Share News

ఇల్లాలి గౌరవం పెంచిన తీర్పు

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:42 AM

సుప్రీంకోర్టు ఇటీవల ఇల్లాలి ఘనతను చాటేలా తీర్పు వెలువరించింది. పంజాబ్‌లో 2001లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఓ గృహిణికి రావాల్సిన పరిహారం విషయమై కేసు నడవగా, తుది తీర్పులో...

ఇల్లాలి గౌరవం పెంచిన తీర్పు

సుప్రీంకోర్టు ఇటీవల ఇల్లాలి ఘనతను చాటేలా తీర్పు వెలువరించింది. పంజాబ్‌లో 2001లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఓ గృహిణికి రావాల్సిన పరిహారం విషయమై కేసు నడవగా, తుది తీర్పులో ఆమె ప్రాముఖ్యతను ఎలా చూడాలో చెప్తూ సమాజానికి దిశానిర్దేశం చేసింది. పరిహారం లెక్క కట్టేటప్పుడు ఆమెను ఇంట్లో భర్త సంపాదనపై బతికే మనిషిగా చూడడం అన్యాయమని, ఆమెని చూడాల్సింది ఇంటిని నిలబెట్టే మూలాధారమని నొక్కి చెప్పింది. ఆమె చేసే సేవలు వెలకట్టలేనివి. అవి లేకుంటే ఇంట్లో వారి పనితీరు ప్రభావితమై, జాతి సంపదకు నష్టం వాటిల్లుతుంది. పరోక్షంగా ఆ కుటుంబమే కాకుండా దేశం ఆర్థికంగా నష్టపోతుంది కనుక, ఇల్లాలి పనికి ఖరీదు కట్టాల్సిందే అని చెప్పింది. ప్రస్తుతానికి ఆ సేవల్ని డొమెస్టిక్ వాల్యూగా లెక్కించి కనీసంగా నెలకు రూ.30 వేలుగా నిర్ణయించింది. ఒకవేళ ఆమె ఏదైనా ఉద్యోగంలో ఉంటే, ఇలాంటి నష్టపరిహారాలు లెక్కించేటప్పుడు తన జీతానికి అదనంగా డొమెస్టిక్ వాల్యూ కూడా కలిపి లెక్కించాలని తీర్పు చెప్పింది. ఆమె చేస్తున్న సేవల్ని ఆర్థికంగా గణించడం లేదు. అలా చూస్తే అవి దేశ జీడీపీలో 11శాతానికి తక్కువ ఉండదు. అంత చేసినా కుటుంబంలో, సమాజంలో కనీస గుర్తింపునకు నోచుకోని పాత్రధారిగా ఆమె మిగిలిపోతోంది. వాస్తవానికి ఆమే జాతి నిర్మాణానికి ఆధారం. మహిళ పాత్రని పురోగామి కోణంలో చూడడానికి, తగిన గౌరవం కల్పించడానికి ఈ తీర్పు మరోమెట్టు కాగలదు.

డి.వి.జి. శంకరరావు

Updated Date - Jun 17 , 2026 | 12:42 AM