచాయితీ నిర్ణయించింది. ఆ కులానికి చెందిన శ్మశానవాటికలో క్రైస్తవులకు భాగం అనేది ఎప్పటినుంచో ఒక ఆచారంగా వస్తున్నది. ఈ కుటుంబంలో ఇంతకుముందు చనిపోయిన వారిని అక్కడే ఖననం చేశారు కూడా. అయినా కూడా ఈ వ్యక్తిని ఖననం చేయడానికి వీలు లేదని తీర్మానించారు. పోనీ కనీసం తమ స్వంత స్థలంలోనైనా ఖననం చేసుకుంటాం అంటే, కుదరదు. కావాలంటే 25 కి.మీ దూరంలో ఉన్న ఇంకొక గ్రామంలో ఉన్న క్రైస్తవ శ్మశానవాటికలో చేసుకోవాలని గ్రామపెద్దలు తేల్చిచెప్పారు. ఆ వ్యక్తి, కుటుంబం తరతరాలుగా నివసిస్తున్న గ్రామంలో, అందులోనూ స్వంత స్థలంలో ఖననం చేయనివ్వకపోవడం అన్యాయం అని చనిపోయిన వ్యక్తి కుమారుడు అధికారులకు విన్నవించుకోగా, అక్కడ కూడా తిరస్కరణే ఎదురయ్యింది. ఆ కేసు అధికారులను, హైకోర్టును దాటి సుప్రీంకోర్ట్ వరకు చేరుకుంది. ఇదంతా జరుగుతూ ఉండగా, ఆ వ్యక్తి మృతదేహం జగదల్‌పూర్ జిల్లా సర్వజన ఆసుపత్రి మార్చురీలో అలా పడి ఉంది!
ఒక వ్యక్తి ఖననం గురించిన కేసు సుప్రీంకోర్ట్ వరకు రావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఇరువురు సభ్యుల ధర్మాసనం తమ తీర్పు వెలిబుచ్చింది. కానీ ఆ తీర్పు మాత్రం ఆ విచారానికి అనుగుణంగా లేదు. ఇరువురు సభ్యులలో ఒకరు ‘రాజ్యాంగంలోని సమానత్వ హక్కు అనేది వ్యక్తి బతికి ఉన్నప్పుడే కాక చనిపోయినప్పుడు కూడా వర్తిస్తుంది కాబట్టి, ఆ చనిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులు తమ స్వంత స్థలంలో ఖననం చేసుకోవచ్చు’ అని చెప్పగా, ఇంకొక సభ్యుడు ‘అలా కుదరదు, మృతదేహాలను లైసెన్స్‌డ్ శ్మశానవాటికల్లో మాత్రమే ఖననం చేయాలి, కుటుంబ సభ్యుల స్థలం లైసెన్స్‌డ్ శ్మశానవాటిక కాదు కాబట్టి, గ్రామ పంచాయితీ చెప్పినట్టు 25 కి.మీ దూరంలో ఉన్న క్రైస్తవ శ్మశానవాటికలో ఖననం చేయాలి’ అని చెప్పారు. అలా, గ్రామ పంచాయితీ చెప్పిందే చివరికి నెగ్గింది.
ఇక్కడ కొన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ‘లైసెన్స్‌డ్ శ్మశానవాటికలో మాత్రమే ఖననం చేయాలని పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రూపొందించిన నియమాలు చెబుతున్నాయి’ అన్నప్పుడు, ఆ నియమాలు రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు, జీవించే హక్కుకు లోబడి ఉండాలి. జీవించే హక్కు, అనగా అధికరణ 21 పరిధిలోకి ఒక వ్యక్తి చనిపోయాక, ఆ వ్యక్తి పాటించిన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరపటం అనేది కూడా వస్తుంది అని సుప్రీంకోర్టే గతంలో పలుమార్లు చెప్పింది. ఆ గ్రామంలో మహ్రా కులానికి చెందిన శ్మశానవాటికలో క్రైస్తవులను ఖననం చేయడం ఎప్పటినుంచో జరుగుతున్నది. అంటే అది ఒక ఆచారం రూపు తీసుకున్నట్టు. మరి అటువంటి ఆచారాన్ని ఇప్పుడు ఒక గ్రామ పంచాయితీ, కొన్ని నియమాలు కాదనటం ఏ పాటి రాజ్యాంగబద్ధత అవుతుంది?
ఇప్పుడు ఈ తీర్పును అడ్డం పెట్టుకుని, క్రైస్తవ మృతదేహాలను తవ్వి తీసి, వాటిని వేరే చోట్లకు తరలించే హక్కును తమకు తాము దఖలుపరుచుకుని హిందుత్వ భావజాల వ్యక్తులు, సంస్థలు ఈ అనాగరికమైన పనికి పూనుకున్నాయి. దానికి స్థానిక అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం తమ మౌనం ద్వారా పరోక్ష మద్దతు అందజేస్తున్నాయి. ఇది ఏపాటి చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ పాలన? బస్తర్ ప్రాంతంలో మతం పేరు మీద జరుగుతున్న అనాగరిక చర్యలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గత దశాబ్దంగా బస్తర్ ప్రాంతంలో క్రైస్తవుల ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి. అనేక గ్రామాలలో ‘క్రైస్తవులకు చోటు లేదు, వారి మత కార్యక్రమాలకు అనుమతి లేదు’ అంటూ తీర్మానాలు జారీ చేయటం కూడా సాగుతోంది. ఇదంతా కూడా పెసా చట్టంలో ఆదివాసీల సాంస్కృతిక హక్కుల కోసం దఖలుపరిచిన నియమాలను అడ్డం పెట్టుకునే చేస్తున్నారు. అయితే పెసా చట్టం ఆదివాసీల సంక్షేమం, హక్కుల కోసం తీసుకువచ్చిన చట్టం కానీ, కేవలం ఒక మతానికి చెందిన ఆదివాసీల కోసం తీసుకువచ్చిన చట్టం కాదు. ఇటువంటి చర్యలకు న్యాయస్థానాలు కొన్నిసార్లు అడ్డుకట్ట వేసినా, చాలాసార్లు ఆమోదముద్ర వేస్తున్నాయి. ఇది అత్యంత బాధాకరం.
- గుత్తా రోహిత్
మానవ హక్కుల వేదిక