Share News

ఆధునిక భారతానికి అతనే సర్కార్‌ !!

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:26 AM

‘భారతీయ చరిత్రకారులమైన మేము, ఏ ఇతర అజెండాను అనుసరించకుండా సొంత అజెండా ప్రకారమే రాయాలనుకున్న చరిత్రలనే రాశాము. అయితే ఇది గతించిన విషయం. ఆ మేధా స్వేచ్ఛ ఇప్పుడు లభించడం లేదు.

ఆధునిక భారతానికి అతనే సర్కార్‌ !!

‘భారతీయ చరిత్రకారులమైన మేము, ఏ ఇతర అజెండాను అనుసరించకుండా సొంత అజెండా ప్రకారమే రాయాలనుకున్న చరిత్రలనే రాశాము. అయితే ఇది గతించిన విషయం. ఆ మేధా స్వేచ్ఛ ఇప్పుడు లభించడం లేదు. అది వేగంగా కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోంది’– దశాబ్దాల తన మేధా కృషిని సింహావలోకనం చేసుకుంటూ ఆధునిక భారతదేశ చరిత్రకారుడు సుమిత్‌ సర్కార్‌ విచారగ్రస్తంగా చేసిన వ్యాఖ్యలవి.

ప్రతిభావంతమైన, సూత్రబద్ధమైన భారతీయ మార్క్సిస్ట్‌ చరిత్రకారులలో అగ్రగణ్యుడిగా సుదీర్ఘమైన, మేధో సంపద్వంతమైన జీవితాన్ని గడిపిన సుమిత్‌ సర్కార్‌ ఇతరులు రుద్దిన మూడు చారిత్రక అజెండాలను ఎదుర్కోవలసివచ్చింది. మొదటిది– గతాన్ని ఆర్థిక నియతి దృక్కోణంలో అధ్యయనం చేసే పిడివాద మార్క్సిజం; రెండోది– పోస్ట్‌ మోడర్నిజం, పోస్ట్‌ కలోనియలిజంల అంతస్సంబంధ ధోరణి. మానవ సామాజిక ప్రవర్తన అధ్యయనంలో అత్యంత ప్రభావశీలమైన ఈ మేధో ధోరణి అమెరికాలో స్థిరపడిన లేదా ఆ దేశంలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన భారతీయులను మరీ ముఖ్యంగా బెంగాలీ విద్యాధికులను విశేషంగా ఆకర్షించింది. మూడోది– సంఘ్‌ పరివార్‌ మతపరమైన మెజారిటేరియనిజం.


పోస్ట్‌ మోడర్నిజం, పోస్ట్‌ కలోనియలిజం ఆలోచనా స్రవంతుల ప్రభావ పరిధిలోనే ఉండిపోయేందుకు సుమిత్‌ సర్కార్‌ నిరాకరించారు. ఈ రెండు అత్యాధునిక చింతనాధోరణులను తిరస్కరించడంలో సబాల్ట్రన్‌ స్టడీస్‌ స్కూల్‌ లోని తన సహచరుల కంటే చాలా కచ్చితమైన, స్పష్టమైన వైఖరిని ఆయన తీసుకున్నారు. వ్యక్తి జీవితంలోను, సమాజ గమనంలోను ఆర్థిక శక్తులు నిర్వహించే పాత్రకు పోస్ట్‌ మోడర్నిజం, పోస్ట్‌ కలోనియలిజం తక్కువ ప్రాధాన్యమివ్వడాన్ని సుమిత్‌ సర్కార్‌ ఆమోదించలేకపోయారు. సంఘ్‌ పరివార్ హిందుత్వ భావజాలాన్ని ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. గతించిన యుగాల చరిత్రపై సంఘ్‌ తప్పుడు అవగాహనలు, వర్తమానంలో ప్రజాస్వామ్యానికి, బహుళత్వవాదానికి వాటి వల్ల ఎదురవుతున్న విషమ పర్యవసానాల కారణంగానే సంఘ్‌ పరివార్‌ ఔదలదాల్చిన మతపరమైన మెజారిటేరియనిజంను సుమిత్‌ సర్కార్‌ అమితంగా గర్హించారు.

మార్క్సిజంతో సుమిత్‌ సర్కార్‌ సంబంధం మరింత సంక్లిష్టమైనది. మార్క్సిస్టు చింతనలోని ఆర్థిక నిర్ణయవాదంతో ఆయన పూర్తిగా ఏకీభవించలేదు. భారతదేశంలో సామాజిక అసమానతలకు కులం, జెండర్‌ మూల స్తంభాలని, వర్గానికి ఉన్న ప్రాధాన్యమే ఆ రెండిటికీ ఉన్నదని ఆయన గుర్తించారు. సుమిత్‌ సర్కార్‌ తన సహచర చరిత్రకారులను దృష్టిలో ఉంచుకుని రాసిన పరిశోధనా పత్రాలలో గానీ, సామాన్య పాఠకులను దృష్టిలో ఉంచుకుని రాసిన వ్యాసాలలో గానీ మార్క్సిస్టు సిద్ధాంత పరిభాష ఉండదు. నాకు తెలిసినంతవరకు ఆయన ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ ఎప్పుడూ సభ్యుడిగా లేరు.

సుమిత్‌ సర్కార్‌ మొదటి పుస్తకం ‘ది స్వదేశీ మూవ్‌మెంట్‌ ఇన్‌ బెంగాల్‌ (1903–1908) 1973లో ప్రచురితమయింది. బెంగాల్‌ విభజనకు ప్రతిస్పందనగా ప్రజ్వరిల్లిన ఈ స్వదేశీ ఉద్యమం యావద్భారతావనిలో రగిల్చిన అపూర్వ సామాజిక, రాజకీయ చైతన్యాన్ని ప్రతిభావంతంగా వివరించడంతో పాటు ఆ ఉద్యమ వైఫల్యాలను కూడా ఆయన నిశితంగా విశ్లేషించారు.


1997లో ప్రచురితమైన సుమిత్‌ సర్కార్‌ మరో పుస్తకం ‘రైటింగ్‌ సోషల్‌ హిస్టరీ’లో బెంగాలీలకు ఆరాధ్యులు అయిన రామకృష్ణ పరమహంస, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌పై వ్యాసాలతో పాటు రాజకీయ భావజాలాల్లో కులం నిర్వహిస్తున్న పాత్ర, తాను అభిమానించే, లేదంటే ఆమోదించలేని చరిత్ర రచనా సంప్రదాయాలపై నిశిత విమర్శలతో కూడిన వ్యాసాలున్నాయి. ప్రస్తావిత రెండు పుస్తకాలూ మళ్లీ మళ్లీ చదవవలసిన పుస్తకాలే, సందేహం లేదు. అయితే సుమిత్‌ సర్కార్‌ రచనలలో అత్యంత ప్రసిద్ధమైనది ‘మోడరన్‌ ఇండియా: 1885–1947.’ మన స్వాతంత్ర్యోద్యమంపై సమగ్రమైన, ప్రామాణికమైన రచన అది. వలసపాలన చివరి దశాబ్దాల్లో ఘటనలు, పరిణామాలు, సామూహిక జాతీయవాదం ఆవిర్భావాన్ని సుమిత్‌ సర్కార్‌ అనితరసాధ్యంగా వివరించారు. ‘మోడరన్‌ ఇండియా’ రాయడంలో తన రెండు ఉద్దేశ్యాలను ఆ పుస్తకం ముందుమాటలో ఆయన ఇలా పేర్కొన్నారు: ‘మొదటిది– రాజకీయ, సామాజిక, ఆర్థిక చరిత్రలోని ప్రత్యేక సమస్యలపై ఇటీవలి కాలంలో వెలువడిన అనేక పరిశోధనా గ్రంథాలను, ఇంకా వెలికితీసిన అపార సమాచారాన్ని ఒక చోట చేర్చడం; రెండవది– నాయకుల కార్యకలాపాలు, ఆదర్శాలు లేదా వర్గ పోరాట వ్యూహాలకే జాతీయవాద చరిత్ర రచన ఇస్తున్న ప్రాధాన్యానికి ప్రత్యామ్నాయంగా.. కింది స్థాయి నుంచి (అంటే సామాన్య ప్రజల కోణం నుంచి) చరిత్రను రచించే అవకాశాలను పరిశీలించడం’. ఈ రెండు ఉద్దేశ్యాలు సంపూర్ణంగా నెరవేరాయి. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఉపఖండంలోని అన్ని ప్రాంతాలకు ఆయన సమప్రాధాన్యమిచ్చారు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే భారత జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన పోరాటాలు ఉద్యమాలకే కాకుండా, పరాయి పాలకులపై ఆదివాసీల, రైతుల తిరుగుబాట్లకు కూడా సమంజసమైన ప్రాధాన్యాన్ని సుమిత్‌ సర్కార్ ఇచ్చారు. హిందూ–ముస్లింల మధ్య విభేదాలు ఊపిరిపోసుకున్న తీరుతెన్నులు, దేశ విభజన విషాద ఘటనలను ఆయన గొప్ప నైపుణ్యంతో, కచ్చితత్వంతో వివరించారు. ఈ విశిష్టతల కారణంగానే, ప్రచురితమైన 43 సంవత్సరాల అనంతరం కూడా సుమిత్‌ సర్కార్‌ విరచితమైన ‘మోడరన్‌ ఇండియా’ భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రపై అత్యుత్తమ ఏక సంపుటి పుస్తకంగా వెలుగొందుతోంది.


‘మోడరన్‌ ఇండియా’లో కులంపై సుమిత్‌ సర్కార్‌ చూపిన శ్రద్ధ మార్క్సిజంపై ఆయన సంప్రదాయ విరుద్ధ వైఖరులను స్పష్టం చేస్తోంది. అంతకంటే ముఖ్యంగా మహాత్మాగాంధీ చారిత్రక ప్రాధాన్యంపై ఆయన భావాలు, అభిప్రాయాలు వారసత్వంగా సంక్రమించిన మనో వైఖరులను ఆయన ఎంతగా విడనాడారో కూడా స్పష్టం చేస్తాయి. మహాత్మాగాంధీ అహింసాత్మక పోరాటం విప్లవ కార్యాచరణ నుంచి ప్రజలను దూరం చేసే కపట వ్యూహమని మార్క్సిస్టు సిద్ధాంతకర్తలు రజనీ పామీదత్‌, మానవేంద్రనాథ్‌ రాయ్‌ అభిప్రాయపడ్డారు. అలాగే మత సామరస్యానికి మహాత్ముడు ఇచ్చిన ప్రాధాన్యం వర్గ పోరాటాల నుంచి జన బాహుళ్యాన్ని వేరు చేసే యుక్తి మాత్రమేనని కూడా ఆ ఇరువురు తీవ్రంగా విమర్శించారు. అయితే సుమిత్‌ సర్కార్‌ ఆ ఇరువురితో విభేదిస్తూ గాంధీ రాజకీయాలలో చాలా లోతైన నైతిక అంశాలు ఉన్నాయని అర్థం చేసుకున్నారు. గాంధీకి సంబంధించి అహింస, సత్యాగ్రహం అనేవి ‘ఒక గాఢమైన అనుభూతితో రూపుదిద్దుకున్న విశిష్ట తాత్వికతలు అని, వాటిలో మౌలికత ఉన్నదని, అది గణనీయమైనదేకాక విస్మరించరానిద’ని ఆయన స్పష్టం చేశారు. గాంధీ గురించిన సత్యాన్ని సర్కార్‌ సరిగానే గుర్తించారు. ‘సత్యాన్వేషణే మానవ జీవిత లక్ష్యం’ అని మహాత్ముడు అన్నారు. ఆయన ఇంకా ఇలా స్పష్టంగా చెప్పారు: ‘అంతిమ సత్యాన్ని ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. ఎవరికి వారు తమకు తోచిన పాక్షిక సత్యాన్ని ఇతరులపై హింస ద్వారా రుద్దడం పాపకార్యమే’. 1920ల తుదినాళ్ల పరిణామాలను చర్చిస్తూ గాంధీ గురించిన తన భిన్నాభిప్రాయాన్ని సుమిత్‌ సర్కార్‌ వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం సిద్ధించిన వేళ మతోన్మాదం పెచ్చరిల్లి, భయంకరమైన హత్యాకాండ చోటుచేసుకున్నప్పుడు హిందువులు–ముస్లింల మధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకు నౌఖాళీలో గాంధీ శాంతియాత్ర నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ, కలకత్తాలో నిరాహార దీక్షలు చేశారు. ఈ పరిణామాలు ‘మహాత్ముని అత్యుత్తమ ఘడియలు’ అని సుమిత్‌ సర్కార్‌ అభివర్ణించారు. మోడరన్‌ ఇండియా చివరి అధ్యాయంలో ఆయన ఇలా రాశారు: ‘మహాత్మాగాంధీ నిజమైన గొప్పతనం, విశిష్ట గుణాలు ఆయన జీవితం తుదినాళ్లలో స్పష్టంగా కనిపించాయి’. ప్రపంచం ముక్తకంఠంతో ఒప్పుకున్న సత్యమిది.


కొత్తగా వెలుగులోకి వచ్చిన ప్రాథమిక చారిత్రక సమాచారం ఆధారంగా, అవసరమైతే తన అభిప్రాయాలను మార్చుకోవడానికి సుమిత్‌ సర్కార్‌ వెనుకాడేవారు కాదు. ఆయన గొప్ప వచన రచయిత. పదాలను గొప్ప నైపుణ్యంతో ఉపయోగించేవారు. తన భావాలను సూటిగా, స్పష్టంగా చెప్పేవారు. లయబద్ధమైన వాక్యాలను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ కారణంగానే ఆయన పుస్తకాలు విద్వత్‌ లోకాన్ని దాటి సామాన్య పాఠకులకు ప్రీతిపాత్రమయ్యాయి. సుమిత్‌ సర్కార్‌ స్ఫూర్తిదాయక అధ్యాపకుడు కూడా. ఆయన బోధనా విధానం గాంధేయ పద్ధతిలోను, ప్రజాస్వామ్యయుతంగాను ఉండేదని జర్నలిస్ట్‌ రావిశ్‌ కుమార్‌ ప్రశంసించారు. తన విద్యార్థుల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని సుమిత్‌ అంగీకరించారు. స్త్రీవాద చరిత్రకారిణి అయిన సుమిత్‌ సతీమణి తనికా సర్కార్‌ ప్రభావం కూడా ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. తాను అభిమానించే చరిత్రకారుడు ఇ.పి.థాంప్సన్‌. చరిత్ర రచనలో పథ నిర్దేశం చేసిన థాంప్సన్‌ పుస్తకాల గురించి, ఇంకా అనేక రాజకీయ, సామాజిక అంశాలపైన ఆయనతో జరిపిన చర్చలు తన మనస్సుపై ప్రగాఢ ముద్ర వేశాయని సుమిత్‌ తరచూ చెప్పేవారు.

సామాజిక, మానవీయ శాస్త్రాలలో మౌలిక పరిశోధనలకు ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని సుప్రసిద్ధం చేసిన ప్రవాస బెంగాలీ మేధావులలో సుమిత్‌ సర్కార్‌ ఒకరు. కలకత్తాకే వారు పరిమితమైవుంటే బహుశా భారతీయ ఉన్నత విద్యా జగత్తు కీర్తికాంతులు అంత ఉజ్వలంగా ఉండేవికావేమో?! ఈ సత్యం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన తమిళ్‌, మహారాష్ట్రియన్‌, కన్నడిగ, ఉత్కళ, బిహారీ, పంజాబీ విద్వద్వరేణ్యులకు కూడా పూర్తిగా వర్తిస్తుంది. సుమిత్‌ సర్కార్‌ మరణంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసింది.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Aug 22 , 2026 | 12:30 AM