ఈ వేగం వరమా, శాపమా?
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:40 AM
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల పరిశ్రమలకు ఇచ్చే ‘కన్సెంట్ టు ఎస్టాబ్లిష్’ (సీటీఈ), ‘కన్సెంట్ టు ఆపరేట్’ (సీటీఓ) అనుమతుల పరిశీలన కాలాన్ని గణనీయంగా తగ్గించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలీ...
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల పరిశ్రమలకు ఇచ్చే ‘కన్సెంట్ టు ఎస్టాబ్లిష్’ (సీటీఈ), ‘కన్సెంట్ టు ఆపరేట్’ (సీటీఓ) అనుమతుల పరిశీలన కాలాన్ని గణనీయంగా తగ్గించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలీ అదే బాట పట్టింది. దీనికి ప్రభుత్వాలు చెబుతున్న నినాదం... ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’. వ్యాపారాల వేగంకోసం పర్యావరణ పరిరక్షణను, ప్రజారోగ్యాన్నీ పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ వేగం ఎవరి పాలిట వరం, ఎవరి పాలిట శాపం అనే ప్రశ్న పౌర సమాజాన్ని వేధిస్తోంది.
పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం అనేది ఒక సాధారణ లైసెన్సో లేదా పరిపాలనా ప్రక్రియో కాదు. ఒక రసాయన పరిశ్రమ, రిఫైనరీ లేదా బల్క్ డ్రగ్ యూనిట్‌కు అనుమతి ఇచ్చే ముందు దానివల్ల గాలి, నీరు, భూమిపై కలిగే ప్రభావాలను శాస్త్రీయంగా అంచనా వేయాలి. పరిశ్రమ వాడే ప్రమాదకర రసాయనాల నిర్వహణ, ‘మెటీరియల్ బ్యాలెన్స్’, విషపూరిత వ్యర్థాలను శుద్ధిచేసే ఎఫెక్టివ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల సామర్థ్యం, ప్రమాద నివారణ వ్యవస్థలను నిశితంగా విశ్లేషించాలి. దీనికి సమయం, నైపుణ్యం అవసరం. ‘వేగం’ కోసం ఈ పరిశీలన కాలాన్ని కృత్రిమంగా తగ్గిస్తే అసలు లక్ష్యమే మారిపోతుంది. కాలుష్యాన్ని నివారించడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అనే చట్టబద్ధమైన బాధ్యతల స్థానంలో... కేవలం దరఖాస్తులను త్వరగా పరిష్కరించి కార్పొరేట్ సంస్థలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా మారుతుంది.
అమెరికా, కెనడా, జర్మనీ వంటి దేశాలలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను పర్యావరణ అనుమతులపై నేరుగా వర్తింపజేయరు. అక్కడ అనుమతులు ఎంత వేగంగా ఇచ్చారనే సంఖ్యాపరమైన ప్రమాణంతో కాకుండా, తీసుకున్న నిర్ణయాలు ఎంత శాస్త్రీయంగా, ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా ఉన్నాయనే కోణంలో నియంత్రణ సంస్థలను అంచనా వేస్తారు. ఇక్కడ మన వ్యవస్థకూ, సంపన్న దేశాల వ్యవస్థలకూ మధ్య ఉన్న ఒక అతిపెద్ద పారిశ్రామిక వైరుధ్యాన్ని గమనించాలి.
పాశ్చాత్య దేశాలలో పర్యావరణ అనుమతుల పరిశీలనను ఆయా ప్రభుత్వ సంస్థలలో ఉండే పూర్తిస్థాయి అధికారులూ, శాస్త్రవేత్తలే చేస్తారు. భవిష్యత్తులో పరిశ్రమ వల్ల ఏదైనా ముప్పు వాటిల్లితే, ఆ నిర్ణయం తీసుకున్న అధికారి చట్టానికి పూర్తి జవాబుదారీగా ఉంటారు. కానీ మన దేశంలో అనుమతులు పరిశీలించేది ప్రభుత్వ అధికారులు కాదు; విద్యాసంస్థల నుంచో, ఇతర పరిశోధనా సంస్థల నుంచో పార్ట్–టైమ్ సభ్యులుగా తెచ్చుకున్న ‘నిపుణుల కమిటీలు’. ఇవి కేవలం కొన్ని గంటల వ్యవధిలో వందల ఫైళ్లను తిరగేసి ముద్ర వేస్తాయి. భవిష్యత్తులో ఆ పరిశ్రమలో సిగాచి లాంటి పేలుడు సంభవించినా ఈ కమిటీ సభ్యులకు ఎలాంటి చట్టపరమైన బాధ్యతా ఉండదు. ఇలాంటి జవాబుదారీతనం లేని తాత్కాలిక కమిటీలకు, కేవలం 12 రోజుల్లో ఫైళ్లు క్లియర్ చేయాలని కాలపరిమితి విధించడం అంటే కార్పొరేట్ సంస్థల అక్రమాలకు చట్టబద్ధమైన ముసుగు వేయడమే.
అనుమతుల జారీలో వేగం లేకపోవడమే దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన అడ్డంకి అనే ఒక అపోహను నిరంతరం ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి గత పదేళ్లలో అనుమతులు పొందిన అనేక భారీ ప్రాజెక్టులు ఇప్పటికీ కేవలం కాగితాల మీదే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆలస్యానికి పెట్టుబడుల కొరత, మార్కెట్ పరిస్థితులు, భూసేకరణ లోపాలు, మౌలిక వసతుల లేమి వంటి అంశాలే అసలు కారణాలు. అలాంటప్పుడు, వృద్ధిరేటు పెరిగిపోతుందనే భ్రమతో పర్యావరణ పరిశీలన సమయాన్ని తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. కానీ దానివల్ల స్థానిక ప్రజలకు కలిగే పర్యావరణ, ఆరోగ్య ప్రమాదాలు మాత్రం అత్యంత భయంకరం.
పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం అంటే పరిశీలన సమయాన్ని కుదించడం కాదు; సిబ్బందిని పెంచడం, సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరచడం ద్వారా దాన్ని సాధించాలి. ఒకసారి ఫ్యాక్టరీల నిర్లక్ష్యం వల్ల నది కలుషితమైతే, భూగర్భజలం విషపూరితంగా మారితే, కాలుష్య వాయువుల వల్ల ప్రజల ఊపిరితిత్తులు దెబ్బతింటే... అవి తిరిగి పూర్వస్థితికి రావడానికి దశాబ్దాలు పడుతుంది. కొన్ని నష్టాలు అసలు పూడ్చలేనివి.
అభివృద్ధి వేగంగా జరగాలి, కానీ అది ప్రజల ఆరోగ్యాన్ని, ప్రకృతిని తాకట్టు పెట్టి కాదు. పర్యావరణ నియంత్రణ వ్యవస్థ మరింత బలంగా, మరింత శాస్త్రీయంగా, మరింత జవాబుదారీతనంతో ఉండాలి... కేవలం మరింత వేగంగా కాదు!
డా. కలపాల బాబూరావు
ఇవి కూడా చదవండి
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!