ఏభయ్యేళ్ల శ్రీవిశాఖ గ్రామీణ బ్యాంక్
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:23 AM
గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కమర్షియల్ బ్యాంక్ నైపుణ్యాలు, కో ఆపరేటివ్ బ్యాంక్ రూరల్ స్వభావం కలగలిసిన, తక్కువ వ్యయ నిర్మాణంతో..
గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కమర్షియల్ బ్యాంక్ నైపుణ్యాలు, కో ఆపరేటివ్ బ్యాంక్ రూరల్ స్వభావం కలగలిసిన, తక్కువ వ్యయ నిర్మాణంతో 30 సెప్టెంబర్, 1976న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం (ఆర్‌ఆర్‌బీ చట్టం–1976) ప్రకారం శ్రీవిశాఖ గ్రామీణ బ్యాంక్ ఏర్పడింది.
అప్పటికి రహదారులెరుగని గ్రామాలు, కొండకోనలు, అడవుల మధ్యన ఉన్న గూడేలు... సన్న, చిన్నకారు వ్యవసాయదారులు.. వ్యవసాయ ఆధార వృత్తిజీవులు.. చేతివృత్తుల కళాకారులు.. ఆర్థిక సహకారం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపార వ్యవస్థల మధ్య నలుగుతున్న గ్రామీణుల దగ్గరకు శ్రీవిశాఖ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది అడుగుపెట్టారు. అందులో నేనొకడిని. బ్యాంక్‌కు అవసరమైన భవంతి గానీ, సిబ్బంది నివసించడానికి సరైన గృహాలు గానీ లేని రోజులవి. రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు ప్రైవేట్ వాహనాల్లో బ్యాంక్ సరంజామా తీసుకువెళ్లడం, సిబ్బంది కాలి నడకన బ్యాంక్‌కు చేరడం, కాస్త స్తోమత గలవారి ఇంటిలో ఓ గదిలో నివాసం ఉండడం, పెళ్లిళ్లు కాని యువకులే ఎక్కువ కాబట్టి బ్యాంకే ఏకైక స్థావరం, కార్యస్థానం.
ఇప్పటిలా నెట్ బ్యాంకింగ్ కాదు, అంతా కాగితాధార కార్యాచరణే. ఇప్పుడు కంప్యూటర్‌తో చేసే పనులన్నీ అప్పుడు చేత్తో చేసేవాళ్లు. చాలావరకూ... బ్యాంక్ మొహం ఎరుగని కస్టమర్లు, అక్షరాస్యత లేని జనాలు. వీరి మధ్య బ్యాంక్ ప్రధాన కర్తవ్యాలైన– డిపాజిట్ల సేకరణ, రుణ పంపిణీలను శక్తికి మించి శ్రీవిశాఖ సిబ్బంది సాగించారు. ప్రభుత్వాలు ప్రకటించే సబ్సిడీ పథకాలపై ఒక్కోచోట గ్రామ పెత్తందార్లు, లిటిగెంట్ ప్రభుత్వ ఉద్యోగులతో సమన్వయం చేసుకొని అనేక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయాలు అందించి, వారిని ఆర్థికంగా ఆదుకోవడంలో శ్రీవిశాఖ కీలకపాత్ర పోషించింది. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సౌకర్యాలు లేని చోట బ్రాంచీలను ఏర్పాటు చేసి, పొదుపు సంస్కృతిని నేర్పింది. రైతులకు ప్రాధాన్యం ఇచ్చి సకాలంలో పంట రుణాలు అందించింది. స్వయం ఉపాధి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కుటీర పరిశ్రమలకు తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా అధిక భాగస్వామ్యం శ్రీవిశాఖదే.
కాలక్రమంలో ప్రభుత్వాల విధానాల్లో భాగంగా శ్రీవిశాఖ గ్రామీణ బ్యాంక్‌తో నాగార్జున, సంగమేశ్వర, మంజీర, కాకతీయ గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) 2006లో ఏర్పడింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘వన్ స్టేట్–వన్ ఆర్‌ఆర్‌బీ’ (ఒక రాష్ట్రానికి ఒకే గ్రామీణ బ్యాంక్) విధానాన్ని తీసుకురావడంతో, మే 1, 2025 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకులను (చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఏపీజీవీబీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖలు) విలీనం చేసి సరికొత్తగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తోంది.
బ్యాంక్‌లో మెసెంజర్ సిబ్బందిని టెంపరరీగా నియమించటం, రోజు కూలీ ఇవ్వడం... ఇలాంటి ఆర్థిక సమస్యలే గాక, సర్వీస్ రూల్స్, ప్రమోషన్లకు సంబంధించి న్యాయబద్ధ పద్ధతి లేకపోవడం వంటి అనేక సమస్యలపై పోరాటం చేయడమే గాక, ప్రజలకు నష్టదాయకమైన రూల్స్‌ను యాజమాన్యం పెడితే, వ్యతిరేకించటం శ్రీవిశాఖ సిబ్బంది కర్తవ్యాలయ్యాయి. ఈనాడు సాంకేతికంగా, బ్యాంకింగ్ పరంగా బ్యాంక్ అభివృద్ధి అయినట్టే– సిబ్బంది కూడా తమకు రావలసిన న్యాయబద్ధమైనవన్నీ పొందారు.
అలనాడు శ్రీవిశాఖ గ్రామీణ బ్యాంక్ సిబ్బందిగా జీవితాలను ఆరంభించిన వారిలో కొందరు మరణించారు. జీవించి ఉన్నవారు తమ ఏభయ్యేళ్ల అనుభవాలను, అనుభూతులను కలబోసుకోవడానికి బ్యాంక్ స్థాపన దినమైన సెప్టెంబర్ 30న విశాఖపట్నంలో సమావేశమవుతున్నారు. ఇది ఏభయ్యేళ్ల గుండె చప్పుళ్ల సంబరం.
- అట్టాడ అప్పల్నాయుడు