తెలుగు లంకాధీశుడు.. ఒక అన్వేషణ!
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:33 AM
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్యర్యంలో శ్రీలంకకి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన మనసులోతుల్లోకి దిగి నేటికీ వేదన కలిగిస్తూనే ఉంది. హైదరాబాద్‌లో కొలంబో విమానం ఎక్కేముందే..
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్యర్యంలో శ్రీలంకకి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన మనసులోతుల్లోకి దిగి నేటికీ వేదన కలిగిస్తూనే ఉంది. హైదరాబాద్‌లో కొలంబో విమానం ఎక్కేముందే బుద్ధప్రసాద్ ‘అమ్మా, శ్రీలంక ఆఖరు రాజులు మన తెలుగువారు కదా? అక్కడి క్యాండి (కంది)లోని వాళ్ల కోటల్ని తప్పకుండా చూడాలి’ అన్నారు. ‘అవును సార్, కన్నసామి నాయుడు (శ్రీ విక్రమరాజసింహ) కోట ఈ ప్రయాణంలో ప్రధానమజిలీ’ అన్నాను.
అత్యంత క్రూరుడైన రాజుగా శ్రీలంక చరిత్రలో నిలిచిపోయాడు కన్నసామి. ఆయనే శ్రీలంకకు ఆఖరు రాజు. కందిని పరిపాలించిన సింహళ రాజులు ఓ భిన్నమైన ఆచారాన్ని పాటించేవారు. వాళ్లు మదురై నాయక రాకుమారిలను వివాహం చేసుకుని, పట్టపురాణిలుగా ప్రకటించేవారు. ఒకవేళ రాజు పిల్లలు లేకుండా మరణిస్తే, పట్టపురాణి సోదరుడు కంది రాజయ్యేవాడు. అలా విక్రమ రాజసింహ రాజయ్యాడు. ఆయనకంటే ముందు పరిపాలించిన ముగ్గురు రాజులు కూడా మదురై నాయక రాజవంశీయులే. ఆ పద్ధతిలోనే రాజులైనవాళ్లే. తమ మాతృభాష తెలుగుగా వాళ్లు ప్రకటించుకున్నారు. అయితే వాళ్ల పాలనకాలంలో సింహళంతో పాటు తమిళం రాజ్యభాషగా ఉండేది.
విక్రమరాజసింహ క్రీ.శ. 1798లో క్యాండీ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అప్పుడు అతడి వయసు పద్దెనిమిదేళ్లు. రాజుని చెప్పుచేతుల్లో పెట్టుకుని, అధికారం చెలాయించాలని, అతడిని వధించి సింహాసనం అధిరోహించాలని కలలు కన్నాడు ప్రధానమంత్రి (మొదటి అడిగార్) పిలిమాతలవే. అయితే రాజ్య పరిరక్షణలో విక్రమరాజసింహ విజయాలు సాధించి అందనంతవాడయ్యాడు. 1803లో బ్రిటిష్ సైన్యం క్యాండిపైకి దండెత్తి వచ్చినప్పుడు చక్కటి వ్యూహంతో వాళ్లపై విజయం సాధించాడు.
రాజును చంపేందుకు పిలిమాతలవే అలుపెరగని పన్నాగాలు పన్నాడు. అతడి కుతంత్రం రాజుకు తెలిసి శిరచ్ఛేదం చేయించాడు. దీనితో రాజు మహాభయంకరుడు, క్రూరుడు అనే ప్రచారం రాజ్యమంతా ఊపందుకుంది. అయితే, రాజు ఆ తరవాత పిలిమాతలవే మేనల్లుడు ఎహిలెపోలాని ప్రధానమంత్రి చేయడం విధి వైచిత్రం. ఇక్కడి నుంచే రాజు పతనం ప్రారంభమైంది. 1814లో రాజును చంపేందుకు ఎహిలెపోలా కూడా కుట్ర పన్నడంతో విక్రమరాజసింహ అతడికీ మరణశిక్ష విధించాడు కానీ ఇతడు తప్పించుకు పారిపోయి కొలంబోలో బ్రిటిష్ వాళ్ల చెంతన చేరాడు. దీంతో ఎహిలెపోలా కుటుంబానీకి, పరిచారకులకు రాజు మరణశిక్ష అమలుపరచాడు. ఏడేళ్ల అతడి కుమారుడినీ వదిలిపెట్టలేదు. రాజ్యమంతా అశాంతికి గురైంది. క్యాండీపై దండెత్తి స్వాధీనం చేసుకోవాలని బ్రిటిషర్లకు ఎహిలెపోలా నూరిపోశాడు. అదే సమయంలో వర్తకం పేరున రాజ్యంలోకి వచ్చిన కొందరిని బ్రిటిష్ వేగులని అనుమానించి విక్రమసింహ శిరచ్ఛేదన విధించడమే కాక, వారి మొండాలను నాలుగు ముక్కలు చేసి రాజ్యమంతా ఊరేగించాడు. ఈ సంఘటన బ్రిటిషర్లను వెంటనే దండెత్తివచ్చేలా చేసింది. దేశం వెలుపలి నుంచి వచ్చిన వ్యక్తి తమపై ఇంతటి అధికారం చెలాయించడం నచ్చని సింహళ రాజ్య ముఖ్యులు కూడా బ్రిటిషర్లను నివారించే ప్రయత్నాలు చేయలేదు. బ్రిటిష్ సైన్యం సునాయాసంగా రాజ్యంలో, కోటలో ప్రవేశించింది. రాజును బందీగా చేసి తమిళనాడులోని వెల్లూరుకు తరలించారు. అప్పుడు అతడికి 35 ఏళ్లు. అలా బ్రిటిష్ పాలన ఆ ద్వీపదేశంలో 1815 నుంచి మొదలైంది.
క్యాండీలో నేరుగా రాజు కోట దగ్గరకే వెళ్లాం. ఈ ప్రాంగణంలో ఒకప్పుడు 18 భవనాలు ఉండేవట. నేడు రాజు కోట, రాణి కోట, శ్రీదలిద మాలిగవ బౌద్ధాలయం, ఓ మ్యూజియం లాంటివి మాత్రమే మిగిలాయి. సాయంత్రం ఆలయం ఎదురుగా ఉన్న ‘క్వీన్స్ హోటల్’లో కాఫీ తాగడానికి వెడితే, ఎదురుగా ‘లాస్ట్ కింగ్ ఆఫ్ శ్రీలంక’, ‘లాస్ట్ క్వీన్ ఆఫ్ శ్రీలంక’ పేరున్న ఫోటోలు పలుకరించాయి. క్యాండీ వాస్తు రీతికి చక్కని ప్రతీక దలద మాలిగవ ఆలయం. కోట, ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు. అష్టభుజి ప్రాంగణాన్ని, పక్కనే పెద్ద సరస్సును నిర్మించింది ఆఖరు రాజు విక్రమరాజని గైడ్ వివరించాడు. నేటి శ్రీలంక జెండాలో ఉన్న సింహపు గుర్తుకు ఆధారం కూడా విక్రమరాజసింహ రాజచిహ్నమనీ చెప్పాడు. మన కన్నసామి కీర్తి ఈనాటికీ ఆ దేశంలో రెపరెపలాడుతోందని ఆనందం కలిగింది. సాయంత్రం కావడంతో ఆలయం చాలా రద్దీగా ఉంది. క్యూలో ఉన్న మమ్మల్ని అక్కడి గోడమీద కళింగ రాకుమారి హేమమాలి, ఆమె భర్త దంతకుమారుడి తైలవర్ణ చిత్రాలు ఆకర్షించాయి. నాలుగో శతాబ్దంలో బుద్ధుడి ఎడమ దంతాన్ని ఆనాడు కళింగరాజ్యం నుంచి తన కొప్పులో దాచుకుని శ్రీలంక తీసుకువచ్చిన ఘనత హేమమాలిదే. ఆ దంతాన్ని గర్భగుడిలో బంగారు పేటికలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హేమమాలి శ్రీకాకుళంలోని దంతపురానికి చెందిన రాకుమారిగా ఆంధ్ర చరిత్రకారులు ఎప్పుడో రాశారు. ఆలయ గర్భగుడిని మరో నాయక రాజు కీర్తిశ్రీ రాజసింహ నిర్మించారట. ఈ తెలుగు బంధాలన్నీ క్యాండీ మనకు చాలా దగ్గరైన భావాన్ని కలిగించాయి. ఆయితే, ఆ రోజు రాజుకోటను చూడలేకపోయాం. మరుసటి రోజు కోట దగ్గరికి వచ్చి ముందుగా రాణి మహల్‌కి వెళ్లాం. ఆనాడు రాణి ఉపయోగించిన వంట సామగ్రి, సోఫాలు, పాత్రలు, ఆభరణాలు అన్నిటినీ యథాతథంగా ఉంచారు. పక్కనే ఉన్న మ్యూజియంలో దుస్తులు, ఆయుధాలు, వస్తువులను సంరక్షిస్తున్నారు. ఇంతలో శ్రీలంక మంత్రి పేషీనుంచి ఫోన్ రావడంతో కోలంబో బయలుదేరడంతో ఆ రోజూ కోటను చూడలేకపోయామన్న బాధ మిగిలిపోయింది.
మరుసటి ఉదయం తిరుగుప్రయాణానికి ముందు హోటల్ సిబ్బంది సలహామేరకు ఫోటోషూట్లకు ఎంతో ప్రసిద్ధిచెందిన ఇండిపెండెన్స్ స్వ్కేర్ వెళ్ళాం. పక్కన సముద్రం నుంచి చల్లని గాలులు వీస్తూ, తుంపర మొదలైంది. మేం ఓ పెద్ద భవనం దగ్గరికి వెళ్లి ఆగాం. ఇంతలో దాని వాచ్మెన్ మా దగ్గరగా వచ్చి ‘మీ రాజు ఇక్కడున్నాడు..’ అని తమిళంలో ఏదో చెబుతూ ముందుకు నడిచాడు. మాకు అర్థమయ్యీ అవ్వక అతడిని అనుసరించాం. అర్ధచంద్రాకారంలో ఉన్న ఓ చిన్న గదిలాంటి చోట ఆగాడు. ఆ గదికి ఉన్న గాజు కిటికీల్లోంచి లోపలికి చూస్తే, అక్కడ విక్రమరాజ విగ్రహం. మేం ఇన్ని రోజులుగా మిస్ అవుతున్న ఆ శ్రీలంక ఆఖరి రాజు మాకోసం ఇంత దూరం వచ్చాడా అనిపించింది. పది అడుగులు కూడా లేని ఆ చెరసాలలో రాజు, రాణి ఏడాది పాటు బందీలుగా గడిపారట. కొలంబోలో వాళ్ల ఆఖరి విడిది అదే. ఆ తరవాత వెల్లూర్కి బందీలుగా వెళ్లి, అక్కడే మరణించారు.
మన నాయక రాజులు శ్రీలంకను విడిచి 200 ఏళ్లు దాటినా సింహళీయులు వాళ్లను మర్చిపోలేదు. మేం తెలుగు వాళ్లమని గ్రహించి... ‘మీ రాజు ఇక్కడున్నాడ’ని ఆనవాళ్లు చూపిస్తున్నారు. అంతచిన్న వయసులో, అస్సలు సంబంధం లేని నేలకి, ఆకస్మికంగా రాజు అయి కన్నసామి ఎన్ని కష్టాలు పడి ఉంటాడో! ఇలా దేశదేశాల్లో తెలుగు కీర్తిని రెపరెపలాడించిన రాజులు ఎందరో తెలుగు రాజుల్ని మనం విస్మరించాం. ప్రభుత్వాలు, తెలుగు సంస్థలు, యూనివర్సిటీలు ఈ దిశగా మరిన్ని పరిశోధనలు చేస్తాయని ఆశిద్దాం.
- డి.పి. అనురాధ (జర్నలిస్టు)